నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము ద్వారా మీతో మాట్లాడడము నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:9వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?'' అన్న వచనం ప్రకారం మీరు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద మిమ్మును నడిపిస్తాడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు చక్కగా నడిపించబడతారు. మిమ్మును నీళ్ల కాలువల యొద్దకు నడిపిస్తాడు. అదేవిధంగా, నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మును సరాళమైన మార్గంలో మరియు నీటి ప్రవాహాల ప్రక్కన నడిపి స్తాడు. ఈ రోజు మీ జీవితములో ఇలాగున చెబుతున్నారేమో? మనశ్శాంతి సమాధానము లేదు అంటున్నారేమో? ఎంతో భారమును మోస్తున్నారేమో? హృదయములో నిస్పృహ చెందియున్నారేమో? ఎవరైనా ఒకరు మిమ్మును ఆదరించాలని మీరు కోరుకుంటున్నారేమో? దేవుడు మీకిచ్చిన పని అంతటిలో కూడ మరియు మీరు నెరవేర్చవలసిన ఉద్దేశములో కూడ, ఎండిన ఎడారి పరిస్థితిని అనుభవించుచున్నారేమో? తద్వారా నిరుత్సాహపడియున్నారేమో? మీ జీవితాన్ని మీరు కొనసాగించవలెనా? లేదని మీరు చింతించుచున్నారేమో? కానీ, నా ప్రియ స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులలో ఆయన మిమ్మును నీటి కాలువ యొద్దన నడిపిస్తాడు మరియు మిమ్మును తన ప్రేమచేత ఆదరిస్తాడు.

బైబిల్‌లో ఏలీయా జీవితములో కూడ అదేవిధంగానే జరిగినది. అతడు ప్రాణ భయముతో యెజెబెలు యొద్ద నుండి పారిపోయాడు. అప్పుడు, దేవుడు తనతో మాట్లాడి, యొర్దానుకు తూర్పు వైపునకు వెళ్లి దాగుకొనుమని చెప్పెను. అప్పుడు మరల దేవుడు ఈలాగున సెలవిచ్చాడు, 'నీవు వాగు నీటిని త్రాగెదవు, నేను కాకోలమునకు ఆజ్ఞాపించి, ఆహారమును ఇవ్వమని చెప్పియున్నాను.' ఏలీయా యొక్క నిరాశ సమయములో కూడ దేవుడు అతనిని నీటి కాలువ యొద్ద కూర్చుండబెట్టియున్నాడు. తన ప్రాణము సేదదీర్చి యున్నాడు. అతనికి ఆహారము ఇచ్చినయున్నాడు. అంత గొప్ప విధంగా దేవుడు మనలను ఆదరిస్తాడు నా స్నేహితులారా. మన జీవితములో మనము ముందుకు నడుస్తుండగా, అనేకసార్లు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంటాము. ఎన్నో సమస్యలను మరియు మన హృదయాన్ని కలవరపరిచే ఎన్నో విషయాలను గూర్చి తలంచుకుంటూ, 'ఇవన్నియు ఎందుకు అనుమతించావు ప్రభువా అని దేవుని ప్రశ్నిస్తున్నామో?' అటువంటి పరిస్థితులలో కూడ ఆయన మీకు ఆహారము ఇస్తాడు, మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు, మిమ్మును పట్టించుకుంటాడు, మీ ప్రాణమునకు సేదదీరుస్తాడు. మిమ్మును నీటికాలువల యోరన కూర్చండబెడతాడు, ఆయన మిమ్మును ఆదరిస్తాడు.

ఆలాగుననే, కీర్తనాకారుడైన దావీదు, కీర్తనలు 23వ అధ్యాయములో ఈలాగున తెలియజేసియున్నాడు, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నా డు తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు'' అన్న వచనము ప్రకారము దేవుడు మనకు జరిగించుచున్న అద్భుతమైన విషయము అదే ప్రియులారా. అదేవిధంగా, నా జీవితములో కూడా జరిగింది. నేను కళాశాలలో చదువుచున్నప్పుడు నా తల్లిదండ్రులకు దూరముగా ఉన్నాను. వేరొక నగరములో ఒంటరిగా జీవించాను. నా చుట్టు ఎవరు లేరు, నేను ఒంటరిదానను అని భావించాను. ఆ పరిస్థితులలో కొందరి హృదయాలలో ప్రభువు నా పేరు జ్ఞాపకము చేసియున్నాడు. వారు నా కొరకు ఆహారమును సిద్ధపరచి, వేరొక ప్రాంతము నుండి నాకు పంపించేవారు. అటువంటి పరిస్థితులలో దేవుడు నన్ను ఎంతగానో పట్టించుకుంటున్నాడనియు, నా పట్ల శ్రద్ధ వహిస్తున్నాడనియు నాకు తెలియజేశాడు. అదేవిధంగా నా ప్రియ స్నేహితులారా, ఎవరైన ఆదరించాలని కోరుకుంటున్నారేమో? మీకు సహాయము చేసేవారు, ఎవరైనా మీ బాధను వినాలని కోరుకుంటున్నారేమో? సరైన సమయములో, సరైన సహాయాన్ని ప్రభువు మీకు పంపుతాడు. మీ ప్రాణమునకు సేదదీరుస్తాడు. మీకు కావలసిన వాటన్నిటిని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ధైర్యము వహించండి నా స్నేహితులారా, ఈ జీవన ప్రయాణములో మీరు దేవుని యందు బలపరచబడండి. దేవుడు మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
దయగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, ఈ రోజు, మేము నీ నడిపింపును మరియు మనశ్శాంతి కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, ఏలీయాకు నీవు చేసినట్లుగానే, మా అవసరతలలోను, మా నిరాశ సమయములలో, నిరుత్సాహములలో జాగ్రత్త వహించుము. దేవా, నీవు మా పట్ల శ్రద్ధవహిస్తున్నావనియు మా పట్ల కనుపరచుము. ప్రభువా, మమ్మును సమకూర్చి, ఆదరించుము. దేవా, నీ ప్రేమ మరియు ఆదరణను మా పట్ల కనుపరచుము. దేవా, నీటి ప్రవాహాల పక్కన మరియు మేము పొరపాట్లు చేయని సరళమైన మార్గంలో మమ్మును నడిపించుము. దేవా, మేము మా భారాలను, మా చింతలను మరియు మా నిరుత్సాహ భావాలను నీ యొద్దకు తీసుకొని వస్తున్నాము. ప్రభువా, దయచేసి మా ప్రాణమునకు సేదదీర్చి మరియు మాకు కావలసిన ఓదార్పు మరియు సంరక్షణను అనుగ్రహించుము. దేవా, ఏలీయాను ఆశ్రయించి, ఆశ్రయ ప్రదేశానికి తీసుకొని వెళ్లినట్లుగానే, నీవు మమ్మును కూడా జాగ్రత్తగా చూసుకుంటావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ ప్రేమ మరియు విశ్వసనీయతను, ముఖ్యంగా ఆపద సమయాలల్లో మాకు కనుపరచుము. యేసయ్యా, మాకు అవసరమైనప్పుడు సరైన సహాయం మరియు సహకారమును పంపించుము మరియు నీవు మా పట్ల కలిగి ఉన్న పరిచర్యలో కొనసాగడానికి మాకు బలాన్ని దయచేయుము. దేవా, నీవు మా కాపరిగా ఉన్నందుకు, మా ప్రాణమును పునరుద్ధరించినందుకు మరియు మేము ఊహించలేని విధంగా మాకు సహాయము అనుగ్రహించుము, ఇంకను నీవు ఎల్లప్పుడు మా పట్ల శ్రద్ధ వహిస్తావని మేము గుర్తెరుగునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.