Date : May 21, 2025

మరణము అనేది మాటలాడుటకు సులువైన అంశము ఎంతమాత్రమూ కాదు. ఒక వ్యక్తి ఏ వయసులో ఉన్నప్పట్టికీ తనను కోల్పోయినప్పుడు మనము దుఃఖిస్తాము మరియు చాలా ప్రశ్నలకు జవాబులు రాకుండా ఉండిపోతాయి. ఒకవేళ ఎవరైనా చిన్న వయసులో మరణిస్తే ''ఎందుకు మరణము తనకు ఇంత తొందరగా సంభవించింది?, దేవుడు ఎక్కడ ఉన్నాడు? తనకు భూమిపై మరికొంత కాలము బ్రతికించవలసిందికదా?'' అని నిట్టూర్చుతాము. ప్రతిసారి ఎవరో ఒకరు మరణించారనే వార్త వినినప్పుడు నాకు 1986 సంవత్సరము జ్ఞాపకము వస్తుంది. ఆ సంవత్సరము ఒక రోడ్డు ప్రమాదంలో నేను నా చెల్లిని కోల్పోయాను. నా సహోదరి ఏంజెల్ మరణించినపుడు తన వయస్సు 17 సంవత్సరములు మాత్రమే.

ఆ ఎడబాటు అనేది మా కుటుంబ సభ్యులందరికి భరించలేనట్టిదిగా ఉండేది. మేము రెండు నెలలపాటు ఏడుస్తూనే ఉన్నాము. మా ఇంట్లో తన వస్తువులను చూసిన ప్రతిసారి మేము కన్నీరు కార్చేవారం. ఆమె లేని ఆ గృహములో, తన చిరునవ్వుతోకూడిన మోము మాకు కనపడకపోయినందున మా హృదయములు దుఃఖముతో కూడిన కలవరపాటునకు గురియగుచుండేవి.

ఆ పరిస్థితులలో కూడా ప్రార్థించుటకు ప్రభువు మా యెడల కృపచూపించాడు. ఆ పరిస్థితిలో ఆదరణ మరియు బలము కొరకు మేము యేసువైపు మాత్రమే చూడగలిగాము. ఒకానొక దినమున మా కుటుంబ ప్రార్థన సమయములో యేసు మా మధ్యకు దిగివచ్చాడు. ఆయన మాత్రమే ఇవ్వగలిగే సంతోషముతో పరిశుద్ధాత్మ మమ్మును నింపినట్లుగా మేము అనుభూతి చెందాము. నా సహోదరి మరణించిన పిమ్మట అప్పుడే మొదటిసారిగా మేము ఆత్మలో తేలికను పొందుకొన్నాము. ''మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు .. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' (యోహాను 16:20). యేసు ఏమి వాగ్దానము చేసినను ఆయన తప్పక దానిని నెరవేరుస్తాడు. మేము ప్రార్థనస్థితిలో కొనసాగుచుండగా  ''ఏంజెల్ నాయొద్దనే ఉన్నది. ఆమె పరలోకపు మహిమతో ఉన్నది, ఇచ్చట బాధ మరియు దుఃఖము అనేవి ఉండవు. ఆమెను కోల్పోయిన కారణముగా మీరు దుఃఖభారంతో నిండియున్నారని నాకు తెలుసు. నేను కూడా మీతో పాటుగా కన్నీరు కార్చుచున్నాను. దీనికి కారణము ఇప్పుడు నేను మీతో చెప్పినను మీరు అర్ధము చేసికొనలేరు. కానీ ఈ దుఃఖము మధ్యలోకూడా మీరు నన్ను వెంబడించుట కొనసాగిస్తారని నేను అపవాదితో సవాల్ చేసియున్నాననే సంగతి మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు నన్ను తలదించుకునేలా చేస్తారా?'' అని ప్రభువైన యేసు నా తండ్రి డిజియస్ దినకరన్ గారి మూలముగా మాట్లాడాడు. ప్రభువు మాతో ఈ విధముగా మాట్లాడుటను వినిన పిమ్మట ''ప్రభువా, మేము ఎచ్చటకు వెళ్లగలము? ఏమియు ప్రశ్నించక మీపై పరిపూర్ణ నమ్మికను ఉంచే కృపను మాకు అనుగ్రహించండి. మీరు మమ్మును ప్రేమిస్తున్నారని మరియు మిమ్మును ప్రేమించేవారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని మాకు తెలుసు. ఒకానొక దినమున మేమే వచ్చి మిమ్మును మరియు ఏంజెల్ ను పరలోకంలో చూస్తామని కూడా మాకు తెలుసు అని మేము జవాబిచ్చాము.''    

ఆదినమునుండి మా పరిచర్యపై అధికముగా దృష్టిపెట్టుటను మేము ఆరంభించాము. కారుణ్య విశ్వవిద్యాలయము, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములు మరియు భారత దేశమంతటా అభాగ్యులను లేవనెత్తుటకై లాభాపేక్షలేనట్టి దాతృత్వ సంస్థ అయిన సీషా వీటన్నింటిని మేము నెలకొల్పాము.    

తనకు మొఱ్ఱపెట్టు ప్రతి దుఃఖపు మరియు భారభరితపు హృదయము కూడా ప్రభువు యొక్క అసాధారణ ఆత్మతో నింపబడుట అనేది సత్యము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు (2  కొరింథీయులకు 1:3) అని పిలువబడే ప్రభువైన యేసు క్రీస్తు తానే మిమ్మును ఆదరిస్తాడు. ''శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు'' (యోహాను 14:27) అని ఆయన వాగ్దామిచ్చాడు కదా.

ఎప్పుడైనా ఎవరైనా చిన్న వయసులో మరణించినచో దుఃఖముతో నింపబడిన తన బంధువులు మరియు ప్రియులగువారికి దేవుని మాటలలోనే జవాబు దొరుకుతుంది. ''నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సునపెట్టరు; భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు, కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు'' (యెషయా 57:1). అవును, మన ప్రతి ఒక్కరము ఏదో ఒక దినమున తప్పక వెళ్లాల్సి ఉన్నది. ఈ భూమిపై ఏదో ఒక సమయమున జీవము ముగింపునకు వస్తుంది. అయినప్పటికీ మనము జీవించినంత కాలము ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన సమయము ఉండుటను మనము చూస్తాము మరియు దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును దేవుడు నియమించియున్నాడు (ప్రసంగి 3:1-11).

దేవుని వాక్యముపై నమ్మికను ఉంచండి. మీరు ఎట్టి పరిస్థితుల మధ్యలో ఉన్నారో ప్రభువైన యేసుకు తెలుసు. మీ మార్గమంతటిలో ప్రతి అడుగునందు ఆయనే మిమ్మును నడిపించి ఆదరిస్తాడు. 

- డా. పాల్ దినకరన్