నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ రోజు పునరుత్థానము (ఈస్టర్) శుభదినము. కానీ, మీరు ఏడుస్తున్నారా? లోక విషయాలపైనా లేదా మీరు నమ్మిన వ్యక్తులపైనా మీరు కలిగియున్న నమ్మకమునంతటిని కోల్పోయారా? ధైర్యంగా ఉండండి, మీ హృదయమును కలవరపడనీయ్యకండి. ఎందుకంటే, ఈ రోజు ప్రభువు పునరుత్థానుడై యున్నాడు. ఆయన మన కొరకు లేచియున్నాడు. కనుకనే, ఆయన ఈ రోజు ఈలాగున వాగ్దానము చేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:9 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?'' ప్రకారం ఆయన మనకు తండ్రిగా ఉండి మనలను పునరుత్థానములోనికి చక్కగా నడిపిస్తాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానము కాదా?
నా ప్రియులారా, అవును, వారు ఏడ్చుచు వచ్చెదరు. ఒకవేళ ఈ రోజు కూడా ఏడుస్తూ మీరు ఇక్కడకు వచ్చియుండవచ్చును. మీరు మీ నిరీక్షణనంతటిని కోల్పోయారా? మీ ధనమంతటిని మరియు మీ బలమంతటిని కోల్పోయారా? మీరు ఎవరిలో నమ్మకముంచారో దానినంతటిని కోల్పోయారా? అయితే, అటువంటి మిమ్మును చూచి ప్రభువు అంటున్నాడు, " నేను వారిని నడిపించెదను. ఎటువంటి స్థితిలోనైనను నేను వారిని నడిపిస్తాను నేను ఇశ్రాయేలీయులకు తండ్రిని గనుకనే, వారు త్రొటిల్లకుండా చక్కగా పోవు మార్గములో నేను వారిని నడిపిస్తాను'' అని అంటున్నాడు. అందుకే కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా కాపరి'' అని దావీదు భక్తుడు అంటున్నాడు. నా ప్రియులారా, ఈ మాటలను మీరు కూడా నమ్మండి. అదే మాటను మీరు కూడా చెప్పండి. మీరు నిరాశ మరియు నిస్పృహలలో ఉన్నారా? అంతటిని కోల్పోయారని ఏడుస్తున్నారా? అందుకే దావీదు ఈ విధంగా అంటున్నాడు, "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు'' అని స్పష్టంగా చెబుతున్నాడు. ఆలాగుననే, స్నేహితులారా, సర్వశక్తుడైన ప్రభువు యందు మీ పూర్ణ నమ్మకమును ఉంచండి.
నా ప్రియులారా, అదే పునరుత్థానము దినము. అదే ఈస్టర్ శుభదినముగా ఉన్నది. ఈ దినమున ప్రభువు తిరిగి లేచియున్నాడు. ఆయన మృతి చెందినటువంటి దేవుడు కాదు, ఆయన ఈ రోజు సజీవుడు. ఆయన ఎల్లప్పుడు సజీవుడుగా ఉన్నాడు. ఎల్లవేళల ఆయన మనకు సహాయము చేయడానికై సిద్ధముగా ఉన్న దేవుడు. అదే పునరుత్థానము. నేడు మీరు ధైర్యం పొందుకొనండి. 'అయ్యో, మేము అవి కోల్పోయాము, ఇవి కోల్పోయాము' అని ఏడుస్తూ ఉండకండి. ఆయనే మీ కాపరియై ఉంటుండగా, మీ పూర్తి నమ్మకమును ఆయన యందు ఉంచండి. బైబిల్‌లో సామెతలు 10:22వ వచనమును చూచినట్లయితే, "యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు'' ప్రకారము నేడు తన ఆశీర్వాదము చేత మీకు ఐశ్వర్యమును ఇస్తాడు. ఇంకను సామెతలు 28:25 వచనములో చూచినట్లయితే, "యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును'' అని చెప్పబడినట్లుగానే, మీరు వర్థిల్లాలంటే, ఆయన యందు నమ్మకము కలిగి ఉండండి. ఆలాగుననే, మరొక వచనము యిర్మీయా 31:14లో చూచినట్లయితే, "క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు'' ప్రకారంము దేవుని ఉపకారములను గుర్తించి మీరు తృప్తి పొందెదరు.
నా ప్రియమైన వారలారా, ఈ రోజు మీరు విలపిస్తున్నారేమో? "నా ఆరోగ్యమును కోల్పోయాను, నా ధనమును మరియు సమాధానమును కోల్పోయాను'' అని అంటున్నారా? కుటుంబ సమస్యలతో పోరాడుచున్నారా? కుటుంబములో సమాధానము లేదు మరియు అంతా చీకటి మయముగా ఉన్నది. ఎటుచూచినను, అంతా చీకటిగా ఉన్నది అని అంటున్నారా? అటువంటి మిమ్మును చూచి, ప్రభువు ఈలాగున అంటున్నాడు, "నిన్ను పునరుద్ధరీకరించుటకు నేను ఈ లోకమునకు వచ్చాను. అందుకే నీ కొరకు ఆ సిలువలో నా ప్రాణమును పెట్టాను. మరియు నేను ఈ రోజు పునరుత్థానుడై ఉన్న దేవుడను. నీ జీవితములో నేను గొప్ప కార్యములను చేస్తాను. నేను నీ జీవితమును పునరుద్ధరీకరిస్తాను, నీ చీకటి అంతయు నీ నుండి తొలగించబడుతుంది'' అని అంటున్నాడు. నేడు మీ చీకటిని తొలగించి, మిమ్మును పునరుద్ధరించే దేవుని వైపు చూద్దాము, రండి. హల్లెలూయా! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ జీవితాలను పునరుద్ధరించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా అమూల్యమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మా కొరకై నీ ప్రాణములను పెట్టినందుకై నీకు వందనాలు. దేవా, నేడు మాపై నీ దృష్టిని ఉంచుము. ఇంకను మా ఏడ్పులను చూడుము, మా కొరకు నీ ప్రాణమును సిలువలో సమర్పించావు కదా. యేసయ్యా, మా కొరకు మరణమును జయించి, నేడు సజీవముగా మా మధ్యలో ఉన్నావు కనుకనే, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నేడు మా జీవితములో ఉన్న మా చీకటినంతటిని మరియు మా బాధలన్నిటిని మా నుండి తొలగించి, నీ యొక్క మేలులతో మమ్మును నింపుము. దేవా, నీ కృపను మేము సమృద్ధిగా కలిగియుండునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితాలను పునరుద్ధరీకరించి, మాకు నూతన జీవితమును కలుగజేయుము. దేవా, నీవు మాకు మంచి కాపరివి, మా జీవితంలో మాకు ఏ మేలు కొదువలేకుండా చేయుము. ఇంకను మా బలహీనతలో కూడా, మమ్మును నీవు శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మా విరిగిన హృదయాన్ని పునరుద్ధరించుము మరియు మేము కోల్పోయినవన్నీ పునరుద్ధరించుము. దేవా, మేము మానవులము కనుకనే, నీ అపజయం లేని ప్రేమను నమ్ముచున్నాము. ప్రభువైన యేసు, పునరుతానుడవై నీవు నిత్యము సజీవంగా ఉన్నావు. కనుకనే, నేడు మా దుఃఖాన్ని తొలగించి, దానిని నీ ఆనందంతో మమ్మును నింపుము. దేవా, నీ మేలులతో మమ్మును తృప్తిపరచుము మరియు మమ్మును సమృద్ధిగా నింపుమని మా ప్రభువును ప్రియ రక్షకుడవైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.