నా ప్రియమైన స్నేహితులారా, ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని మరల పలకరించడానికి నేను ఎంతగానో ఆనందించుచున్నాను. ఈ నూతన సంవత్సరములో మీకు సమస్తమును మేలుగా జరగాలనియు మరియు ఇది మీకు దీవెనకరముగా ఉంటుందని నేను తలంచుచున్నాను. అవును, ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మీ కొరకు కలిగియున్నాడు. కనుకనే, నేటి దినము మీకు దీవెనకరముగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 10:17,18వ వచనములను తీసుకొనబడియున్నది. ఆ వచనములో చూచినట్లయితే, " యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు. తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి'' అని చెప్పబడిన ప్రకారము అవును, ప్రభువు బాధపడువారిని జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దేవుడు శ్రమనొందియున్న వారి యెడల జాలి చూపించుచున్నాడు. ఒకవేళ, మీరు, ' నేను ఎంతో నిరుపేద కుటుంబంలో, ఒక చిన్న నగరం లేదా గ్రామం నుండి వచ్చాను, నేను ఒక చిన్న పట్టణములో జన్మించాను' అని మీరు అనుకుంటుండవచ్చును? మరియు మీరు ఆశ్చర్యపోవచ్చును, 'నేను ఎందుకు ఇక్కడ పుట్టాను? ఏలాంటి నిరీక్షణ లేకుండా నేను జీవించుచున్నాను? నాకు స్వాస్థ్యంగా ఇవ్వబడిన ఈ అప్పులు లేదా భరించలేని బాధ్యతలను కలిగి ఉంటూ, ఈ భాధ్యతలను ఎలా నేను భరించగలను? అని మీరు ఎంతో భారముతో, 'ప్రభువా, మా శ్రమలను ఒకసారి గమనించి చూడుము' అని మొరపెట్టుకోవచ్చును. కానీ, ఈ విధంగా బాధపడుచున్నవారి కోరికను దేవుడు వినియున్నాడు. ఆయన వారి బాధలను తప్పకుండా తీర్చును.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీ కష్టాలను జయించడానికి ప్రభువు మీకు బలమును ఇచ్చుచున్నాడు. ప్రభువు మీ పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ రోజు మీ బాధలను తీర్చడానికి, ప్రభువు మీ వద్దకు దిగి వచ్చుచున్నాడు. నా ప్రియులారా, ఈలాంటి శ్రమలను అనుభవించుచున్న పరిస్థితులలో కూడా మీరు చింతించకండి. అయితే, ప్రభువునందు మీరు సంతోషించండి. మీరు ఏమి పొందుకున్నను సరే, వాటన్నిటి మధ్యలో మీ స్వంత జీవితములో మీరు దేవుని పొందుకొనియున్నారు అని నమ్మండి. అందుకే పై వచనము ఈలాగున తెలియజేయుచున్నది, " నీవు బాధపడువారి కోరికలను వినియున్నావు,'' ప్రకారము బాధపడువారి కోరికలను వినడానికి ఆయన ఎదురుచూస్తున్నాడని ఈ వచనం చెబుతుంది. నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీ కోరికలను గురించి ఎవరూ పట్టించుకోలేదనియు లేదా ఎలాంటి పరిస్థితులలో కూడా ఇవి ఎన్నటికిని తీర్చబడవని మీరు అనుకోవచ్చును. కానీ, ప్రభువు మీ కోరికలను వినడానికి మరియు మీ బాధలను తీర్చడానికి ఆయన మీ మొరను ఆలకించడానికి ఎదురు చూచుచున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీకు బలమును ఇవ్వడానికి మరియు మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన మీ పక్షముగా ఉన్నాడు.

మా తాతగారైనటువంటి దివంగతులైన డా. డి.జి.యస్. దినకరన్‌గారు, సురండై అనే ఒక చాలా చిన్న గ్రామములో ఆయన జన్మించారు, అక్కడ ఎలాంటి సౌకర్యాలు, గొప్ప మౌలిక సదుపాయాలు, కలలు లేదా ఆశలు ఉండేవి కావు. ఆయన ఒక పేదవారుగాను, అనారోగ్యతో ఉండియున్నారు. కానీ, ఆయనకున్న పేదరికము మరియు సమస్యల కారణంగా ఒకసారి తన జీవితాన్ని అంతము చేసుకోవాలని ఆత్మహత్యను ప్రయత్నించారు. కానీ, మా తాతగారి యొక్క అంకుల్ ఆయనను యేసు ప్రేమ వైపు మరలునట్లుగాను, నడిపించారు. ఆయన ప్రభువును, ' దేవా, నీ జీవమును నా కొరకు సమర్పించావు కనుకనే, నేను కూడా అటువంటి జీవితమును పొందుకోవాలి, నీ జీవమును నాకు అనుగ్రహిస్తావా? ' అని అడిగారు. ప్రభువు మా తాతగారి హృదయాన్ని గొప్ప ప్రేమతో నింపి, ఆయన ప్రార్థనను ఆలకించాడు.ఆ రోజు నుండి తన జీవితాంతం వరకు, ప్రభువు ఆయనను విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనను తన బ్యాంకులో ఒక ఉద్యోగమును ఇచ్చి, ఉన్నత స్థానానికి హెచ్చించి, పరిచర్యలో ఆయనను బలముగాను మరియు శక్తివంతంగా వాడుకొని, తన శక్తివంతమైన సేవకునిగా మార్చుకున్నాడు. ఈ రోజు, లక్షలాది మంది ప్రజలు ఆయనను ఒక గొప్ప దైవజనునిగా ప్రేమించుచున్నారు మరియు గౌరవించారు మరియు ఘనపరచుచున్నారు. ఇది ఎంతటి గొప్ప రూపాంతరము కదా! కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా ఇటువంటి ఆశీర్వాదమును పొందుకొనుటకు సిద్ధంగా ఉండండి. మీరు కూడా మీ బాధలలో కూడా దేవునికి మీ జీవితములో సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు, బాధపడు మీ యొక్క కోరికను ఆయన వింటాడు, ఆయన మీ హృదయము స్థిరపరచి, మీ ప్రార్థనలకు చెవియొగ్గి ఆలకించి, మీ యొక్క బాధను తొలగించి, మిమ్మును ఆనందింపజేస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము బాధలో ఉన్నప్పుడు కూడా నీవు మా మీద చూపిన నీ యొక్క ప్రేమకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. దేవా, ఈ లోకం మమ్మును నిర్లక్ష్యం చేసినప్పటికిని, నీవు మమ్మును ఎంతో విలువైన వారినిగా భావించుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క ప్రేమ మా జీవితంలోనికి ప్రవహింపజేయుము, మమ్మును పోత్సహించుచూ, గొప్ప నిరీక్షణతో మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, నీవు ఈ రోజు మాలో కుమ్మరించుచున్న నూతన బలము కొరకు నీకు వందనాలు. ప్రభువా, నీవు మా కోరికలను మరియు మా ఆశలను నీ చేతులలోని బాధ్యతను తీసుకొనుము. ప్రభువా, నీ యొక్క పరిపూర్ణ చిత్తం ప్రకారం నీవు వాటిని మా పట్ల ఆశీర్వదించుము. దేవా, నీవు మమ్మును సంపూర్ణ విజయం వైపు నడిపించుము. ప్రభువా, నీవు మమ్మును నీకు ఘనమైన పాత్రగా వాడుకుంటూ, మమ్మును నీ సేవలో ప్రకాశింపజేయుము మరియు మమ్మును ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా మార్చుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.