నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచూ, ఆశీస్సులు అందించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 36:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు'' ప్రకారం దేవుని యొక్క సమృద్ధి వలన మనము సంతృప్తి నొందాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. ఇది ఎంతటి గొప్ప వాగ్దానము కదా! అవును, ప్రియులారా, మీ హృదయమంతటితో ప్రభువును వెదకాలి, అప్పుడే ఈ ఆశీర్వాదములన్నిటిని పొందుకుంటారు. దావీదు ఎంతో ఆసక్తితో ప్రభువును వెదికాడు. బైబిల్ నుండి కీర్తనలు 63:1వ వచనములో మనము చూచినట్లయితే, " దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును'' మరియు కీర్తనలు 55:17 వ వచనములో "సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును '' అని చెప్పబడినట్లుగానే దావీదు ఎంతో ఆసక్తితో దేవుని వెదికాడు. అవును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము ఎల్లవేళల అతడు ప్రభువు సన్నిధిలో కనిపెట్టుకొనియుండెను. దావీదు ఒక రాజు అయినప్పటికిని కూడా ప్రభువును వెదకు సమయమును కలిగియుండెను. అనేకమంది ప్రజలు, 'అయ్యో నాకు చాలా పని ఉన్నది' అని అంటారు. 'నేను ఒక పెద్ద ఉద్యోగిని, నా కొరకు ఎంతో మంది ప్రజలు వేచి ఉంటారు. ఆలా ప్రార్థించడానికి నాకు అస్సలు సమయము లేదు అని అంటారు.' కానీ, నా ప్రియ స్నేహితులారా, మీరు ప్రభువు యొద్ద నుండి దీవెనలు పోగొట్టుకుంటున్నారు. దావీదు ఒక పెద్ద రాజు అతను ప్రభువు చేత ఎంతో ఘనంగా వాడబడ్డాడు. అయినను ఎందుకు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము ఎంతో ఆసక్తితో ప్రభువును వెదికాడు? అని మనము చూచినట్లయితే, అతడు దేవుని వెదకినందువలన ఆయన ఆశీర్వాదములను పొందుకొని ఆనందించగలిగాడు.
అవును నా ప్రియ స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే కార్యమును జరిగించాడు. బైబిల్‌లో అనేక చోట్ల యేసుక్రీస్తు సమయము దొరికినప్పుడల్లా వేకువజామున, రాత్రి సమయము తండ్రి యొద్ద సమయమును గడిపాడు అని చదువుతాము. మీరు కూడా ఆలాగున చేసినప్పుడు దేవుని సన్నిధానము మీ జీవితములో నిత్యము మీకు తోడుగా ఉంటుంది. బైబిల్ నుండి కీర్తనలు 34:10వ వచనములో చూచినట్లయితే, "...యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువై యుండదు'' అని చెప్పబడినట్లుగానే, ఎవరైతే, ప్రభువును జాగ్రత్తగా వెదకుతారో వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకను యెషయా 44:3వ వచనములో చూచినట్లయితే, "నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించెదను'' ప్రకారం ప్రభువు మిమ్మును పరిశుద్ధాత్మతో నింపుతాడని వాక్యము చెబుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడడము అనునది ఒక గొప్ప ఆశీర్వాదము. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? ప్రభువే ఈ పరిశుద్ధాత్ముడు. కాబట్టి, మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు ఆయన తన ఆత్మ శక్తిచేత మిమ్మును అద్భుతంగా నడిపిస్తుంటాడు. ఇంకను మన జీవితాలలో దేవుని ప్రణాళికల చొప్పున మనలను నడిపిస్తాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి నుండి ఉదయమున మధ్యాహ్నము మరియు సాయంత్రమున మరియు మీకు సమయము దొరికిన కొలది, ప్రభువు వైపు చూడాలని దావీదువలె ఇప్పుడే మీరు ఒక నిర్ణయము తీసుకొనండి. అప్పుడు ప్రభువు మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఇంకను మిమ్మును అద్భుతంగా నడిపిస్తాడు. ఆలాగుననే, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ఆ విధంగానే ముందుకు సాగుచున్నది. అదేవిధముగా, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును కూడా వాడుకుంటాడు. ప్రార్థనలో సమయమును గడపండి. పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువును వేడుకొనండి. అప్పుడు మీరు అద్భుతమైన విధానములో ప్రభువుచేత నడిపించబడతారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, మేము నీ వాక్యమును చదువుచుండగా, నీ పరిశుద్ధాత్మను పొందుకొనే దాహమును మాకు దయచేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము. యేసయ్యా, అడుగువారికి దయచేయస్తావని చెప్పినట్లుగానే, నేడు మా మీదికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము. దేవా, మమ్మును నీ మహిమార్థమై వాడబడునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీ యొక్క సజీవ వాక్కుకు మేము నీకు కతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, ప్రతిరోజు నిన్ను వెదకాలని కోరుకునే హదయాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, జీవితం నుండి ప్రతి సాకు మరియు సోమరితనాన్ని తొలగించుము. ప్రభువా, ఈ రోజు నుండి ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి ప్రార్థించుటకును మరియు నిన్ను వెదకుటకు మాకు నేర్పించుము. దేవా, మా పిల్లలు మరియు మా తరములపై నీ ఆత్మను కుమ్మరించుము. ప్రభువా, మా కుటుంబంలో నీ ఆశీర్వాదాలు నదివలె ప్రవహించనిమ్ము. దేవా, నీ రాజ్య మహిమ కోసం మమ్మును ఒక పాత్రగా ఉపయోగించుకొనుము. ప్రభువా, నీ ఆత్మ ద్వారా మమ్మును ఒక చక్కటి మార్గంలో నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.