నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 1:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో దేవుడు యెహోషువతో, "నేను...మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను'' అని సెలవిచ్చియున్నాడు. ఈ వాగ్దానం నేడు మీ యొద్దకు వస్తుంది. ఆయన ఇలాగున అంటున్నాడు, 'పైకి లేమ్ము! మీ బద్ధకం నుండి పైకి లేమ్ము. పాపపు ఊభిలో నుండి పైకి లేమ్ము. మీరు భయపడిన స్థలము నుండి పైకి లేమ్ము. అక్రమ సంబంధాల నుండి పైకి లేమ్ము. మీ అవిశ్వాసం నుండి పైకి లేమ్ము. మీ బలహీనతల నుండి బయటకు రమ్ము, మీ యొక్క పాదములతో ఒక అడుగు ముందుకు వేయుము. మీ జీవితము కొరకైన ఆశీర్వాదాల భూభాగమును మీరు స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ముందుకు వెళ్లగోరుచున్న సమయం ఆసన్నమైనది. కనుకనే, ఈరోజున మీరు మీ అడుగును ముందుకు వేయండి. మీ యొక్క అడుగులు ముందుకు వేసి, దేవుడు మీ జీవితములో మీ కొరకు కలిగియున్న ఆశీర్వాదములను స్వతంత్రించుకొనుటకు ప్రారంభించండి. నా అమూల్యమైన స్నేహితులారా, మీరు మీ కొరకు దేవుని యొక్క సకల ఆశీర్వాదాలను స్వతంత్రించుకొను నిమిత్తము మీ పాదాలు ఎలాగున ఉండాలి? మొట్టమొదట, మీ పాదములు పరిశుద్ధపరచబడాలి. అందుకే హెబ్రీయులకు 12:13వ వచనములో ఇలాగున చెబుతుంది, " మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి'' అని దేవుడు కోరుచున్నాడు. మరొక అనువాదంలో, క్రీస్తు పాదాలవలె అక్షరాల మీ పాదాలు పరిశుద్ధపరచబడాలి, తద్వారా యేసు మీతోను మరియు మీరు ఆయనతో నడవగలుగుతారు అని చెబుతుంది. నా ప్రియులారా, ఈ రోజు మిమ్మల్ని ఏ పాపం చుట్టుముట్టినా, ఏ పాపమైతే మిమ్మును ముందుకు వెళ్లనివ్వకుండా ఆటంకపరుస్తుందో, 'ప్రభువా, ఆ పాపము నుండి నన్ను కడిగి శుద్ధికరించుమని' ఆయనను మీరు అడగండి. మీ పాదాలను శుభ్రపరచమని ఆయనను అడగండి. బైబిల్ నుండి యోహాను 13:1-3వ వచనముల ప్రకారముగా, ముందుకు వెళ్లు నిమిత్తము తండ్రి తన చేతికి సమస్త అధికారము అప్పగించియున్నాడని యేసు ఎరిగియున్న రీతిగా, ఆయన తన పై వస్త్రాన్ని తీసివేసి, తన నడుము చుట్టు తువ్వాలు చుట్టుకుని, ఒక గిన్నెలో నీళ్లు పోసి, శిష్యులు తనను అనుసరించి, తన నీతి మార్గమును వెంబడిస్తూ, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనునట్లుగా ఆయన పాదాలను కడిగి శుద్ధీకరించాడు. అదేవిధముగా, ఈ రోజు, యేసు మీ పాదాలను కడిగి శుద్ధీకరించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీ పాదాలను మరియు మీ హృదయాలను ఆయనకు ఇవ్వండి. మీరు ఆయనతో నడుచునట్లుగా, సమస్త భూలోకసంబంధమైన పాపము నుండి మిమ్మును కడిగి శుద్ధీకరించుటకు మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకొనండి.

రెండవదిగా, మీ పాదములు సమాధానముతో నింపబడి ఉండాలి. అందుకే ఎఫెసీయులకు 6:15 వ వచనములో చూచినట్లయితే, "పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి '' అని చెబుతుంది. ఇంకను హెబ్రీయులకు 12:14 వ వచనములో చూచినట్లయితే, మనలను ఇలా ప్రోత్సహిస్తుంది: "అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు'' ప్రకారం పరిశుద్ధతను కలిగియున్నప్పుడు మీరు సమాధానమును కలిగియుంటూ, యేసు యొక్క ముఖదర్శనమును చేసెదరు. కనుకనే, సమస్త మనుష్యులతోను సమాధానముగా ఉండండి. ప్రత్యేకంగా, వివాహ జీవితములో భార్యాభర్తల మధ్య సంపూర్ణ సమాధానము చాలా అవసరం. అందుచేతనే, ఒకరితో ఒకరు సమాధానముతో ఉండాలి. తనను తాను తగ్గించుకోవడం, ఎల్లవేళల, అన్ని విధాలుగా ఒకరినొకరు భరించునట్లుగా యేసు స్వభావాన్ని కలిగి ఉండాలి. బాంధవ్యములో ఏకముగా ఉండు నిమిత్తము ఒకరి యొద్ద ఒకరు క్షమాపణ అడగడానికి మరియు సంబంధంలో ఐక్యతను పునరుద్ధరించడానికి ధైర్యము కలిగినవారై ఉండాలి. వివాహ జీవితములో సమాధానము ఎలా ఉంటుందో, ఆ సమాధానము మీ పిల్లల జీవితములో కూడా ప్రకాశిస్తుంది. అది మీ పిల్లల జీవితములో గొప్పగా ఉంటుంది. దీనితో పాటుగా, మనుష్యులందరితోను సమాధానముగా ఉండాలి. మీ యొక్క కార్యాలయములో మీ సహోద్యోగులతోను, మీ పొరుగువారితోను మరియు మీ శత్రువులతోను కూడా సమాధానమును కలిగి ఉండాలి. సామెతలు ఇలా చెబుతున్నాయి, " ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును'' ప్రకారం ఈ రోజున మీ శత్రువులందరితో సమాధానముగా ఉండండి. అవును, ఎవరైన మీ భూమిని తీసుకున్నారని మీరు ఆగ్రహముతో ఉన్నారా? ఎవరైన మీ డబ్బును తీసుకొని తిరిగి చెల్లించలేదా? మీకు విరుద్ధముగా పనిచేసి, మీ పదోన్నతిని మీకు రాకుండా ఆపు చేసియున్నారని కోపముతో ఉన్నారా? అయితే, ఇప్పుడే, వారిని క్షమించండి మరియు వారిని ప్రేమించండి. అది సమాధానకరమైన మార్గం. యేసు ఇలాగున అంటున్నాడు, " ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పై వస్త్రము కూడ ఇచ్చివేయుము'' అప్పుడు మీరు సమాధానమును కలిగి ఉంటారు. మీకు శత్రువులు ఇక ఉండరు. దేవుని యొక్క దైవాశీర్వాదములను మీ కొరకు కలిగియున్న స్వాస్థ్య సంపదలోనికి మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్లతారు. మీకు అన్యాయం చేసిన వ్యక్తి మీ ధనానికి మూలం కాదు. ఇతరుల నుండి మీరు తిరిగి పొందుకునే ధనము మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేయదు. కానీ, దేవుడు మీకు అనుగ్రహించేది మాత్రమే మిమ్మల్ని నిజంగా ఐశ్వర్యవంతులనుగా చేస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు మీ కొరకు కలిగి ఉన్న స్వాస్థ్య భూభాగమును స్వతంత్రించుకొనుటకు అందరితో సమాధానమును కలిగియుండుటయే మార్గము. అవును, దైవాశీర్వాదములను మీలో పొంగి ప్రవహించును.

మూడవదిగా, బైబిల్ నుండి కీర్తనలు 119:105వ వచనములో, " నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది '' అని చెప్పబడిన ప్రకారం దేవుని వాక్యము ప్రకారం నడుచుకోవాలి అని తెలియజేయుచున్నది. అవును, సమస్తము దేవుని యొక్క వాక్యానుసారముగా జరిగించండి. అందుకే, దేవుని యొక్క వాక్యం మీ పాదములకు దీపమై ఉన్నది. కాబట్టి, మీరు దానిని చదవండి. ఆ వాక్యమును అనుసరించండి. మీరు వాక్యము చదివిన తర్వాతనే, సమస్తమును జరిగించండి, ఇంకను దేవుని ప్రణాళిక చొప్పున జరిగించండి, ఈ రోజున కూడా, దేవుని ఆశీర్వాదాలను మీరు స్వతంత్రించుకొను నిమిత్తము దేవుని యొక్క వాక్కు ఈ రీతిగా మీ యొద్దకు వస్తుంది. మీరు దేవుని యొద్ద నుండి ఈ మాటను ఆలకిస్తున్నందుకై నేను ఆనందించుచున్నాను.

నాల్గవదిగా, సువార్తను ప్రతివారికిని ప్రకటించండి అని ఇలాగున బైబిల్‌లో యెషయా 52:7వ వచనములో చెప్పబడియున్నది, "సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి'' అని చెప్పబడియున్నట్లుగానే, యేసు రక్షకుడు, స్వస్థపరచువాడు మరియు పోషకుడు అని మీరు ప్రకటించినప్పుడు మరియు అవసరంలో ఉన్నవారి కొరకు ప్రార్థించినప్పుడు, దేవుడు మీ పాదములను సుందరముగా మార్చి, ఉన్నత స్థలములకు ఎక్కించును. అందుకే యెషయా 58:14వ వచనములో చూచినట్లయితే, " నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను'' ప్రకారం ఆయన మిమ్మల్ని భూమి యొక్క ఉన్నత స్థలములపై ఎక్కించునని చెప్పబడియున్నది.

నా ప్రియ స్నేహితులారా, దేవుడు మా జీవితములో మా పట్ల జరిగించిన కార్యములను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. అనేక సంవత్సరాల క్రితం, మేము మా కుటుంబంలోను మరియు పరిచర్యలోను ఎన్నో అప్పులలో కూరుకుపోయాము. అయితే, మాకు ప్రభువు ఒక స్పష్టమైన సూచన ఇచ్చాడు: 'మీరు పొందుకునే ప్రతిదానిలోను, మీ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, యేసు పిలుచుచున్నాడు పరిచర్య నుండి పదియభాగమును కూడా ఇతర సేవాపరిచర్యలకు ఇవ్వండి' అని సెలవిచ్చాడు. ఆలాగుననే, యేసు పిలుచుచున్నాడు పరిచర్య నుండి వచ్చిన కానుకల నుండి పదియభాగమును తీసుకొని ఇతర సేవాపరిచర్యలకు ఇవ్వమని చెప్పినట్లుగానే, మేము మా బిల్లులు చెల్లించడానికి ముందుగానే, చర్చిలకు సహాయమందించడానికి, జాగ్రత్త వహించడానికి మేము ప్రారంభించాము. మరియు సీషా ద్వారా పేద ప్రజలకు సహాయం అందించడానికి ప్రతి నెలా వచ్చిన విరాళాలలో పదియభాగము ఇచ్చి, దైవ సేవకులకు సహాయము చేయుటకు ప్రారంభించాము. కనుకనే, మేము ఇచ్చినట్లుగానే, అందుకు ప్రతిగా, దేవుడు అద్భుత రీతిగా మాకు సహాయమును అందించాడు. కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే, ఆయన మా అప్పులన్నిటి మా నుండి తొలగించాడు. మరియు సేవా పరిచర్య ద్వారా మరి ఎక్కువ మందిని సందర్శించడానికి మాకు సహాయం చేశాడు. నేటికిని, పరిచర్యకు సంబంధించిన అవసరాలను తీర్చడానికి మనకు చాలినంతగా, సంపూర్ణ సామర్థ్యం కలిగియున్నాము. అది ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా, దేవుడు మాకు తగినంత మట్టుకు మాకు ఇచ్చుచున్నాడు. నేను ఒకసారి ఒక పాస్టర్ల బృందానికి ఇలా తెలియజేశాను, ' మీ సంఘములో వచ్చిన కానుకలలో పదియభాగమును తీసుకొని, మీ ప్రక్కన ఉన్న మరొక సంఘమునకు ఇవ్వండి, ప్రార్థనా మందిరమును నిర్మించుకునేవారికి సహాయము చేయండి, మరియు సువార్తకు, ప్రార్థన పరిచర్యలకు ఇవ్వండి. పేదల పట్ల శ్రద్ధ వహించే పరిచర్యకు ఇవ్వండి. మరియు దేవుడు మీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు అభివృద్ధి చెందుతారు. మీ యొక్క సంఘములో మీ భద్రతలో ఉంచబడునట్లుగా, వేలాదిమంది ఆత్మలు మీ సంరక్షణలో ఉండునట్లుగా మీ యొద్దకు పంపిస్తాడు. మీరు వర్థిల్లెదరు, మీరు మీ కాలును పెట్టు ప్రతి స్థలము, ఆ భూభాగమును స్వతంత్రించుకుంటారు. దేవుడు ఆ భూభాగమును మీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. ఎవరూ దానిని మీ యొద్ద నుండి తీసుకోరు. దాని నుండి మిమ్మును ఎవరూ కదిలించలేరు. మీరు బలంగా ఉంటారని చెప్పాను.' ఆలాగుననే, నా ప్రియులారా, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ఈ విధంగా 63 సంవత్సరాలుగా దేవుని యొక్క కృపతో స్థిరపరచాడు. ఆలాగుననే, దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా మిమ్మును కూడా ఇదేరీతిగా దీవించును గాక.

ప్రార్థన:
ప్రియమైన పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము అడుగు పెట్టుచున్న ప్రతి స్థలాన్ని, నీవు మాకు ఇస్తావని నీ ప్రేమపూర్వక వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు, మేము భయం, పాపం, సందేహం మరియు మమ్మును వెనుకకు లాగిన ప్రతిదాని నుండి పైకి లేచునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, దయచేసి మా హృదయాన్ని శుభ్రపరచుము మరియు మా పాదాలను పరిశుద్ధపరచుము, యేసు తన శిష్యుల పాదాలను కడిగినట్లుగానే, నేడు మా పాదాలను కడిగి పవిత్రపరచుము. దేవా, పరిశుద్ధత మరియు సమాధానముతో నీతో నడవడానికి మమ్మును సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొనుటకు మమ్మును సిద్ధపరచుము. ప్రభువా, మేము వేయు ప్రతి అడుగును నీ వాక్యం ద్వారా నడిపించుము. మరియు మేము ఎక్కడికి వెళ్ళినా రక్షణ సందేశాన్ని మోసుకొని వెళ్లడానికి మాకు సహాయం చేయుము. దేవా, మాకు విరోధముగా లేచినవారిని క్షమించడానికి, పగ, అసూయ, ద్వేషము నుండి తొలగించడానికి మరియు అందరితో సమాధానముతో నడుచుకొనడానికిమాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మేము మా జీవిత ప్రయాణాన్ని నీకు అప్పగించుకొనుచున్నాము. మా పాదములను సుందరములుగా మార్చుము. దేవా, మా యొక్క ఒక్కొక్క అడుగు, ఆశీర్వాద భూభాగములోనికి నడిపించుటకును మరియు ఈ భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించుటకు మాకు సహాయము చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.