నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 59:19వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నామము. ఆ వచనము, "పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును'' అని దేవుని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. శత్రువు మన యొద్దకు వచ్చినప్పుడు గుంపుగా మన యొద్దకు వస్తాడు. మనము అనేకమైన సమస్యల చేత చుట్టబడతాము. ఇక మన జీవితము అయిపోయినది, అంతమునకు మనము వచ్చాము అని మనకు అన్పించవచ్చును. అయితే, మనకు విరోధముగా మనకు శత్రువు నిలువబడినప్పుడు, దేవుడు కూడా మన కొరకు నిలబడతాడు అని సూచన. అందుకే కీర్తనాకారుడు కీర్తనలు 34:19వ వచనములో ఈలాగున అంటున్నాడు, " నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును'' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆలాగుననే, యోబు భక్తుని జీవితములో మనము చూచినట్లయితే, అతడు మరల మరల ఎంతగానో బాధింపబడ్డాడు. అతడు ఒక చెడు వార్త తర్వాత, మరొక బాధకరమైన చెడు వార్తను విన్నాడు. అయినను, అతడు దేవుని మీద తన విశ్వాసమును విడిచిపెట్టలేదు. కనుకనే, యోబు 23:10వ వచనములో చూచినట్లయితే, " నేను నడచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును'' అని అతడు విశ్వాసముతో పలికాడు. అదేవిధముగా, శత్రువు మిమ్మును అన్ని వైపుల నుండి బాధించి, అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చును. కానీ, మీ సమస్యలు మరియు శ్రమలన్నిటిలో నుండి ప్రభువు మిమ్మును విడిపిస్తాడు.
బైబిల్ నుండి 2 కొరింథీయులకు 4:8వ వచనములో మనము చూచినట్లయితే, అపొస్తలుడైన పౌలు ఈ విధంగా చెబుతున్నాడు. ఆ వచనము, " ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము'' అని తెలియజేయుచున్నాడు. మనము అణగద్రొక్కబడడానికి ప్రభువు మనలను ఎన్నడు కూడా అనుమతించడు. 'అన్ని వైపుల నుండి నేను అణగద్రొక్కబడి, నేను ఎంతగానో విసిగిపోయాను అని మీరు చెబుతుండవచ్చును. మరల మరల నాకే ఎందుకు ఇలాగున జరుగుతుంది? అని మీరు అంటుండవచ్చును. ' అయితే, ఒక్క విషయమును మీరు జ్ఞాపకము ఉంచుకొనండి. ప్రభువు మీ జీవితములో కార్యాలు చేయబోవుచున్నాడు అని అనడానికి అదియే సూచనయై యున్నది. శత్రువు ప్రవాహము వలె మీ యొద్దకు వచ్చి మిమ్మును అణగద్రొక్కడానికి ప్రయత్నించవచ్చును. కానీ, మిమ్మును మీరు ప్రభువు యెదుట తగ్గించుకొనండి. ప్రభువు హస్తాలకు మిమ్మును మీరు సమర్పించుకొనండి. అప్పుడు మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. అపవాదిని మీరు ఎదిరించుటకు కావలసిన బలమును ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. ప్రభువు శత్రువుకు విరోధముగా ఒక ధ్వజమును లేవనెత్తుతాడని దేవుని వాక్యము అంటున్నది. దాని యొక్క అర్ధము ఏమిటి? అది ఒక విజయ ధ్వజము వంటిది. అది దేవుని ప్రేమ ధ్వజముగా ఉంటుంది. రాజైన యెహోషాపాతు యుద్ధము చేసి జయించినప్పుడు, రోమీయులకు 8:31వ వచనములో చూచినట్లయితే, " ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షము ననుండగా మనకు విరోధియెవడు? '' అని చెప్పబడినట్లుగా, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకు విరోధి ఎవ్వరు కూడా ఉండరు అని చెప్పాడు. ఆలాగుననే, శత్రువు మిమ్మును అణగద్రొక్కుతున్నాడు అని మీరు భావించినప్పుడు, 'ప్రభువు నా పక్షమున ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, నాకు విరోధముగా ఎవ్వరు కూడా రాలేరు అని చెప్పండి, మానవుడు లేక మనుష్యుడు నాకు విరోధముగా ఏమి చేయజాలడు? ప్రభువు నా పక్షమున ఉన్నాడు అని చెబుతూ ఉండండి. నా ప్రభువు నా కొరకు ఒక ధ్వజమును లేవనెత్తుతాడు అని చెప్పండి.' అపవాది ఆ ధ్వజమును చూచినప్పుడు, అవమానపడతాడు మరియు సిగ్గుపడతాడు. బైబిల్ నుండి కీర్తనలు 118:6వ వచనములో చూచినట్లయితే, మీ చుట్టూ శ్రమలు ఉన్నట్లు అనిపించినప్పుడల్లా, "యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు?'' అని విశ్వాసంతో చెప్పినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ పక్షమున నిలుస్తాడు.
నా ప్రియమైన స్నేహితులారా, దేనిని గురించి చింతించకండి. ప్రభువు మీకు సహాయము చేస్తాడని వాక్యము తెలియజేయుచున్నది. బైబిల్ నుండి యెషయా 41:10వ వచనములో చూచినట్లయితే, "...నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును'' అని చెప్పబడినట్లుగానే, నీతిగల తన దక్షిణ హస్తముతో మిమ్మును లేవనెత్తుతాడు. మీరు అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు, ప్రభువు ఆత్మ మీకు శక్తినిస్తుంది. ఇతరులు మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు, దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. శత్రువు మిమ్మల్ని అణచి వేయడానికి ప్రయత్నించవచ్చును. కానీ, ప్రభువు మిమ్మల్ని మీ తలపైకి ఎత్తుకుని నడిచేలా చేస్తాడు. ఆయన మీకు విజయం మరియు ఆనందాన్ని దయచేస్తాడు. ఆయనను నమ్మండి. ఎందుకంటే, ఆయన మీ గృహమును, మీ ఆరోగ్యం మరియు మీ భవిష్యత్తుపై తన ప్రేమ ధ్వజమును ఎగురవేస్తాడు. పాత నిబంధన దినములలో ఉడిగిపోయిన వారిని స్వస్థపరిచిన మరియు అణచివేయబడిన వారిని విడిపించిన అదే ఆత్మ నేడు మీ జీవితంలో కదులుతుందిమీ యొక్క కష్ట సమయములో ప్రభువు మీకు సహాయము చేయును గాక. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు నిశ్చయముగా మీకు విజయమును ఇచ్చును గాక.
ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము జీవితములో అనేక సమస్యల చేత బాధనొందుచుండగా, వాటన్నిటి నుండి ఇప్పుడే మమ్మును విడిపించుము. యేసయ్యా, మేము అనేక అనారోగ్యములను కలిగియున్నాము. కనుకనే వాటన్నిటిని నుండి నీవే మమ్మును బయటకు తీసుకొని వచ్చి, మాకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించుము. ప్రభువా, నీవే మా కొరకు ఒక ధ్వజము ఎత్తుము. తండ్రి, నీవే మా విమోచకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. యేసయ్యా, శత్రువు ప్రవాహము వలె మా మీదికి వచ్చినప్పుడు, మాకొరకు నీ ధ్వజమును ఎత్తుము. దేవా, మేము శరీరం, జీవము మరియు ఆత్మలో బలహీనంగా ఉన్నప్పుడు నీ యొక్క బలమైన ధ్వజము ద్వారా మమ్మును బలపరచుము. ప్రభువా, భయం, అనారోగ్యం మరియు అణచివేత నుండి మమ్మును విడిపించుము. దేవా, మా జీవితములో ఉన్న అంథకారము మరియు చేతబడి శక్తులు, దుష్టక్రియలు యేసు నామంలో బ్రద్ధలు అగునట్లుగా కృపను దయచేయుము. యేస్యయా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపి, నీ ప్రేమతో కప్పుము. దేవా, మా కుటుంబం మీద విజయ ధ్వజమును ఎగురవేయుము. యేసయ్యా, మా దుఃఖాన్ని ఆనందంగాను మరియు మా ఓటమిని విజయంగాను మార్చుము. దేవా, మా జీవితం ద్వారా నీ నామం మహిమపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, మా ప్రతి బంధకముల నుండి మమ్మును విడిపించి మాకు సమాధానమును మరియు బలముతో నింపుము. దేవా, ఈరోజు మా జీవితములో విడుదల మరియు విజయాన్ని ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లించుచూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.