నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 12:21వ వచనము మనకు ఈలాగున సెలవిచ్చుచున్నది, " కీడు వలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము'' అని వ్రాయబడి యున్నది. ఇది చాలా సవాలు సహితమైన ప్రక్రియగా ఉన్నది. ఎందుకంటే కీడుకు ప్రతిగా కీడుతో ప్రతిస్పందించడం మన భౌతిక స్వభావం. 'ఇదిగో, విను, చూడు, అని అంటుంటాము మరియు నేను మీ వద్దకు తిరిగి వస్తాను మరియు మిమ్మల్ని అంతం చేస్తాను 'అని మనము తరచుగా అంటుంటాము. ఇది మన సహజ స్వభావం.

 

అయితే, నా ప్రియులారా, మన భౌతికమైన ప్రతి స్పందన ఈరీతిగా ఉంటుంది. మనము అత్యంత దయనీయంగా మరొకరి ద్వారా చూడబడినప్పుడు, ఏ విధంగా స్పందిస్తాము అనేది, మన నేత్రాలు యేసు మీద మాత్రమే నిరీక్షణ కలిగి ఉంటుంది. దృష్టిని యేసుపై మాత్రమే ఉంచినప్పుడు, మనతో కీడుగా ప్రవర్తించినప్పుడు ఎలాగున ప్రతిస్పందించాలో తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. రోమీయులకు 12:19వ వచనంలో మనము చూచినట్లయితే, "ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.'' అవును, పగతీర్చుకోకండి అని పౌలు చెబుతున్నాడు. అయితే, మరల ఆయన ఇలాగున తెలిజేయుచున్నాడు, "కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు'' అని కూడ వ్రాయబడియున్నది. దేవుడు మనకు ఎంత చక్కగా ఉపదేశము చేయుచున్నాడో చూడండి. మన శత్రువులతో ఎలాగున ప్రవర్తించాలో ప్రభువు మనకు మార్గాన్ని చూపుతున్నాడు. బైబిల్‌లో యేసు మత్తయి 5:44లో ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి.'' కీడుకు ప్రతిగా మేలు చేయుట అనేది గొప్ప బల ప్రదర్శనకు సూచనగా ఉన్నది. మనకు కీడు చేయుటకు ప్రతీకారంగా మనము కూడ కీడు చేసి యున్నప్పుడు, మీరు బలహీనులు అని ప్రజలు చెబుతారు. కాబట్టి మీ శత్రువులను దయతోను మరియు సహనంతోను విజయాన్ని సాధించండి. ఇలాగున చేయడం వలన మీరు మీ శత్రువులను మిత్రులనుగా మార్చగలరు.

 

బైబిల్‌లో ఈ విధంగా, దావీదు సౌలు రాజును జయించినట్లుగా మనము చూడగలుగుచున్నాము. అపొస్తలుల కార్యములు 7:60వ వచనము ప్రకారం, "ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను'' సౌలు అతని చావునకు సమ్మతించెను. అన్నింటికంటే ఎక్కువగా, యేసును మనం అనుసరించడానికి ఉత్తమమైన మాదిరియై యున్నాడు. ప్రజలు ఆయనకు విరోధముగా వ్యంగ్యమైన మాటలు విసురుచున్నప్పుడు, ఆయన ఏ మాత్రము కూడ మాటలాడలేదు. మరణము పొందుచున్న సమయములో కూడ, "తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని'' తండ్రికి ప్రార్థన చేశాడు. ఆలాగుననే, నేడు మీకు విరోధముగా ఎవరైన కీడు చేసినట్లయితే, వారిని క్షమించండి. ఆ సంఘటనను మరచిపోండి. పగలు పెట్టుకోవద్దు, ఏ విధముచేతననై సరే, ఎటువంటి పగను కూడ మీలో మీరు ఉంచుకొనకండి. ఈ విధంగా చేయుట ద్వారా కీడును అధిగమించెదరు. మీరు అత్యధికమైన విజయమును పొందినవారవుతారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

 

ప్రార్థన:

కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మరియు కీడును మేలుతో జయించమని మాకు నేర్పినందుకు కృతజ్ఞతలు. దేవా, నీవు మాకు రెండు ఆజ్ఞలు ఇచ్చారు: నిన్ను వలె నీ పొరుగువారిని మరియు వారి కొరకు, మా శత్రువుల కొరకు కూడా ప్రార్థించమన్నావు. ప్రభువా, కీడును మేలుచేత జయించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మమ్మును గాయపరచువారి యెదుట సహనము కలిగి ఉండునట్లుగా నీ సహనమును మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నీ యొక్క స్వభావం చేత సంపూర్ణంగా మమ్మును నింపుము. పరిశుద్ధాత్మ వరముల చేత మమ్మును నింపుము. ఇతరులు మాలో నిన్ను చూచునట్లుగా కృపను దయచేయుము. దేవా, మేము మా యొక్క గతమును మరచిపోవునట్లుగా మాకు నీ కృపను ఇమ్ము. ప్రభువా, నీవు మా నుండి కోరుకున్న ప్రేమ ఇదియే గదా. ప్రభువా, నీవలెనే ప్రజలను ప్రేమించుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీ ప్రేమ మరియు కనికరముతో మా హదయాన్ని నింపుము, తద్వారా మేము ప్రార్థించగలము మరియు ప్రతి ఒక్కరికి, మమ్మును బాధపెట్టిన వారికి కూడా మేలు చేయగలము. ప్రభువా, మా హృదయము నుండి ప్రతి చేదు అనుభూతిని మరియు క్షమాపణను తొలగించి, నీ శాంతి మమ్మును చుట్టుముట్టునట్లు చేయుము. దేవా, నీ ప్రేమపూర్వక సన్నిధిని ఇతరులకు ప్రకాశింపజేసి, కీడును మేలుతో జయించునట్లుగాను మరియు కృపాక్షేమములు మా బ్రతుకు దినములన్నియు మా వెంట వచ్చునట్లు చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.