నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 89:15వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు'' ప్రకారం శృంగ ధ్వనులు అను పదము యొక్క అర్థము ఏమైయున్నది. సంతోష ధ్వనులు లేక శృంగ ధ్వనులు యొక్క అర్థము, యూదులకు చాలా బాగా తెలుసు. యూదులు జరుపుకునే నూతన సంవత్సర దినాన్ని, బూర ధ్వని చేయబడు దినముగా కూడా పిలుచుచున్నారు. వారు ఆ రోజున, ఆ సంతోష దినములను జరుపుకుంటూ, కేకలు వేయుచూ, శృంగ ధ్వనులు చేస్తారు. నూతన సంవత్సరము దినము నాడు మాత్రమే కాదు. గానీ, పండుగ చేసుకొను ప్రతిసారి కూడా మొదటిగా వారు బూరలు ఊదుతారు. అందుకనే, కీర్తనలు 89:15వ వచనము మరొక అనువాదములో చూచినట్లయితే, "ఉత్సాహ ధ్వనులను ఎరుగు ప్రజలు, ధన్యులు'' అని దేవుని వాక్యము చెబుతుంది. ఈ ధ్వనులను వారు ఏలాగున చేస్తారు? ఏమి చేస్తారు? యూదులు గంభీర ధ్వని చేయుచూ, దేవుని స్తుతిస్తారు. మరియు వారు బిగ్గరగా అరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటారు. నూత న సంవత్సరము దినమున కూడా వారు ఎంతో బిగ్గరగా బూర ఊదురతారు. ఈ నూతన సంవత్సరమును పది రోజులు వారు ఉత్సవముగా జరుపుకుంటారు. పదియవ దినము దేవుని యెదుట వారి పాపములను ఒప్పుకొని, పశ్చాత్తాపపడతారు. ఆ తర్వాత మాత్రమే ఈ నూతన సంవత్సరమంతయు కూడా ప్రభువుతో నడుస్తాము అని వారు నమ్ముతారు. అదేవిధముగా, మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే, పరిశుద్ధాత్మతో మనము ధైర్యముగా అడుగులు వేయగలము.

నా ప్రియులారా, బైబిల్ నుండి గలతీయులకు 5:24,25వ వచనములలో మనము చూచినట్లయితే, "క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసియున్నారు. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము'' ప్రకారం మనము క్రీస్తు సంబంధులుగాను మరియు ఆత్మ ననుసరించి జీవించువారముగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ముఖకాంతి వెలుగులో మనము క్రమముగా నడువగలుగుతాము. మరియు గలతీయులకు 5:26వ వచనములో చూచినట్లయితే, "ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము'' ప్రకారం చూడండి నా ప్రియులారా, ఈ దేవుని వాక్యమును మనము నిజముగా అనుసరించగలిగినటువంటి వారమైతే, ఆయన ముఖకాంతిలో మనము నడువగలుగుతాము. ఈ లోకము మనకు ఇచ్చు సంతోషము కేవలము క్షణికమైనది. అయితే, ప్రభువు మనకు ఇచ్చు ఆనందము, సంతోషము నిత్యము నిలిచి ఉంటుంది. అందుకే శృంగ ధ్వనులు ఎరిగినటువంటి ప్రజలు ఎంతో ధన్యులై యున్నారు అని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది.

బైబిల్ నుండి సంఖ్యాకాండము 23:22వ వచనములో మనము చూచినట్లయితే, "రాజు యొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు'' ప్రకారం ప్రభువు ఇశ్రాయేలీయులతో ఆ విధంగానే ఉండెను. ఆలాగుననే, ఆ గొప్ప రాజు యొక్క జయధ్వని ఈ రోజు మనతో కూడా ఉండాలనియు, మనమందరము కూడా ఆయనకు మొఱ్ఱపెట్టబోవుచున్నాము. మనము దేవుని బిడ్డలమైనప్పుడు, సంతోష జయధ్వనులు ఎల్లప్పుడు మనయందు వినబడుతాయి. ఇంకను కీర్తనలు 118:15వ వచనములో చూచినట్లయితే, దేవుని వాక్యము అదే చెబుతుంది, "నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును' ప్రకారం ' శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ఎంతో ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు 'అని చెప్పబడియున్నట్లుగానే, దేవుని యొక్క ఉత్సాహ సంతోష ధ్వనులను తెలుసుకొనగలిగే కృపను ప్రభువు మీకు ఇచ్చును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా తండ్రీ, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, నీ యొక్క ప్రేమపూర్వక సన్నిధికి మమ్మును పిలిచే ఆనందకరమైన ధ్వనులను గ్రహించడానికి మాకు సహాయం చేయుము. యూద ప్రజలు బాకా మరియు ఉత్సవ ధ్వనులతో ఆనందించినట్లుగానే మా హృదయాన్ని నీలో ఆనందించడానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీతో మా నడకకు ఆటంకం కలిగించే ప్రతి పాపం నుండి మమ్మును శుభ్రపరచుము మరియు మా జీవితముతో నిన్ను స్తుతించే ధ్వనులతో నింపుము. దేవా, మా ఇల్లు విజయ సంగీతములతో నిండి ఉండునట్లుగాను మరియు మా అడుగులు నీ పరిశుద్ధాత్మచేత నడిపించబడునట్లుగా చేయుము. ప్రభువా, ఈ లోకపు క్షణికమైన ఆనందం వెంట మేము ఎన్నడును పరుగెత్తుటకు, బదులుగా, నీ ముఖం నుండి ప్రవహించే శాశ్వతమైన ఆనందంలో నిలిచి ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ జయధ్వనులతో మమ్మును నింపుము. యేసయ్యా, నీ యొక్క ఉత్సాహ సంతోష ధ్వనులతో మమ్మును ఇప్పుడు నింపుము. దేవా, ఈ లోకములో మమ్మును సంతోష పెట్టడానికి ఎన్నో మేము చూస్తుండవచ్చును. కానీ, దేవా, నీ సన్నిధిలో ఉన్న నిజమైన సంతోషమును మాకు కావాలి. కనుకనే, మమ్మును నీ సన్నిధితోను మరియు నీ ఆత్మచేతను నింపుము. ప్రభువా, నీ ప్రక్కనే నడవగలిగే కృపను మాకు దయచేయుము. దేవా, ఈ లోకములో ఏదియు మమ్మును ఎన్నడును తాకకుండా, శోధనల నుండి మమ్మును దూరముగా ఉంచుము. ప్రభువా, నీ ఆత్మ చేత ఈ లోకములో మేము అడుగులు వేయగలిగే కృపను మాకు దయచేయుము. దేవా, మేము నీతో కలిసి నడుచుటకు మమ్మును అర్హులనుగా చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.