నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మన నిత్య స్నేహితుడు మరియు నమ్మకమైన సంరక్షకుడు అనే అద్భుతమైన సత్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనలను ఆహ్వానించుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 121:4 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, "ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు'' ప్రకారం దేవుడు మనలను కునుకకుండా, నిద్రపోకుండా కాపాడుతాడు. ఎంత గొప్ప వాగ్దానము మనకు ఇవ్వబడియున్నది. ఆయన ఎల్లవేళల మనతో కూడ ఉంటూ, మనము ఎప్పుడు ఒంటరితనము అనుభూతి చెందకుండా ఉండునట్లుగా చేయువాడు ఆయనే. మన దేవుడు అలసిపోయే, సొమ్మసిల్లిపోయే లేదా మానవుల వలె దృష్టి మర్చలువాడు కాదు. ఆయన నిరంతరము మీ జీవితమును కునుకకుండా, నిద్రపోకుండా, మెళకువగా ఉండి కాపాడువాడు, మిమ్మును భద్రపరచువాడై యున్నాడు. ఎల్లప్పుడు మన పట్ల కాపలాదారునిగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మేల్కొని, ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటాడు మరియు ఎల్లప్పుడూ మనలను గమనిస్తూ ఉంటాడు. మనం ఒంటరితనం, సవాళ్లు లేదా ఆపత్కాల సమయములలో నడుచుచున్నప్పుడు, ఆయన ఎప్పటికి మనతోనే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు, ఎన్నటికిని మనలను విడిచిపెట్టని స్నేహితుని వలె ఉంటూ మనలను కాపాడుతాడు. నిజంగా, ఆయన మన ఆత్మకు సంరక్షకుడు.

ఇటీవల మా తండ్రిగారు నాగ్‌పూర్‌లో ఉన్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులను కలుసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు సానుకూలముగా లేవు. ఎందుకంటే, ప్రతి సాయంత్రము సరిగ్గా అక్కడ వర్షము పడుతు ఉంటుంది. అక్కడ అధికమైన వర్షపాతము ఉండెను. అయితే, దేవుడు ఈ నడిపింపును మా తండ్రిగారికి అనుగ్రహించాడు. అయినను బృందమంతయు విశ్వసించారు. విశ్వాసముతో ముందుకు వెళ్లారు. సభలను ఏర్పాటు చేశారు. తద్వారా అక్కడ బలమైన అద్భుతములను చూశారు. ఆ రోజు మాత్రమే అక్కడ వర్షము లేదు. చక్కని సూర్య ప్రకాశమును కలిగియుండెను. వారందరు, సహోదరుడా, ఈ రోజు మంచిగా ఎండ కాయుచున్నది అని చెప్పుకున్నారు. దేవుడు ఎంత సమూలగ్రముగా వాతావరణమును మార్చివేశాడు అని ఆశ్చర్యచకితులయ్యారు. ఇంకను ఆ కూడికకు అనేకమంది ఎంతో సంతోషముగా హాజరయ్యారు. ఆ కూడిక ద్వారా వేలకొలది మంది ఆశీర్వదించబడ్డారు. ఆ స్థలమంతయు దైవశక్తి బలీయముగా సంచరించియుండెను. నా ప్రియులారా, మనము కూడా దేవుని చిత్తమునకు సమర్పించుకొని యుండగా, అటువంటి వారికి దేవుడు తనే స్వయంగా భద్రపరచువానిగా ఉంటాడు. కొన్ని ఫర్యాయములు దేవుడు తానే ప్రవచనాత్మకముగా ఆయనే నడిపిస్తాడు. ఇదిగో, "ఈ రీతిగా నేను నిన్ను నడిపిస్తాను, ఈ రీతిగా నేను ప్రవచనాత్మకముగా నిన్ను ఆశీర్వదించుటకు వాగ్దానము చేయుచున్నాను '' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మనము ఆ వాక్కును స్వీకరించినప్పుడు, విశ్వసించి, ప్రార్థించి, క్రియాత్మకముగా దానిని చేసినప్పుడు, అది మనకు భద్రతగా ఉంటుంది. మోషే ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించినప్పుడు ఆలాగుననే జరిగింది. దేవుడే వారిని స్వయంగా వచ్చి, వారిని నడిపించి, ఆశీర్వదించాడు. మోషే ద్వారా ఆలాగున వారిని నడిపించాడు. మోషే ద్వారా వచ్చిన వాక్కును వారు విశ్వసించారు. వారు విధేయులై అతనితో కూడా ప్రయాణించారు. దేవుడు ఒక వ్యక్తిగా వారికి ముందుగా ఉండి నడిపించాడు. వెనుకటి భాగమున కావలి కాచియున్నాడు. వారిని భద్రపరచి యున్నాడు, వారికి సమస్తమును అనుగ్రహించియున్నాడు. దేవుని వాక్కును ఘనపరచండి, మీరు కూడా ఇటువంటి ఆశీర్వాదమును అనుభవిస్తారు.

కాబట్టి నా ప్రియులారా, మనం ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకుందాం. మనం విధేయతతో నడిచినప్పుడు, దేవుడు మనకు మార్గదర్శిగా మరియు కాపలాదారుగా మారుతాడు. ఆయన మనకు ముందుగా వెళ్తాడు, ఆయన మన వెనుకటి భాగమున కావలి కాయును మరియు ఆయన మనలను అన్ని వైపులా కప్పి ఉంచుతాడు. కొన్నిసార్లు ఆయన నడిపింపు అసాధ్యంగా అనిపించవచ్చును లేదా ఆయన వాగ్దానాలు చాలా పెద్దవిగా అనిపించవచ్చును. కానీ, మనం ఆయన వాక్యాన్ని విశ్వసించి, ఆ ప్రకారముగా ప్రార్థించినప్పుడు, ఆ వాక్యమే మనకు కేడెముగా మారుతుంది. కాబట్టి మనం ఆయనను హృదయపూర్వకంగా విశ్వసిద్దాం, ఆయన మార్గాలలో నడుద్దాం మరియు ఆయన బలమైన భద్రతలో జీవిద్దాం. నిజంగా, ఎన్నడూ కునుకని, నిద్రపోని ప్రభువు కూడా మిమ్మును ఎన్నటికి విడువడు, ఎడబాయకుండా కాపాడుతాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును కాపాడును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రేమగల ప్రభువైన యేసు, మా కాపలాదారుడిగా ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ఎప్పుడూ కునుకకుండా లేదా నిద్రపోకుండా మమ్మును భద్రంగా కాపాడుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, రాత్రిపగలు మమ్మును కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, ఎల్లప్పుడూ మీ సన్నిధిని మరియు నీ వాక్యాన్ని పూర్తిగా విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క ప్రవచనాత్మక నడిపింపును అనుసరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా శత్రువు యొక్క ప్రతి దాడి నుండి మమ్మును కప్పుము. యేసయ్యా, శోధనలు మరియు భయం నుండి మమ్మును విడిపించి, కాపాడి సంరక్షించుము. దేవా, ప్రతి రోజు నీ యొక్క పరిపూర్ణ చిత్తంలో మేము నడుచునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము నీ చిత్తానికి సమర్పించుకున్నప్పుడు మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వోత్తతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.