నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములు తెలియజేయుటలో నాకెంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 17:9వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు’’ అని వాక్యం సెలవిచ్చుచున్నది. అంతకంతకు బలము నొందిన ఒక వ్యక్తిని గురించి మనము బైబిల్‌లో చూడగలము. బైబిల్ నుండి 2 సమూయేలు 3:1వ వచనమును చూచినట్లయితే, దావీదు అంతకంతకు బలము నొంది ప్రబలెను అని వ్రాయబడియున్నది. అతడు అంతకంతకు ఎలా బలము పొందుకొనగలిగాడు? బైబిల్ నుండి 1 సమూయేలు 24వ అధ్యాయములో చూచినట్లయితే, రాజైన సౌలును చంపే అవకాశము దావీదునకు వచ్చినది. దావీదునకు సౌలు  ఎంతో సమీపముగా ఉండెను. దావీదు అతనిని చంపి, అతి త్వరలోనే తదుపరి రాజు కావచ్చును. కానీ, సౌలు యొక్క ప్రాణాన్ని దావీదు చంపకుండా విడిచిపెట్టాడు. ఎందుకనగా, అతడు ప్రభువు యొక్క అభిషిక్తుడై యున్నాడు. అతని వస్త్రములో ఒక ముక్కను కోసి, అతనిని చంపకుండా అతని వదలిపెట్టాడు. దేవుని అభిషక్తుడైన సౌలు రాజు యొక్క రక్తము అతని చేతులకు అంటనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అతని చేతులను శుభ్రంగా ఉంచుకున్నాడు. అందుకని, 2 సమూయేలు గ్రంథములో దావీదు అంతకంతకు బలము నొంది ప్రబలెను అని మనము చదవగలము.  
నా ప్రియులారా, మనము శుద్ధ హృదయమును కలిగియుండు కొరకై మన చేతులను నిర్దోషముగా ఎందుకు ఉంచుకోవాలి? బైబిల్ నుండి కీర్తనలు 24:3,4వ వచనములను మనము చదివినట్లయితే, ‘‘ యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.’’ కాబట్టి, మనము ప్రభువు సన్నిధిలో నిలబడాలి అంటే, మనము యథార్ధమైన జీవితాన్ని మరియు నిర్దోషమైన చేతులును కలిగి ఉండాలి. అయితే, శారీరకంగా మాత్రమే కాదు, మనము చేయుచున్న ప్రతి పనిలో కూడా నిజాయితీగా మరియు యథార్థంగా ఉండాలి. ఇంకను మనము మోసాలు, అబద్ధాల నుండి దూరముగా ఉండాలి. మన పనిని మనము ఎంతో నిజాయితీగా చేసుకోవాలి. మనము చేయుచున్న ప్రతి పనిని కూడా యథార్థముగా ఉంటూ, కష్టపడుతూ చేయాలి. అది మన చేతులను మరియు మన హృదయాలను పరిశుద్ధంగా  ఉంచుంతుంది. మా తాతగారు చనిపోవడానికి ముందుగా, ఆయన చివరి మాటలను ఇలాగున తెలియజేశారు, ‘‘ నా చేతులు నిర్దోషముగా ఉన్నవి, నా హృదయము యథార్థముగా ఉన్నది, నా మాటలు శుద్ధముగా ఉన్నవి. ప్రపంచములో ఇప్పుడు నేను ఏ మనుష్యుని యెదుటనైను సరే ధైర్యముగా నిలబడగలను. ప్రభువు సన్నిధిలో కూడా నిలబడగలను అని చెప్పారు.’’ ఆ తర్వాత, ఆయన వెళ్లి, తన యజమానుని ముందు శుద్ధ హృదయముతో నిలబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక. అవును, నా ప్రియ స్నేహితులారా, ఆయన వారసత్వము ఈ రోజు కూడా దేవునిలో కొనసాగుతుంది.  సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. 

అదే విధముగా, నా ప్రియులారా, నేడు మీ జీవితములో కూడాను, మరియు మీ పని స్థలములలోను, ఉద్యోగములోను, బంధాలలోను, చదువులలోను మీ చేతులను నిర్దోషముగా ఉంచుకొని, మీరు నిజాయితీగా, యథార్ధత కలిగి జీవించినట్లయితే, తప్పుడు మార్గములో, సులభంగా మరొక స్థాయికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికిని కూడా, ‘నా చుట్టు ఉన్నవారు, అదే చేస్తున్నారు. కానీ, నేనెందుకు చేయకూడదు అని మీరు అనుకుంటున్నారా?’ కానీ,ఈ శోధలన్నిటి నుండి మిమ్మును మీరు కాపాడుకుంటున్నారా? నా ప్రియ స్నేహితులారా, మీ చేతులు నిర్దోషముగా ఉన్నట్లయితే, ప్రభువు మిమ్మును ఘనపరుస్తాడు. అందరి యెదుట ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. ఆయన మిమ్మును ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. ప్రభువు దావీదు ను ఘనపరచి, దేశమున కు రాజుగా నియమించినాడు. అదేవిధముగా, ప్రభువు ఫరో యెదుట యోసేపును ఘనపరచి, దేశములోని ఫరో క్రింద రెండవ పరిపాలకునిగా ఉన్నత స్థానములో ఉంచాడు. అదేవిధముగా, దేవుడు నేడు మిమ్మును కూడా ఘనపరుస్తాడు. బైబిల్ గ్రంథములో భక్తులైన దానియేలును ఘనపరచినట్లుగానే, దేశములో ఉన్నత అధికారులలో ప్రాముఖ్యము గలవానినిగా ఉంచాడు. ఎస్తేరు వలె ఉన్నత స్థానములో ఉంచాడు. ఆలాగుననే, నేడు మీ జీవితములో మీరు ప్రభువు యెదుట యథార్ధముగా జీవించినట్లయితే, ప్రభువు మిమ్మును ఘనపరుస్తాడు. కనుకనే, ఆయన మిమ్మును ఘనపరచాలంటే, మీ చేతులను నిర్దోషంగా ఉంచుకొన్నప్పుడు,  అంతకంతకు మీరు బలమును నొందెదరు. మీరు ఉన్నతముగా ఎదుగుతారు. మీ పరిస్ధితులన్నిటిని ప్రభువునకు అప్పగించండి. ఆయన అన్నిటిని చూచుకుంటాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క జ్ఞానము, వివేచన శక్తిని నీవు మాకు దయచేయుము. దేవా,  మేము యథార్థ హృదయముతో నేడు నీ యెదుట జీవించునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, మా మాటలను, చేతులను, అడుగులను, మా హృదయములను దీవించుము. ప్రభువా, నీ చిత్తానుసారముగా నడవవలసిన త్రోవలో  మమ్మును నడిపించుము. దేవా, మేము నీ కొరకు జీవించుచుండగా, మేము అంతకంతకు బలము నొంది, ఉన్నతమైన బలమును పొందుకొని, సమాజములో ఉన్నతమైన స్థాయికి ఎదుగునట్లుగా చేయుము. ప్రభువా, దేశములో, ఉన్నతముగా, సమాజములో ఉన్నతముగాను మమ్మును నిలబెట్టుము. ప్రియమైన ప్రభువా, మమ్మును శుభ్రమైన చేతులతో మరియు యథార్థమైన హృదయంతో జీవించమని పిలిచినందుకు వందనాలు. దేవా, ఎవరూ చూడనప్పుడు కూడా నిజాయితీగా నడవడానికి దయచేసి మాకు సహాయం చేయుము. దేవా, తప్పుడు కంటే నిజాయితీని మరియు రాజీ కంటే విశ్వాసాన్ని ఎంచుకోవడానికి మాకు నేర్పుము. ప్రభువా, మా చర్యలు నీ పవిత్రతను ప్రతిబింబించనట్లుగాను మరియు అలాగున చేయడం ద్వారా, నీ సన్నిధిలో మేము ఎక్కువ  బలంగాను మరియు బలంగా ఎదుగునట్లుగా చేయుము. ప్రభువా, మేము శోధించబడినప్పుడు మమ్మును బలపరచుము మరియు మేము నీకు నమ్మకంగా ఉండటానికి ఎంపిక చేసుకున్నప్పుడు మమ్మును ఘనపరచుము. దేవా, తగిన సమయంలో నీవు మమ్మును పైకి లేవనెత్తుతావని నమ్ముతూ మా పరిస్థితులన్నింటినీ మేము నీ చేతులలో ఉంచుచున్నాము. దేవా, మా చుట్టు ఉన్నవారికి మమ్మును దీవెనకరముగా మార్చుము. ప్రభువా, నీ బిడ్డలైన నాయకుల వలె మమ్మును లేవనెత్తుము. యేసయ్యా, మా శోధనలను మేము జయించునట్లుగా మాకు శక్తిని కలుగజేయుము. దేవా, మా చేతులను మరియు మా హృదయలను నిర్ధోషముగా ఉంచుకొనునట్లుగా నీ కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.