నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నేటి వాగ్దానముగా యోహాను 15:15వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని''ప్రకారం మిమ్మును స్నేహితులని పిలుచుచున్నాడు. ఎంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు కదా! దేవుడు మనలను కేవలం దాసులనుగా మాత్రమే కాకుండా, తన స్నేహితులని పిలుచుచున్నాడు. ప్రియులారా, 'స్నేహితుడు' అనగా, మరొకరి హృదయాన్ని, రహస్యాలను మరియు ప్రణాళికలను తెలిసిన ఒక వ్యక్తి. కనుకనే, ప్రభువు తన రహస్యాలను మీకు బయలుపరుస్తానని వాగ్దానం చేయుచున్నాడు. మీరు ఆయన స్నేహితులు కనుకనే, ఆమోసు 3:7వ వచనములో చూచినట్లయితే, "తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు'' ప్రకారం తన చిత్తంలో నడవడానికి మిమ్మల్ని బలపరుస్తాడు. బైబిల్ నుండి సామెతలు 17:17వ వచనములో చూచినట్లయితే, "నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును'' ప్రకారం దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. కనుకనే, ద్వితీయోపదేశకాండము 7:13వ వచనములో చూడండి, " ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి... దీవించును'' ప్రకారం ఈ రోజు ఆయన మిమ్మును ప్రేమించి, ఆశీర్వదించి, విస్తరింపజేస్తాడు. ఆలాగుననే, అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు మరియు అతను దేవునితో ప్రవచనాత్మకంగా నడిచాడు కాబట్టి, అతను కలిగియున్న వాగ్దానాలన్నియు నేటికి ఇశ్రాయేలు వంశమును బలపరుచుచున్నాయి. అదేవిధంగా, మీరు కూడా దేవుని స్నేహితులుగా నడుచుకున్నప్పుడు, ఆయన వాగ్దానాలు మీ ద్వారా మరియు మీ తర్వాత తరాల ద్వారా నెరవేర్చబడతాయి.
నా ప్రియులారా, దేవుడు మిమ్మును స్నేహితులుగా పిలువబడుట మాత్రమే కాదు, ఆయన ప్రవచనాత్మకమైన అభిషేకముతో అభిషేకించాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే అపొస్తలుల కార్యములు 2:17వ వచనములో ఈలాగున తెలియజేయుచున్నది, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు'' ప్రకారం ఈ కడవరి కాలములో దేవుడు అందరి మీద తన ఆత్మను కుమ్మరించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇంకను దానియేలు 2:28లో చూచినట్లయితే, "అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను...'' ప్రకారం దానియేలునకు పరిశుద్ధాత్మ ద్వారా మర్మములను బయలుపరచాడు మరియు ఆదికాండము 41:25వ వచనములో తెలియజేసినట్లుగానే, "అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను'' ప్రకారం ఐగుప్తులో కరువు గురించి యోసేపుకు జ్ఞానాన్ని ఇచ్చి, కరువు నుండి తప్పించినట్లుగానే, నేడు దేవుడు మీకు కూడా మీ యొక్క భవిష్యత్తును బయలుపరుస్తాడు. అదేవిధంగా, మీరు ప్రార్థన చేయడానికి, సిద్ధపడడానికి మరియు ఇతరులను నడిపించడానికి ప్రభువు రాబోయే వాటిని మీకు చూపించగలడు. ఆయన తన హృదయాన్ని భయంతో కాదు, భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి తన స్నేహితులైన వారిని బలపరచడానికి తన మర్మములను బయలుపరుస్తాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు కూడా దేవుని యొక్క స్నేహితులుగా ఈ పిలుపును అంగీరించినప్పుడు, మీరు ఆయన మర్మములను వినడమే కాకుండా కుటుంబాలు, సంఘాలు మరియు దేశాలు, ఇంకను సమాజము కొరకు మధ్యవర్తిగా ఉంటూ, అందరి కొరకు విజ్ఞాపనము చేయడానికి ఆయన అధికారాన్ని కూడా మీరు కలిగియుంటారు.
నా ప్రియులారా, కేవలం ఈ కాలంలో కూడా, దేవుడు తన స్నేహితులైన ప్రవక్తలకు తన ప్రణాళికలను బయలుపరచుట కొనసాగించుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా, దర్శనాలు, కలలు మరియు దేశాలను గురించి, ప్రకృతిక సంఘటనలను గురించి మరియు సంఘానికి సంబంధించిన మర్మములను గురించి ప్రవచనాలుగా బయలుపరచుచున్నాడు. ఈ ప్రత్యక్షతలు మనము హెచ్చింపబడడానికి కాదు, ప్రార్థనలో నిలబడటానికి మరియు ఉజ్జీవాన్ని తీసుకురావడానికి మరియు ఆయన రాకడలో మనలను సిద్ధపరచడానికి మాత్రమే. ఆలాగుననే, దేవుడు అబ్రాహాము, దానియేలు మరియు యోసేపులకు తన ప్రణాళికలను అప్పగించినట్లుగానే, ఇప్పుడు ఆయన మీకు కూడా అప్పగించాలనుకుంటున్నాడు. ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడటం చూడటానికి ఆయనతో ప్రార్థించడానికి, విజ్ఞాపనం చేయుటకును మరియు ఆయనతో పాలిభాగస్థులగుటకు తన స్నేహితులనుగా మిమ్మును పిలుచుచున్నాడు. మీరు ఆయన స్నేహితులుగా ఆయనతో నడిచినప్పుడు, మీరు ఆయన ప్రేమను గుర్తెరుగుతారు, ఆయన స్వరాన్ని వింటారు మరియు అనేకులను ఆశీర్వదించడానికి ఆయన అధికారాన్ని మోసుకెళ్లునట్లుగా మిమ్మును సిద్ధపరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మమ్మును నీ స్నేహితులనుగా పిలిచినందుకు నీకు వందనాలు. దేవా, నీ మర్మములను మరియు ప్రణాళికలను నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచుము. ప్రభువా, ప్రజల కొరకు మరియు దేశాల కొరకు విజ్ఞాపనము చేయుటకు మమ్మును ప్రవచనాత్మక కృపతో అభిషేకించుము. దేవా, నీ ప్రేమతో మమ్మును నీ యొద్దకు చేర్చుకొని, మమ్మును ఆశీర్వదించి, అభివృద్ధిపరచుము. ప్రభువా, ప్రేమ మరియు విధేయతతో నీకు దగ్గరగా నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా పితరులకు నీ మర్మములను తెలియజేసినట్లుగానే, నేడు మాకు బయలుపరచి, నీ కొరకు వాడబడే ఒక ఘనమైన పాత్రగా మమ్మును మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.