నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు విలువైన నామమున మీకు శుభములు. ఈ రోజు బైబిల్ నుండి మనకు ఇవ్వబడిన వాగ్దానము కీర్తనలు 86:9వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు'' ప్రకారము ఇది ఎంతటి గొప్ప మహిమాన్వితమైన సత్యమో కదా! మన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ఆయన మానవ అవగాహనకు మించిన అద్భుతమైన కార్యాలను చేయుటకు సర్వశక్తిమంతుడై యున్నాడు. బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 10:17 మరియు ప్రకటన 15:3వ వచనములలో కనుగొనబడియున్నది, "ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహా దేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు'' ప్రకారము అదే సత్యమును చెప్పబడియున్నది. ఆయన మన పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అవును, ప్రభువు జరిగించు గొప్ప కార్యములు ఏమైయున్నవి? బైబిల్ నుండి యోబు 5:9 మరియు యోబు 9:10వ వచనములలో అటువంటి గొప్ప దేవునిని గురించి ఈ విధంగా చదవగలుగుచున్నాము. ఆ వచనము, " ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు'' మరియు "ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు'' ప్రకారము ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వకాలంలో గొప్ప కార్యాలు చేసిన ప్రభువు నేడు మీ జీవితంలో కూడా అదే కార్యాలను చేయబోవుచున్నాడు. నేటికిని, ఆయన శక్తి కొరతకాలేదు. ఆయన ప్రేమ మారలేదు. కనుకనే, ఆయన తగిన కాలములో మీ కొరకు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు.

నా ప్రియమైన వారలారా, మరల బైబిల్ నుండి కీర్తనలు 107:8,21,31వ వచనాల ప్రకారము, "ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక'' ప్రకారము మన పట్ల ఆయన జరిగించు ఆశ్చర్యకార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువుకు ఎప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనము ప్రభువు దీవెనలను పొందుకున్నప్పుడు మాత్రమే కాదు కానీ, ఎప్పుడైతే, మనము కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొంటుంటామో? లేక రక్తపు కన్నీరు కారుస్తుంటామో? అప్పుడు కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ జీవితములో ఇదివరకు మీరు పొందుకున్నటువంటి కృపను మరియు మేలులను మీరు జ్ఞాపకము చేసుకోవాలి. మరియు ఆయన మంచితనము, ఆయన కృపను బట్టి, మన హృదయలోతులలో నుండి ఆయనకు వందనాలు చెల్లించాలి. ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 136:4వ వచనములో చూచినట్లయితే, " ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును'' ప్రకారము శత్రువులైన ఐగుప్తు బానిసత్వము నుండి తన ప్రజలను ఆశ్చర్య రీతిగా ప్రభువు తన హస్తము నుండి విడిపించియున్నాడు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 14:17-31వ వచనములలో మనము ఈ విషయమును చదవగలము. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అదే దేవుని యొద్ద నుండి మీరు అద్భుతములను పొందుకొనగలరు. మీ సమస్యల నుండి ఆయన మిమ్మును రక్షించగలడు. ప్రభువు హస్తముల నుండి ఆశ్చర్యకార్యములను మీరు పొందుకొనగలరు. ఆయన ఎర్ర సముద్రమును రెండుపాయలుగా చీల్చి, తన బలమైన హస్తముతో తన ప్రజలను వారి శత్రువుల నుండి విడిపించాడు. అదే దేవుడు నేడు మన మధ్యలో సజీవంగా ఉన్నాడు మరియు నిరంతరము ఆయన మనలను ఏలుచున్నాడు. ఆయన ప్రతి ప్రమాదం, బంధకాలు లేదా అసాధ్యత నుండి మనలను విడిపించుటకు సమర్థుడై యున్నాడు.

నా ప్రియులారా, అటువంటి గొప్ప దేవుని నేడు నమ్మండి. ఎర్ర సముద్రాన్ని రెండుపాయలుగా చీల్చిన ప్రభువు మీ కొరకు మూయబడిన తలుపులను తెరుస్తాడు. ఆయన మీ దుఃఖాన్ని సంతోషంగాను, మీ కన్నీళ్లను సాక్ష్యాలుగా మరియు మీ బలహీనతలను బలంగాను మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీయు లేదు. ఆయన తన పిల్లల కొరకు గొప్ప మరియు అసాధ్యమైన కార్యాలను జరిగిస్తాడు. స్నేహితులారా, మీకు కావలసిందల్లా విశ్వాసం మరియు కృతజ్ఞత మాత్రమే. కనుకనే, మీరు ఆయన గతకాలములో మీ పట్ల చూపిన కనికరములను జ్ఞాపకం చేసుకుని, మీరు హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, మీ యెదుట నూతనంగా అద్భుత కార్యాలు జరిగించుటకు ద్వారములు తెరువబడతాయి. ఆయన వాగ్దానాలలో స్థిరంగా నిలబడి, ధైర్యంగా ఇలా ప్రకటించండి, 'నా దేవుడు గొప్పవాడు మరియు ఆయన నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు' అని చెప్పినప్పుడు, దేవుడు మీ పట్ల ఆశ్చర్యకార్యములను జరిగిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన ప్రేమగల మా పరలోకపు తండ్రీ, నీ అద్భుతమైన ప్రేమ కొరకై నీకు వందనాలు. దేవా, మా అవసరతలన్నియు తీర్చుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితంలో నీవు చేసిన అద్భుతమైన కార్యములన్నిటి కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసుప్రభువా, మా అవసరతల నిమిత్తము మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము, ఇప్పుడే, మా మొఱ్ఱలను ఆలకించి, మా అవసరతలన్నిటిని తగిన కాలమందు చక్కగా తీర్చుము. ప్రభువా, అద్భుతరీతిగా మాకు కావలసినవన్నియు నేడు నీవు అనుగ్రహించుము. దేవా, ఇప్పుడు మా అవసరతలలో కూడా కృతజ్ఞతతో నింపబడిన హృదయముతో మమ్మును దీవించుము. ప్రభువా, మేము బాధ మరియు కన్నీళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా, నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా హృదయం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో మరియు విశ్వాసంతో నింపబడి ఉండునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. ఓ ప్రభువా, మా కొరకు మరియు మా కుటుంబం కొరకు గొప్ప మరియు శక్తివంతమైన ఆశ్చర్యకార్యములను జరిగించుము. దేవా, మా యొక్క ప్రతి మూయబడిన ద్వారములను తెరవబడునట్లుగా చేయుము. ప్రభువా, మా యొక్క ప్రతి శత్రువు నుండి మరియు మా పట్ల పొంచియున్న ఉచ్చుల నుండి మమ్మును విడిపించుము. దేవా, మా జీవితంలోని ప్రతి ప్రాంతంలోనూ నీ అద్భుతాలు వ్యక్తపరచబడునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, ప్రతిరోజు నీ యొక్క సమాధానము, సంతోషము మరియు బలంతో మమ్మును నింపుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.