నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. బైబిల్ నుండి లేవీయకాండము 26:9వ వచనములో ఉన్నటువంటి వాక్యమును నేడు వాగ్దానముగా ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను'' ప్రకారం ఇది మీ కొరకు ప్రభువు చేయుచున్న వాగ్దానము. ఇది ఎంతటి గొప్ప అద్భుతమైన వాగ్దానమై యున్నది కదా! దేవుడు ఏదైనా వాగ్దానము చేసినట్లయితే, నిశ్చయముగా దానిని నెరవేరుస్తాడు. నోవహు దినములలో సమస్తమును నశించినపోయినది. ఆదికాండము 9:1వ వచనములో చూచినట్లయితే, దేవుడు నోవహును ఈ విధంగా వాగ్దానము చేయుచున్నాడు. " మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి'' అను వచనము ప్రకారం భూమి మీద సమస్తము నశించి ఏమి లేనటువంటి స్థితిలో, "నోవహుతో, నీవు ఫలించి, విస్తరించి, అభివృద్ధి పొంది భూమిని నింపు'' అని చెప్పినట్లుగానే, అది నోవహు జీవితములో నెరవేర్చబడెను. ప్రభువు ఏదైన చెప్పినట్లయితే, నిశ్చయముగా దానిని నెరవేరుస్తాడు.
అందుకే నా ప్రియులారా, ప్రతి రోజు మనము దేవుని వాక్యమును చదవాలి. అది జరుగుతుందని విశ్వసించాలి. ప్రభువు నిశ్చయముగా ఆయన మాటలను నెరవేరుస్తాడు. బైబిల్ నుండి ఆదికాండము 32:12వ వచనములో యాకోబును గురించి మనము చదువుతాము. యాకోబు అన్నయైన ఏశావు, అతనికి విరోధిగా ఉండెను. అతనిని సంహరించాలని అనుకున్నాడు. యాకోబును చంపివేయాలని అనుకున్నాడు. అయితే, దేవుడు ఏమి చేశాడు? ఏశావును, మరొక స్థలమునకు తీసుకొని వెళ్లాడు. తన కుటుంబాన్ని దీవించాడు, ఇద్దరు భార్యలను మరియు అనేకమంది బిడ్డలను ఇచ్చాడు. ఎంతో సంపాదనను అనుగ్రహించియున్నాడు. అవును, దేవుడు ఏదైన సరే, అన్నిటిని చేయగలడు నా ప్రియ స్నేహితులారా. ఇంకను బైబిల్ నుండి 2 కొరింథీయులకు 8:7వ వచనములో మీరు చూచినట్లయితే, " మీరు ప్రతి విషయములో, అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా యెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధి పొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి'' ప్రకారం మీరు ప్రతి విషయములోను అభివృద్ధి నొందెదరు అని ప్రభువు వాక్యము సెలవిచ్చుచున్నది. ఇంకను యాకోబు 1:4వ వచనములో కూడా అదే విషయమును చెబుతుంది, " మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.'' ఆలాగున, ఫిలిప్పీయులకు 4:19వ వచనములో చెప్పబడినట్లుగానే, "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' ప్రకారం నేడు దేవుడు మీ అవసరతలన్నిటిని క్రీస్తునందు నెరవేరుస్తాడు.
నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు, "మేము అన్నిటిని కోల్పోయి నష్టపోయాము మరియు మమ్మును ప్రేమించేవారు ఎవరు లేరు'' అని మీరు అనుకుంటున్నారా? అయితే, నేడు మీరు ప్రభువు వైపు చూడండి, ఆయన మీ అవసరతలన్నిటిని తన మహిమలో తీరుస్తాడు. ఆయన నోవహును పునరుద్ధరించినట్లుగానే, యాకోబును ఆశీర్వదించి, తరతరాలుగా తన నిబంధనను పాటించినట్లుగానే, ఆయన మిమ్మును కూడా కృపతో కాపాడి, మిమ్మును ఫలవంతం చేసి, మిమ్మును విస్తరింపజేసి, మీ జీవితములో ఆయన చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కనికరముగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా యెడల నీకున్న ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, మేము సమస్తమును కోల్పోయి, నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, నీవు మా మొఱ్ఱలను ఆలకించి, నేడు నీవు మా అవసరతలన్నిటిని తీర్చి, మమ్మును దీవించుము. దేవా, నీ మాట మార్పులేనిదిని కనుకనే, మేము నిన్ను హత్తుకొని ఉన్న మమ్మును నీవు ఆశీర్వదించుము. ప్రభువా, నీవు నీ అనుగ్రహంతో చూచుచున్నావనియు నీ అమూల్యమైన వాగ్దానానికై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మేము చేయుచున్న ప్రతి పనిలో మమ్మును ఫలవంతం చేయుము, మమ్మును అభివృద్ధిపరచి, మరియు మాతో నీ నిబంధనను స్థిరపరచుము. దేవా, మా చుట్టూ ఉన్న సమస్తమును కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా, మేము నీ విఫలం కాని మాటను నమ్ముచున్నా ము. ప్రభువా, నీవు నోవహును మరియు యాకోబును ఆశీర్వదించినట్లుగానే, మా జీవితా న్ని కూడా నీ సమృద్ధి, శాంతి మరియు ఆనందంతో ఆశీర్వదించుము. దేవా, నీ మహిమ లో నీ ఐశ్వర్యము ప్రకారం మా అవసరాలన్నింటిని తీర్చుము మరియు మా జీవితం నీ విశ్వాసానికి సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.