నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 1:33వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును'' ప్రకారం దేవుడు మన యొద్ద నుండి ఆశించేది, మనము ఆయన మాటను లేక ఉపదేశమును వినాలి అని కోరుకుంటున్నాడు. మన పిల్లలు మన మాట వినాలని తల్లిదండ్రులుగా, మనం ఎంతగా వారి పట్ల కోరుకుంటాము కదా! వారు ఒక్క మాటను పట్టించుకోకపోయినా, లేక వినకపోయినను సరే, మనం ఎంతగా బాధపడతాము కదా. అందుకే బైబిల్ స్పష్టంగా తెలియజేయుచున్నది, "ఆయన ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును'' అని చెప్పబడియున్నది. అయితే, దానికి ముందు వచనమైన సామెతలు 1:32లో చూచినట్లయితే, "జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు '' అని ఈ వచనము మనలను హెచ్చరించుచున్నది. యెరూషలేమును గురించి ప్రభువు ఈ మాటలను చెబుతున్నాడు. బైబిల్ నుండి యిర్మీయా 8:5వ వచనములో చూచినట్లయితే, ప్రభువు తన ప్రజల పట్ల దుఃఖించుచూ, ఇలాగున అంటున్నాడు, "యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు? ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు'' ప్రకారం వారు అబద్ధములను గట్టిగా పట్టుకొని, తిరిగి రానేరారు. ఆలాగుననే, తమ మార్గాన్ని మార్చుకోవడానికి నిరాకరిస్తారు. అందుకే ప్రభువు వారిని లోబడనొల్లని ప్రజలు అని పిలిచియున్నాడు. ఎందు కంటే, ప్రభువు యొక్క పిలుపులన్నిటిని వారు తిరస్కరించియున్నారు. వారు ఆయన హెచ్చరికలేవియు కూడా పట్టించుకోకుండా పెడ చెవిని పెట్టియున్నారు.

నా ప్రియులారా, అట్టివారు తప్పుచేస్తున్నారు అనే విషయాన్ని వారు వినడము వారికి ఇష్టము లేదు. కాబట్టి, వారు ఆ విధంగా చేశారు. వారి స్వంత మార్గమే వారికి కావాలి. దేవుని మార్గము వారికి అవసరమే లేదు. ఆలాగుననే, మేము విదేశములో ఉన్నప్పుడు, అక్కడున్నటువంటి ప్రజలు చాలా విచిత్రమైన టీష్టర్లు వేసుకొనియుండుట మేము చూశాము. ఒక వ్యక్తి, 'దేవుడు లేడు' అను వ్రాయబడినటువంటి ఒక టీషర్టును వేసుకున్నాడు. మరొక వ్యక్తి 'యేసు' అని వ్రాయబడిన అక్షరాలు కలిగి, క్రింద కొట్టివేసినటువంటి చిహ్నమును కలిగియున్న టీషర్టును ధరించాడు. మేము దానిని చూచి, ఎంతగానో చింతించాము. అది చూచి, మా హృదయాలు విరిగిపోయాయి. వారు తమ స్వంత మార్గాలను ఆ ప్రజలు ఎంచుకున్నారు. దేవుని మార్గములు వారికి అవసరము లేదు అని అనుకుంటున్నారు. కానీ, దేవుని వాక్యము అంటున్నది, 'ఎవరైతే, ఆయన ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివాసము కలిగి నెమ్మదిగా ఉంటారు' అని చెప్పబడియున్నది. అదేవిధముగా, యోహాను 10:27వ వచనములో చూచినట్లయితే, "నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును'' అని యేసయ్యా, ఈ మాటలనే పలుకుచున్నాడు. ఆయన స్వరము మనము వినుట వలన ఆయనను మనము ఇంకా అధికముగా తెలుసుకొనగలము. 'ప్రభువుతో ఏకమై యున్నవాడు, ఆయన ఏకాత్మగా మారుతాడు ' అని చెప్పబడియున్నది. మనము ఒక్కరోజు ఆయన మాట వినినట్లయితే, సరిపోదు. మనము అనుదినము ఆయన మాటను ఆలకించేవారముగా ఉండాలి. అప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో సమాధానమును కలిగియుంటాము.

ముఖ్యముగా మన శ్రమల సమయములలో ప్రభువు మనతో మాట్లాడుతుంటాడు. అప్పుడు అన్నియు కూడా మీకు మేలు కొరకై సమకూడి జరుగుతాయి. బైబిల్‌లో యెషయా 3:10వ వచనములో మనకు తెలియజేయుచున్నది, "మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు'' ప్రకారం మనము ఆయన పట్ల చూపించే ప్రేమ యొక్క ప్రతిఫలము చూపించకుండా ఉండడానికి ప్రభువు అన్యాయస్థుడు కాదు. ఆయన మాటలు మనము ఆలకించినప్పుడు, 'వీరు నా గొఱ్ఱెలు' అని ప్రభువు చెబుతాడు. వారి యందు నేను ఆనందించుచున్నాను అని చెబుతున్నాడు. బైబిల్ నుండి కీర్తనలు 1:1,2వ వచనములో చూచినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు'' మనము ఆయన వాక్యమును ఆనందించుచూ, దివారాత్రము ధానిని ద్యానించినప్పుడు, మనము ఏమి చేసినను అది సఫలము అవుతుంది. ఈ వాక్యము కూడా అదే చెబుతుంది, "నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మది కలిగి సురక్షితముగా ఉంటారు'' అని వ్రాయబడియున్నది. కనుకనే, మిమ్మును మీరు ప్రభువు ఇప్పుడే సమర్పించుకొనండి. ప్రతి దినము జాగ్రత్తగా ఆయన ఉపదేశమును ఆలకించడానికి సిద్ధముగా ఉండండి. ఇంకను ఎవరి స్వరమును వినకండి. కేవలము, ఆయన మాటలను మాత్రమే వినండి, అప్పుడు ఏ కీడును బట్టి కూడా భయము చెందరు. ప్రభువు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక. ప్రభువు మీకు నూతన వాగ్దానములు ఇచ్చును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నీ ఉపదేశము నంగీకరించు మేము సురక్షితముగా నివసించునట్లుగాను, కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా నుండును అని ఎంతో స్పష్టముగా చెప్పియున్నందుకై నీకు వందనాలు. ప్రియమైన తండ్రీ, మాతో మాట్లాడాలని మరియు మమ్మును నీ నీతి మార్గాల్లో నడిపించాలని కోరుకునే ప్రేమగల దేవునిగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, అనుదినము నీ వాక్యమును చదవడానికి, కృపను అనుగ్రహించుము. తండ్రీ, అనుదినము నీ మాటలను ఎంతో జాగ్రత్త వినడానికి మాకు దయచేయుము. ప్రభువా, అనవసరములైన స్వరములు, వినిపించే ద్వారములను ఇప్పుడే మూసివేయుము. ప్రభువా, ఎల్లప్పుడు నీ ఆత్మతో నింపబడే కృపను మాకు దయచేయుము. తండ్రీ, అనుదినము, ఏదో ఒక స్వరమును వినగలిగే చెవులను మాకు అనుగ్రహించుము. ప్రభువా, అబద్ధములు చెప్పు నోటిని మా యొద్ద నుండి తొలగించుము. దేవా, ఇప్పుడు కూడా, మా చెవులను, మా హృదయాన్ని మరియు మా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాము. దేవా, ప్రతి పరధ్యాన స్వరాన్ని నిశ్శబ్దం చేయడానికి మరియు ప్రతిరోజు నీ స్వరమును వినడానికి మా ఆత్మను నీ వైపు త్రిప్పడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ స్వరాన్ని తెలుసుకుని ఆనందంతో నిన్ను అనుసరించే నీ గొర్రెలలో మమ్మును లెక్కించుము. దేవా, మేము దారి తప్పినప్పుడు, ప్రభువా, దయచేసి మమ్మును తిరిగి నీ స్వరముతో మేము పిలువబడునట్లుగా చేయుము. దేవా, మేము అలసిపోయినప్పుడు, మా హృదయంలో నెమ్మదిగా మాట్లాడండి. ప్రభువా, మమ్మును నీ రహస్య స్థలంలో నివసించునట్లుగాను, నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకొనుటకును మరియు కీడు వచ్చునన్న భయం లేకుండా సురక్షితంగా నివసించునట్లుగా కృపనిమ్ము. దేవా, అన్నింటికంటే ఎక్కువగా మేము నీ స్వరాన్ని వినుటకు ఎంచుకొనే కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.