నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోవేలు 2:28వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు'' అని చెప్పబడిన ప్రకారము నేడు దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితములో దేవుని శక్తిని మరియు ఆత్మను మీరు కలిగియున్నట్లయితే, మీరు ప్రత్యేకించబడినవారుగా ఉంటారు. మీ జీవితము ఎంతో దైవీకముగా ఉంటుంది. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 10:38వ వచనమును మనము చూచినట్లయితే, "అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడై యుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను '' ప్రకారము యేసుక్రీస్తు కూడా దేవుని శక్తిని పొందుకున్నాడు. అందుకే ఆయన ఏమి చేసినను శక్తివంతముగా ఉంటున్నది. 

బైబిల్‌లో, పేతురు యొక్క జీవితమును చూడండి, యేసుక్రీస్తు ద్వారా ఎంపిక చేసుకోబడ్డాడు. పేతురు కూడా ఎల్లప్పుడు యేసయ్య ప్రక్కనే ఉంటూ, ఆయన చెప్పుచున్న వర్తమానములన్నిటిని కూడా వింటూ ఉండేవాడు. అయితే, వాటన్నిటి మధ్యలో కూడా యేసయ్య చెరపట్టబడి, తీసుకొని పోవుచున్నప్పుడు, పేతురు ఎంతో భయముతో నింపబడ్డాడు. మనుష్యుల యొక్క భయముతో పేతురు నింపబడ్డాడు. మనము బైబిల్ నుండి లూకా సువార్త 22:55-61వ వచనములలో చూచినట్లయితే, వారాయనను పట్టి యాడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అప్పుడు పేతురు యేసు ప్రభువును ఎరుగనని చెప్పాడు. అంతమాత్రమే కాదు, అతడు మూడుసార్లు యేసయ్యను తృణీకరించాడు. అయితే, యేసయ్య, పునరుత్థానమును పొందిన తర్వాత, తన యొక్క శక్తిని గూర్చి అతడు ప్రకటించాడు. వారందరు ఎలా దేవుని శక్తిని పొందుకోవాలనియు మరియు వారు దేవుని పాద సన్నిధిలో ఎలా వేచియుండాలని వారికి బోధించాడు. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయములో అనేక విషయములు దీనిని గూర్చి చెప్పబడియున్నవి. ఇంకను బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 1:14 వచనములో చూచినట్లయితే, " వీరందరును, వీరితో కూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి'' అని చెప్పబడిన ప్రకారము పేతురుతో కూడా ఉన్నటువంటి సహోదరీలందరు కూడా ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. నా ప్రియులారా, మూడుసార్లు యేసయ్యను ఎరుగనని చెప్పిన పేతురు కూడా దేవుని యొక్క శక్తిని పొందుకొని, గొప్ప పరిచర్య చేశాడు.

పేతురు దేవుని శక్తితో మరియు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి, యేసుక్రీస్తువలె పరిచర్య చేయనారంభించాడు. ఆలాగుననే, మా కుటుంబ జీవితములో చూచినట్లయితే, మా కుటుంబములో కూడా పరిశుద్ధాత్మతో నింపబడడము గురించి మాకు ముందు అంతగా తెలియదు. మేము మందిరమునకు మాత్రమే వెళ్లుచుండేవారము అంతే మాకు తెలిసినది. అయితే, ఆ తర్వాత, దేవుని శక్తిని మేము ఎలా పొందుకోవాలో ప్రభువు మాకు నేర్పించాడు. అంతమాత్రమే కాదు, మా కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన శక్తితో నింపాడు. ఇప్పటికి కూడా ప్రభువు తన మహిమార్థమై మా కుటుంబ సభ్యులందరిని గొప్పగా దేవుని పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియ స్నేహితులారా, కుటుంబముగా పనిచేయుట ఎంతో అద్భుతము కదా. అదేవిధముగా, ప్రభువు మిమ్మును అందరిని ప్రభువు ఆశీర్వదించబోవుచున్నాడు. కనుకనే, మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరు. అలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క ప్రభావమంతటితో మా యొద్దకు దిగివచ్చి మమ్మును నీ మహిమతో నింపుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరిస్తానని నీవు ఇచ్చిన శక్తివంతమైన వాగ్దానానికి నీకు వందనాలు. దేవా, నీవు అభిషిక్తుడవు. కాబట్టి, నీ శక్తితో మరియు నీ సన్నిధితో మమ్మును నింపుము. ప్రభువా, మా హృదయం నుండి ప్రతి భయాన్ని మరియు ఆందోళనకరమైన ఆలోచనను తొలగించి, విశ్వాసంలో మమ్మును ధైర్యపరచుము. దేవా, మేము మా యొక్క ప్రార్థనలో ప్రతిరోజూ నీ పాదాల వద్ద వేచి ఉండటానికి మాకు నేర్పుము. యేసయ్య, నీవు పేతురు జీవితాన్ని మార్చినట్లుగానే, నేడు మా జీవితాన్ని కూడా మార్చుము. ప్రభువా, దయచేసి మా జీవితాన్ని మరియు మా కుటుంబాన్ని నీ మహిమ కొరకు ఉపయోగపడునట్లుగా కృపను దయచేయుము. దేవా, ఈ లోకమునకు నీ గొప్పతనాన్ని ప్రతిబింబించే జీవితాన్ని కలిగి మేము జీవించునట్లుగా సహాయము చేయుమని యేసుకీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.