నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 57:2వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, ‘‘మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను’’ ప్రకారం దేవుడు మీ కార్యమును సఫలము చేయును గాక. అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును’’ ప్రకారము నేడు మీ అవసరతలు ఏవైనను సరే, దేవుడు మీపట్ల ప్రతి అవసరతను తీర్చును. అదేవిధముగా, సామెతలు 23:18లో చదివినట్లయితే, ‘‘నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు’’ అన్న వచనము ప్రకారము మీరు చింతించకండి. మీ ఆశ ఎన్నటికిని భంగము కాకుండా దేవుడు అన్నిటిని నేరవేరుస్తాడు. ’’

నా ప్రియులారా, మన జీవితములో దేవుడు అన్నిటిని సరిచేతు దేవుడుగా  ఉంటున్నాడు. దేవుడు సమస్తమును పరిపూర్ణము చేయు దేవుడు. పరిపూర్ణ మార్గంలో, అద్భుత విధంగా దేవుడు మీ అవసరతలన్నిటి తీరుస్తాడు. నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 138:8లో చూచినట్లయితే, ‘‘ యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము’’ అన్న వచనము ప్రకారము దేవుడు మీ పక్షమున కార్యము సఫలము చేస్తాడు. ‘అయ్యో, నా జీవితములో నేను అనుకున్నది జరుగలేదు, నాకు అది కావాలి, ఇది కావాలి, అనుకుంటూ చింతిస్తున్నారేమో?’ అందుకే మనము దేవుని వాక్యమును క్రమము తప్పకుండా ప్రతి దినము చదవాలి మరియు మీ చేతి కార్యములను విడిచిపెట్టకండి. అందుకే బైబిల్‌లో రోమీయులకు 9:27,28వ వచనమును చూచినట్లయితే, ఇటువంటి దేవుని వాక్యమును చదివినట్లయితే, ఏమి జరుగుతుందో చూడండి, ‘‘మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు’’ అని చెప్పబడినట్లుగానే, ప్రభువు తన మాటను సమాప్తము చేసి, భూలోకములో ఉన్న మన పట్ల దానిని నెరవేరుస్తాడు. 

ఈ ఆశీర్వాదమును మనము ఎలాగున పొందుకుంటాము? కీర్తనలు 9:10వ వచనములో చెప్పబడినట్లుగానే, ‘‘యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు ’’ అన్న వచనము ప్రకారం ప్రభువును మనము విశ్వసించాలి. మన పూర్తి నమ్మకమును యేసయ్య మీద ఉంచాలి. మనము ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన మన యొక్క ప్రతి కోరికను కూడ నెరవేర్చును. దావీదు జీవితమును చూడండి, అతడు యౌవ్వనస్థుడుగా ఉన్నప్పుడు, దావీదు చిన్నవాడైనప్పటికిని గొల్యాతు యెదుట నిలువబడవలసి వచ్చినది. మరి గొల్యాతు ఎవరు? అతడు పరాక్రమవంతుడు మరియు ఆజానుబాహుడు. ఎంతో ఎత్తుగా ఉండేవాడు, అంతమాత్రమే కాదు, అతడు ఆయుధములన్నిటిని ధరించి యున్నాడు. తల నుండి అరికాలు వరకు ఆయుధాలను ధరించాడు. కానీ దావీదు చిన్నవాడు అతడు ఎటువంటి ఆయుధములను ధరించలేదు. కానీ, అతని హృదయములో ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి? దేవుని నామము మీద తన పూర్తి విశ్వాసమును ఉంచాడు. సర్వశక్తిమంతుడైన దేవుని నమ్మియున్నాడు. తన స్వంత బలమును కాదు, ఇంక ఏ ఆశీర్వాదమును కాదు. కానీ, ఆయన నామమును నమ్మాడు. కనుకనే, అంతటి పరాక్రమవంతుడైన గొల్యాతు మీద విజయమును పొందాడు. 

అవును నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడ అదేవిధంగా చేయండి. శ్రమలను మరియు కష్టాలను మీరు ఎదుర్కొన్నప్పుడు, దేవుని నామమును జ్ఞాపకము చేసుకొనండి. యేసు నామములో మీ ఆశీర్వాదాన్ని పొందుకొనండి. దావీదు ఆశీర్వదింపబడిన రీతిగా మీరు కూడ మీ యొక్క ఆశీర్వాదాలన్నిటిని పొందుకొనెదరు. చిన్నవాడైన దావీదు, ఎత్తైన మరియు పరాక్రమవంతుడైన గొల్యాతును చంపగలిగాడు. నేడు మీరు కూడ అటువంటి గొప్ప ఆశ్చర్యకార్యములను పొందుకొనెదరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ బిడ్డలైన మమ్మును పరిపూర్ణమైన దీవెనలతో దీవించుము. కృతజ్ఞత మరియు విశ్వాసంతో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము.  ప్రభువా, నీవు అవసరతలను తీర్చువాడవు, రక్షకుడవు, సహాయకుడవు గనుకనే, నీవు నేడు మా ప్రతి అవసరతలను తీర్చుము. దేవా, మేము నీ వాగ్దానాలు మరియు నీ ఎడతెగని ప్రేమను నమ్ముచున్నాము. దయచేసి మాకు సంబంధించినవన్నీ పరిపూర్ణంగా అనుగ్రహించుము మరియు క్రీస్తు యేసు ద్వారా మహిమలో నీ ఐశ్వర్యం చొప్పున మా అవసరతలన్నిటి తీర్చుము. దేవా, ప్రాముఖ్యంగా కష్టాలు మరియు బాధల సమయాలలో మా  విశ్వాసాన్ని బలపరచుము. దావీదు చేసినట్లుగా మేము నీ మీద పూర్తి నమ్మకం ఉంచుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ నామము మా జీవితంలో మహిమపరచబడునట్లుగా మమ్మును నీ బిడ్డలనుగా మార్చుము. ప్రభువా, నీవు మా కొరకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదములను మేము పొందుకొని అనుభవించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.