నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 20:2వ వచనమును, మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక'' ప్రకారం ప్రభువు మీకు సీయోనులో నుండి సహాయము చేస్తాడు. అవును, స్నేహితులారా, అనేకసార్లు మన జీవితములో ఎన్నో అవసరతలతో ఉండివచ్చును. నేను ఎంత ధనమును సంపాదించినను కూడా అందులో సగానికి పైగా నా యొక్క అద్దెలు, ఫీజులు, ఇఎమ్ఐలు కట్టడడానికి కొరకే సరిపోవుచున్నవి. నాకు అస్సలు ఏమి మిగలడము లేదు అని మీరు అంటున్నారా? మీకు ఎన్నో అప్పులున్నాయా? అప్పులు కట్టవలసినటువంటి గడువు తేదీ దగ్గరపడుచున్నప్పటికిని, మీ దగ్గర అస్సలు డబ్బులు కట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? మీ యొక్క డబ్బులన్నిటిని కూడా మీ ఖర్చుల నిమిత్తము చెల్లించి, తినడానికి ఆహారము కొనే పరిస్థితులలో కూడా మీరు లేరా? అన్నిటిని సద్దుబాటు చేయడము కొరకు అక్కడివి, ఇక్కడికి పెట్టడానికి ఎన్నో త్యాగాలు చేయుచున్నారా? కానీ, ప్రియులారా, సీయోనులో నుండి నేను మిమ్మును ఆదుకొనెదను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి మీకు సహాయము కలుగును గాక.
నా ప్రియులారా, మీరు మీ జీవితములో యథార్ధముగా జీవించుచుండగా, మీ నమ్మకమునంతటిని ఆయన మీద మీరు ఉంచుచుండగా, ప్రభువు మీ జీవితములో మీ కొరకు అద్భుతాన్ని చేస్తాడు. మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. మనము బైబిల్ నుండి అదే వాగ్దానమును చూడగలము. ఆ వాగ్దానము ఫిలిప్పీయులకు 4:19వ వచనమును మనము చదివినట్లయితే, " కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' ప్రకారం మన ప్రభువు మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యమును బట్టి క్రీస్తుయేసునందు మీకు సమస్తమును జరిగిస్తాడు. కాబట్టి, మీరు దేనిని గురించియు చింతించకండి, ప్రభువు మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. పరిశుద్ధ స్థలములో నుండి మీకు సహాయము కలుగుతుంది. సీయోనులో నుండి ప్రభువు మిమ్మును ఆదుకుంటాడు. దీని అర్థం దేవుడు తన పిల్లల యొక్క ప్రతి అవసరాన్ని సరైన సమయంలో మరియు సరైన మార్గంలో తీర్చగలడు. మీరు పరిష్కరించలేనిది దేవుడు ఒక్క క్షణంలో మార్చగలడు. ఆయన రొట్టెలను, చేపలను ఆశీర్వదించి, అందరికి పంచిపెట్టినట్లుగానే, మీ యొద్ద ఉన్న కొద్దిపాటి మొత్తము కూడా వృద్ధిపొందింపజేసి, సమృద్ధిగా మీకు అందించగలడు. కనుకనే, భయపడకండి, దేనిని గురించి నిరుత్సాహపడకండి. దేవుడు నమ్మదగినవాడు మరియు ఆయన మీ అవసరతలను నిశ్చయంగా తీరుస్తాడు.
కాబట్టి, నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మనం ప్రార్థనలో ప్రభువు సన్నిధికి వద్దాం. ఇప్పుడు మోకరించి, ప్రభువును అడుదామా? అవసరతలన్నిటి తీర్చమని ప్రార్థిద్దామా? ఇప్పుడే మోకరించి, ఆయన సహాయాన్ని పంపించమని వేడుకుందామా? ఆదుకొనమని ఆయనను అడుగుదామా? అవసరతలన్నిటిని తీర్చమని ప్రార్థిద్దామా? ఆయన నిశ్చయముగా ఈ రోజే మీకు అద్భుతాన్ని చేయనైయున్నాడు. మీరు అప్పులు, బిల్లులు లేదా అనుదిన అవసరాలతో ఇబ్బంది పడుచున్నట్లయితే, దేవుడు మీ కొరకు ఒక అద్భుతం జరిగిస్తాడని నమ్మండి. ఆయన పైనుండి తన సహాయాన్ని మరియు సహకారమును మీకు పంపుతాడు. ఆయన మీ కుటుంబాన్ని పోషిస్తాడు, మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు మరియు మీ చేతుల పనిని వ వృద్ధిపొందింపజేస్తాడు. అతి త్వరలోనే, దేవుడు మీ అవసరాలన్నింటిని సరైన సమయంలో తీరుస్తాడనియు మరియు మీ కష్టాల నుండి మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడనియు మీరు సాక్ష్యమిస్తారు. ఎందుకంటే, నా ప్రియులారా, మీరు ఆయన దృష్టిలో శ్రేష్టులు కనుకనే, మీరు దేనిని గురించి చింతించకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా అవసరాలన్నిటితో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, మేము అప్పులు మరియు ఖర్చులతో ఇబ్బంది పడుచున్నాము. దేవా, ఈ రోజు ఈ వాగ్దానము ప్రకారము మమ్మును మరియు మా కుటుంబమును దీవించుము. ప్రభువా, మా కుటుంబాన్ని మా బిడ్డలను పోషించుటకు మాకు సరిపోయిన డబ్బును మాకు దయచేయుము. దేవా, మా పిల్లల మరియు మా యొక్క ఫీజులు సరియైన సమయములో కట్టుటకు మాకు పరిశుద్ధ స్థలములో నుండి మాకు సహాయమును పంపించుము. ప్రభువా, మా చేతుల కష్టార్జితమును వృద్ధిపొందింపజేయుము. దేవా, మేము నీ రాజ్యము కొరకు విత్తడానికి మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, క్రీస్తు యేసు మహిమలో మా యొక్క ప్రతి అవసరము తీర్చబడునట్లుగా చేయుము. దేవా, మాకు ఏమియు కొదువ లేకుండా, మా జీవితములో మమ్మును హెచ్చించుము. ప్రభువా, మా కుటుంబము మరియు మా పిల్లలు దీవించబడునట్లుగా చేయుము. దేవా, మా చేతి పనులను ఆశీర్వదించుము, మా కొరకు అద్భుతమును జరిగించుము. ప్రభువా, మా చేతులలో ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని విస్తరింపజేయుము, మా ఫీజులు, బిల్లులు మరియు అద్దెను సకాలంలో చెల్లించడానికి మాకు సీయోను నుండి సహాయం చేయుము. దేవా, మా యొక్క అప్పుల భారాన్ని ఇప్పుడే తొలగించి మాకు విడుదలను అనుగ్రహించి, సరియైన సమయములో మాకు తగిన సహాయము మా యొద్దకు పంపించుము, నీ మంచితనమునకు మేము నీకు సాక్షులుగా జీవించునట్లుగా కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.