నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయడం ఎంతో అద్భుతముగా ఉన్నది. నేడు మనము ఒక దేవుని కుటుంబముగా మరియు కుటుంబ పెద్ద యొక్క మాటలను ఆలకించుటకు ఇక్కడకు వచ్చియున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 97:10వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును'' ప్రకారం దేవుని అధికముగా ప్రేమించినప్పుడు, చెడుతనమును మనము ద్వేషిస్తుంటాము. మనము చెడును వెంబడించలేము. అది మన ఆత్మను మరియు ప్రాణమును వెంబడిస్తుంది. ఇక్కడ మాత్రమే దేవుడు ఒక దానిని ద్వేషించమని మనకు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. ఎందుకంటే, ఆయన చెడుతనమును ఎంతగానో ద్వేషించుచున్నాడు. మన జీవితములో అది ఉండకూడదని అనుకుంటాడు. అది మనకు ఏమి చేస్తుందో ఆయన ఎరిగియున్నాడు.
నా ప్రియులారా, దేవుడు సృష్టి ఆరంభములో నరుని తన స్వరూపములో సృజించి యున్నప్పుడు, నరుని జీవితము ఎంత మహిమవంతముగా ఉండియున్నదో ఆయన చూచియున్నాడు. నరుడు దేవునితో అత్యంత సమీపముగా ఎలా నడిచియున్నాడో, అధికారముతో భూమిని పరిపాలన చేయు స్థాయిలో నడిచిన విధానమును గమనించియున్నాడు. నరుని జీవితములో దైవాశీర్వాదములను చూచియున్నాడు. కానీ, అదే సమయములో నరునిలోనికి పాపము ఏలాగున ప్రవేశించినదో ఆయన అదియు చూచియున్నాడు. మనుష్యుడు ఎప్పుడైతే, దేవుని సంబంధము కాని దానిని తన జీవితములోనికి అంగీకరించి యున్నాడో, ఆ ఫలము కావాలని కోరుకున్నాడు. దేవుడేమో, అతను తినకూడదని నిర్ణయించుకున్నాడు. అతడు దేవునికి అవిధేయుడు కావాలని ఎంపిక చేసుకున్నాడు. ఇట్టి పాపపు చర్యలు మనుష్యులలోనికి శాపమును తీసుకొని వచ్చాయి. అది అతనిని దేవుని యొద్ద నుండి వేరుపరచియున్నది. నరుడు ఏ రీతిగా మహిమ నుండి పతనమైపోయి ఉన్నాడని ఆయన చూచియున్నాడు. అందుచేతనే, ఇట్టిది మన జీవితములో ఉండకూడదనియు ఆయన మన పట్ల కోరుచున్నాడు.
అందుచేతనే, మానవులమైన మనలను పాపము నుండి రక్షించడానికి ఆయన తన రక్తమును చిందించి, తన ప్రాణమును సమర్పించుట కొరకే ఈ లోకమునకు మానవునిగా దిగి వచ్చాడు. తద్వారా, ఎల్లవేళల, ఆయనతో జీవించునట్లుగాను, మనము ఆయనతో ఐక్యపరచి ఉండునట్లుగాను, తద్వా రా మనము దైవాశీర్వాదములలోనికి ప్రవేశించునట్లుగా, ఆయన మనలను ప్రేమించి, ఇట్టి ఆశీర్వాదములను కలిగి ఉండాలని మన పట్ల కోరుచున్నాడు. అందుచేతనే, యేసు ఒక యౌవనస్థుని గురించి ఆయన మాటలాడియున్న సందర్భములో, అతడు తన తండ్రి యింట సకల సౌకర్యముల మధ్య జీవించాడు. అయితే, సమస్తమును విడిచిపెట్టి, ఆస్తిలో తన భాగమును తీసుకున్నాడు. లోకభోగేచ్ఛలతో, తన స్నేహితులతో కలిసి ఆనందించునట్లుగా తన తండ్రి యింటిని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అతడు తన తండ్రి యింట తాను అనుభవించవలసిన ప్రయోజనములన్నిటిని కోల్పోయాడు. అట్టి భోగేచ్ఛలన్నియు కొద్దికాలము మాత్రమే. తన దగ్గర ఉన్న ధనము వ్యయమైపోయిన వెంటనే, ఆ భోగేచ్ఛలన్నియు కూడా అనుభవించడానికి వీలు లేదు. అతని యొక్క నామాకార్థ స్నేహితులు అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. తన తండ్రి యింట లేనటువంటి ఆ యొక్క శూన్యమును అతడు అనుభూతి చెందాడు. చెడు తనము ఇట్టి కార్యములను తీసుకొని వస్తుంది. కనుకనే, ఆయన మనలను చూచి, ' మీరు, నన్ను ప్రేమించండి, చెడుతనమును ద్వేషించండి, నా యింట నిలిచి ఉండండి, తద్వారా నా యింట ఉన్న ఐశర్యమును మీరు అనుభవించి, ఆనందించవచ్చును' అని ఆయన మనలను పిలుచుచున్నాడు. ఆయన మన ప్రాణములను మరియు ఆత్మలను భద్రపరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా మనము ఇటువంటి ఆశీర్వాదమును పొందుకుందాము. దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఈ లోకములో అన్నిటికంటె మిన్నగా నిన్ను ప్రేమించుటకు మాకు నేర్పించావు, అటువంటి హృదయమును ఇప్పుడే మాకు దయచేయుము. అది నీ కొరకు ఆశించునట్లుగా, నిన్ను ప్రేమించి, నిన్ను వెదకునట్లుగా మాకు కృపను దయచేయుము. దేవా, పాపము మా యొక్క ప్రాణమును ఏ మాత్రము నాశనము చేయుకుండా చేయుము. యేసయ్యా, దుష్టభోగేచ్ఛలకు సంబంధించిన వాటన్నిటిని నేడు మేము వెంబడించకుండా, మమ్మును నీలో భద్రపరచుకొనుము. ప్రభువా, మా హృదయాలను మరియు మా ప్రాణములను కాపాడుము. మాలో నీ కొరకైన ప్రేమను భద్రపరచుము. దేవా, మేము అనుసరించిన చెడుతనమంతటిలి మాలో నుండి తొలగించుము. ఇట్టి భోగేచ్చలు మాలో నుండి ఎన్నటికి ఉండకుండా మమ్మును పరిశుద్ధపరచుము. ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధత యొక్క ఆనందాన్ని మరియు చెడుతనము యొక్క ప్రమాదాన్ని మాకు చూపించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నిన్ను గాఢంగా ప్రేమించడం మరియు నీవు ద్వేషించే వాటిని ద్వేషించడం మాకు నేర్పుము. దేవా, దయచేసి మా ఆత్మను దుష్టత్వం నుండి కాపాడుము మరియు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, తాత్కాలిక ఆనందాల ద్వారా మేము ఎప్పుడూ మోసపోకుండా ఉండునట్లుగా చేయుము. కానీ దేవా, నీ యొక్క శాశ్వతమైన ఆశీర్వాదాలను గట్టిగా పట్టుకోవడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును మరల నీ వైపునకు నడిపించుము మరియు నీతో మా సంబంధాన్ని పునరుద్ధరించుము. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ నీలో ఉండాలని ఎంచుకుంటున్నాము, కనుకనే, నేడు మమ్మును ఆ విధంగా నడిపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.