క్రీస్తునందున్న నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హెబ్రీయులకు 7:25వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు'' ప్రకారం ప్రభువు మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. ప్రభువు ఎల్లప్పుడు కూడా సరియైన పనిని మాత్రమే చేస్తాడు. మనందరిని గురించి ప్రభువుకు సంపూర్ణమైన సరియైన ప్రణాళిక కలదు. మనలను గురించి తండ్రి యొద్ద విజ్ఞాపనము చేయుట ద్వారా ఆయన తన ప్రణాళికను సంపూర్తి చేస్తాడు. బైబిల్ నుండి యోబు 42:2వ వచనములో చూచినట్లయితే, యోబు భక్తుడు ఈలాగున తెలియజేశాడు, "నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని ప్రణాళిక మీద సంపూర్ణముగా ఆధారపడియుండాలి. అప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైన ఆశీర్వాదములను పొందుకొనగలము.

2008 వ సంవత్సరములో తండ్రిగారైన సహోదరులు డి.జి.యస్. దినకరన్‌గారు మరణించిన అనంతరము, చెన్నై పట్టణములో ఒక పెద్ద ప్రార్థన కూడికను ఏర్పాటు చేయాలని అనుకున్నాము. అయితే, మా గ్రీన్ గది వెనుకాల కొందరు కలుసుకొని, ఆ కూడికను గురించి ప్రార్థించడము నేను గమనించా ను. ఆ ప్రార్థన కూడిక విజయవంతముగా జరగాలని యేసు పిలుచుచున్నాడు ప్రార్థన యోధులు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేయుచుండెను. వారు అక్కడ ప్రార్థన చేయుచుండగా, నాకు ఆ స్థలమంతయు ఎంతో వేడిగా అనిపించినది. ఆ దేవుని బిడ్డలు చేయుచున్న ప్రార్థన వలన ఆయన సన్నిధి అక్కడకు దిగివచ్చియున్నదని నాకు అప్పుడు అర్థమైనది. ఆ ప్రార్థన కూడికలో ఎన్నో అద్భుతములను జరుగుట నేను చూచియున్నాను. ఇంకను అనేకులు సాక్ష్యము చెప్పడానికి ఆ కూడికలో నుండి ముందుకు వచ్చారు. ఇంకను కూడికకు రాకముందుగానే అద్భుతములను వారి జీవితాలలో పొందుకొనియున్నారు. నా ప్రియ స్నేహితులారా, మానవులు చేసినటువంటి ప్రార్థనలను ప్రభువు అంతగా ఆలకించి, జవాబు ఇచ్చినప్పుడు, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపనములను ఆయన ఎంత ఎక్కువగా వింటాడు కదా. యేసయ్య, ఎప్పుడు కూడా అలసిపోడు. బైబిల్ నుండి రోమీయులకు 8:34వ వచనమును చూచినట్లయితే, " శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే'' ప్రకారము యేసయ్య, తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చుని మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మన కొరకు విజ్ఞాపనము చేయడానికి ఆయన నిరంతరము జీవించుచున్నాడు. మానవుడుగా జీవించడము యొక్క అర్థమును ఆయన తెలుసుకొని, తండ్రి యెదుట నిలువబడి, మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మన వైపు నుండి మనలాంటి జీవితమును కూడా యేసయ్య తన జీవితములో అనుభవించియున్నాడు. మనకు ఏమైతే అవసరమైయున్నవో ఆయనకు అన్నియు తెలుసు. మన సమస్యలను మరియు శోధనలను చూసినప్పుడు, ఆయన అర్థము చేసుకొని జాలిపడతాడు. మిమ్ములను అర్థము చేసుకోగలిగినది, కేవలము యేసుక్రీస్తు మాత్రమే ఆయన మీ కొరకు మరియు మీ పక్షమున ఉన్నాడు. అందుకే ధైర్యముగా, ఆయన యొక్క కృపాసింహాసనము యొద్దకు సమీపించగలుగుతాము. మనము అవసరత ఉన్న సమయములో ఎల్లప్పుడు మనకు సహాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

మా యొక్క మొదటి కుమారుడైన శామ్యేల్ దినకరన్ నెలల బిడ్డగా ఉన్నప్పుడు జ్వరము వచ్చి బాధపడుచున్న ఆ సమయములో దుబాయ్‌లో జరుగుచున్న ప్రార్థన కూడికలకు నా భర్తగారు మరియు మా కుటుంబ సభ్యులందరు కూడా వెళ్లారు. అది అర్థ రాత్రి సమయము. ఆ సమయములో నేను మా బంధువులను ఎవ్వరిని కూడా కాల్ చేసి పిలువలేకపోయాను. నాకు ఏమి చేయాలో కూడా ఆ సమయములో తెలియదు. అప్పుడు నేను యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు కాల్ చేసి, అక్కడ ఉన్న ప్రార్థన యోధులతో ఎందుకు ప్రార్థన చేయించుకొనకూడదు అని నాకు ఒక ఆలోచన కలిగినది. అప్పుడు వెంటనే, నేను ప్రార్థన గోపురమునకు కాల్ చేసి, ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన యోధురాలు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయుచుండగా, నా బిడ్డ మీద చేయి వేయమని తను చెప్పియున్నారు. నేను కూడా ఆలాగుననే చేశాను. ప్రార్థన అనంతరము ఒక అద్భుతము జరిగినది. ప్రార్థన చేయుటకు ముందుగా 120 డిగ్రీల జ్వరము ఆ బిడ్డకు ఉండెను. అయితే, ప్రార్థన ఆనంతరము నా బిడ్డకు చెమటలు పట్టడము గమనించియున్నాను. తన దేహము చల్లగా మారిపోయినది. ఎంత అద్భుతము కదా! నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మీ కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రభువు ఎప్పుడు కూడా కునుకడు నిద్రించడు. యేసయ్య ఎల్లప్పుడు మీ కొరకు విజ్ఞానము చేయడానికి మరియు మిమ్మును సంపూర్ణముగా రక్షించుట కొరకై ఆయన నిరంతరము జీవించుచున్నాడు. కనుకనే, మీరు ఇప్పుడే, యేసయ్య నొద్దకు వస్తారా? యేసు ప్రభువు మిమ్మును పిలుచుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మీరు ఉన్న పక్షముననే, ఆయన యొద్దకు వచ్చి, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మీ పక్షమున విజ్ఞాపనము చేసి, మీ సమస్యలన్నిటిని నుండి మిమ్మును విడిపించి, దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపనము చేయుచున్న యేసు క్రీస్తు నిమిత్తము మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీ బిడ్డలైన మా కొరకు సహాయము చేయువారెవరు లేరని బాధడుచున్నాము. దేవా, నీ బలమైన హస్తము మా మీద ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేసి, మమ్మును స్వస్థపరచుము. యేసయ్యా, ఆపదలలో ఉన్న మా మీద నీ నీతిగల దక్షిణ హస్తమును చాచి, మా ఆపదలలో మేము విడిపించబడడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ బిడ్డలైన మేము మరియు మా ప్రియులగు వారు మరణించకుండను మరియు మా యొక్క అప్పుల సమస్యల నుండి విడిపించి, మమ్మును పునరుద్ధీకరించుము. యేసయ్యా, మా అనారోగ్యముల నుండి మమ్మును స్వస్థపరచి, మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మాకున్న సమస్యలన్నిటి నుండి మమ్మును విడిపించి, మమ్మును రక్షించి, కాపాడుము. ప్రభువా, ప్రజల ద్వారా అణగద్రొక్కబడుచున్న సమస్యలకు ఒక ముగింపు దయచేయుము. ప్రభువా, మా భవిష్యత్తును గురించిన భయము మరియు మా జీవితములలో ఉన్న భయములన్నిటిని తొలగించుము. దేవా, అద్భుతమైన భవిష్యత్తును మాకు దయచేయుము. దేవా, మా జీవితములో అద్భుతములను జరిగించుము. ప్రభువా, మా అణచివేత నుండి మమ్మును విడిపించుము. ఓ దేవా, మా కుటుంబంలో సమాధానము మరియు ఐక్యతను తీసుకురమ్ము. ప్రభువా, మా పిల్లలను ఆశీర్వదించుము మరియు వారి చదువులలో వారికి జ్ఞానాన్ని అనుగ్రహించుము. దేవా, మేము నిరీక్షణతో ఎదురు చూచుచున్న ఉద్యోగాలు మరియు భవిష్యత్తులో అభివృద్ధి ద్వారములు తెరువుము. ప్రభువా, మేము నీ సన్నిధిలో ప్రార్థించుచున్నప్పుడు మా జీవితంలో అద్భుతాలు జరిగే కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.