నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయుటలో నేను ఎంతో సంతోషించుచున్నాను. ఈ రోజున మన నిరీక్షణ దేవుని మీద కలిగియున్నాము. కనుకనే, అది మనకు శుభవార్తను తీసుకొని వచ్చుచున్నది. ఈ రోజున దేవుని యొక్క వాక్యము నుండి ఇట్టి నిరీక్షణను మనము పొందుకుందాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 35:4వ వచనమును చూచినట్లయితే, "తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేనికిని భయపడకండి, ధైర్యముగా ఉండండి. మీ దేవుడు మిమ్మును రక్షించుటకు మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ వచనమును చూచినట్లయితే, "భయపడుతూ, తత్తరిల్లు హృదయములతో ఉన్నవారలారా,'' అని ప్రారంభించబడుచున్నది. మనము భయపడుచున్నప్పుడు లేక మనలో భయము వచ్చినప్పుడు, అది నిజముగా మన హృదయమును ఎంతగానో గాయపరచుచున్నది. అంతమాత్రమేకాదు, మన గుండె ఎంతగానో వేగంగా దడగా, దడగా కొట్టుకుంటుంది. ఆలాగుననే, మన గుండెలో కూడా నొప్పి వంటి అనుభూతి మనకు కలుగుతుంది. మన జీవితములో మరణమును తీసుకొని వచ్చుచున్న రోగములను మరియు చెడు సమాచారములవంటివి ఏవైనా మనము వినినప్పుడు, మనము భయముచేత నింపబడిపోతాము. అంతమాత్రమే కాదు, మా జీవితము ఇంతటితో అంతమైపోతుందా? అని మనము అనుకుంటాము.

ఆలాగుననే, నా ప్రియులారా, మన జీవితమును నిర్ణయించే పరీక్షలు, మనకు సమీపమునకు వచ్చినప్పుడు మన గుండె చాలా వేగవంతముగా కొట్టుకొనుటకు ప్రారంభించుచున్నది. అనేకసార్లు, మన జీవితములో ఎదుర్కొంటున్న సమస్యల పట్ల భయపడుతుంటాము. అది మన జీవిత భవిష్యత్తు ఈ పరీక్షతో అంతమవుతుందా? ఆర్థిక ఇబ్బందుల వలన మరియు భవిష్యత్తు పట్ల తీసుకొను నిర్ణయము, ఇంకను కుటుంబము పట్ల తీసుకునే నిర్ణయములు మరియు బాధ్యతల వలన మన జీవితము ముగింపునకు వస్తుందా? అని అనిపస్తుంది. నాకు మార్కులు వస్తాయా? నేను అపజయము పొందుకుంటానా? నాకు భవిష్యత్తులేదా? నాకు పెళ్లి జరుగుతుందా? అని ఇట్టి భయకంపితమైన కార్యములు మన హృదయములోనికి వచ్చియున్నప్పుడు అవి మన గుండెను వేగముగా కొట్టుకొనునట్లు చేయుచున్నది కదా! అయితే, అస్సలు ఈ భయము మనలోనికి ఎప్పుడు వస్తుంది? నిరీక్షణ మనలో లోపించినప్పుడు, మనలో ఇటువంటి భయము కలుగుతుంది. మన జీవితములో కార్యములు జరుగుచున్నవన్న నమ్మకము లేనప్పుడు, కీడు కల్పించు పరిస్థితులలో నుండి మనము బయటకు వస్తామన్న విశ్వాసము మనకు లేనప్పుడు, అటువంటి క్ష ణములలో భయము మనలోనికి వచ్చుచున్నది. అటువంటి భయము మనలోనికి రావడము మనము అనుమతిస్తూ ఉంటాము. కనుకనే, నేటి దిన వాగ్దానము ఈలాగున చెబుతుంది, ' మీరు భయపడకండి, మీ దేవుడు మిమ్మును రక్షించుటకును మరియు మీకు సహాయము చేయుటకు మీ యొద్దకు వచ్చుచున్నాడు.' కానీ ఈనాడు ప్రభువు మనకు స్పష్టంగా గుర్తుచేయుచున్నాడు: భయపడకండి. మీ జీవితము మీద భయం అనేది చివరి మాట కాదు-దేవుని వాగ్దానమే చివరి మాటగా నిలిచి ఉంటుంది. అందుకే ఆయన ఇలాగున అంటున్నాడు, " మిమ్మును రక్షించడానికి మీ దేవుడు మీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే దేవుడు దూరంగా లేడు. ఆయన మీకు ఎంతో సమీపముగా ఉన్నాడు. కనుకనే, ఆయన మీకు విమోచన, స్వస్థత మరియు అద్భుతమైన విజయమును తీసుకురావడానికి ఆయన మీ పరిస్థితి వైపు చురుకుగా చలించుచున్నాడు. ఒకవేళ మీ జీవితములో అన్నీ ఆలస్యమగుచున్నట్లుగా అనిపించినప్పటికిని, దేవుడు తన హస్తములలో రక్షణతో ఇప్పటికే మీ యొద్దకు వచ్చియున్నాడు. కనుకనే, మీరు భయపడకండి. ధైర్యంగా ఉండండి.

అవును, నా ప్రియ స్నేహితులారా, మనం ఇతరుల భారములను కూడా మోయుచున్నప్పుడు, భయం తరచుగా మన హృదయాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించుచున్నది. ఒక నాయకుడు లేదా ఒక తండ్రి అనేకమంది జీవితముల పట్ల శ్రద్ధ వహించినట్లుగానే, మన హృదయములను కూడా కుటుంబము, పరిచర్య, ఉద్యోగము మరియు భవిష్యత్తు గురించిన చింతలతో నింపబడిపోవచ్చును. కానీ, మనము భయమును మాత్రమే భరించవలెనని దేవుడు ఎన్నడూ మన పట్ల ఉద్దేశించలేదు. భయము స్థానంలో తన వాక్యమును భద్రపరచుకొనమని మనలను ఆయన యొద్దకు ఆహ్వానించుచున్నాడు. నా ప్రియులారా, కనుకనే, మనము దేవుని వాక్యము వైపు మరలినప్పుడు, మన భయములకన్నా దేవుని వాగ్దానములు బలముగా మార్చబడతాయి. ఆయన వాక్యము గందరగోళంలోనికి శాంతిని, బలహీనతలోనికి బలమును, నిరాశలోనికి నిరీక్షణను తీసుకొని వచ్చుచున్నది. అందుకే, ఈ రోజు ఈ వాగ్దానమును గట్టిగా పట్టుకోండి: దేవుడు మిమ్మును రక్షించడానికి మీ యొద్దకు వస్తు రేపటి దినమున కలిగియుండు నిరీక్షణ కాదు, ఇది మనకు కలిగించుచున్న నమ్మకము. కనుకనే, నా ప్రియులారా, మీ హృదయం ఆయన వాక్యమునందు విశ్రమించునట్లుగా చేయుము. తద్వారా, మీలో విశ్వాసం మరల చిగురించనివ్వండి. ఎందుకంటే, మన దేవుడు నమ్మదగినవాడు; కనుకనే, ఆయన మీ భయములన్నిటిని తొలగించి, మిమ్మును నిశ్చయంగా రక్షిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మమ్మును రక్షించడానికి నీవు వచ్చుచున్నావని చేసిన అమూల్యమైన వాగ్దానమునకైనీకు వందనములు. ప్రభువా, మా హృదయంలో ఉన్న ప్రతి భయమును, చింతలనుు మరియు భారములను నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, నీ శాంతితో మమ్మును నింపి, మా విశ్వాసమును బలపరచుము. ప్రభువా, మా జీవితములో మేము ఎదుర్కొంటున్న చింతలకంటే నీ వాక్యాన్ని ఎక్కువగా విశ్వసించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ మహిమగల సన్నిధితో మా జీవితంలోని ప్రతి ప్రాంతంలోకి వచ్చి, మమ్మును విడిపించుము. ప్రభువా, నీవు చేయదగిన ప్రతికారమును నీవు జరిగించి, నీవు యొద్దకు వచ్చి, మమ్మును రక్షించుము. యేసయ్యా, ఈ రోజు మా పరిస్థితిలో నీ రక్షణ శక్తి ప్రత్యక్షమగునట్లు చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.