నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 42:2వ వచనమును మనము ఈ రోజు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని'' ప్రకారం యోబు దేవుని తన హృదయ పూర్వకంగా ప్రేమించి, ఆయనను విశ్వసించిన వ్యక్తి. అతను ప్రభువుతో సమీపముగా నడిచాడు. అయినప్పటికిని, అతని దృఢమైన విశ్వాసమును కలిగి ఉన్నప్పటికిని, అతను జీవితంలో ఒక్కసారిగా సమస్తమును కోల్పోయాడు - అతని పిల్లలు, అతని ఆరోగ్యం మరియు అతనికి ఉన్న యావదాస్తిని కూడా కోల్పోయాడు. అతనికి ఏమియు కూడా లేకుండా పోయింది. కానీ, అతనికి కలిగియున్న ప్రగాఢమైన బాధల మధ్యలో కూడా, అతను దేవునికి మొరపెట్టాడు, ' ప్రభువా, నీవే నా నిరీక్షణ, నా ఏకైక నమ్మకము!' అని దృఢంగా చెప్పగలిగాడు. బైబిల్‌లో సామెతలు 28:25 చూచినట్లయితే, "యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును'' అని చెప్పినట్లుగా, యోబు దేవుని పరిపూర్ణంగా నమ్మాడు మరియు ఆయన మార్గాలను శ్రద్ధగా వెండించాడు. ఇంకను యోబు 13:15వ వచనములో చూచినట్లయితే, "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును'' అన్న వచనం ప్రకారం యోబు ధైర్యంగా చెప్పగలిగాడు. మరియు యోబు 23:10వ వచనములో చూచినట్లయితే, "నేను నడచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును'' అని కూడా ధృఢంగా చెప్పగలిగాడు. హల్లెలూయా!
నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే, ప్రభువు పట్ల మీకున్న ప్రేమ ఎంత లోతైనది? మీరు అన్ని సమయాలలో ఆయనను నమ్ముచున్నారా? ఇంకను మీరు సమస్తమును కోల్పోయినప్పుడు, మీరు ఇంకా ఆయనపై దృష్టి పెడతారా? కానీ, భక్తుడైన యోబు చేసింది కూడా అదే కార్యము. తన స్నేహితులు తనను హేళన చేసినప్పుడు, ఇంకను తన కుటుంబం తనను విడిచిపెట్టినప్పుడు, మరియు తనను ప్రోత్సహించడానికి ఎవరు లేనప్పుడు కూడా అతను దేవునిని గట్టిగా పట్టుకున్నాడు. అయినప్పటికిని, అతని యొక్క విశ్వాసం అలాగే స్థిరంగా ఉండెను. కనుకనే, అతను ఇలాగున దృఢంగా చెప్పగలిగాడు, 'ఆయన నా దేవుడు! ఆయన నన్ను నిరాశపరచడు. ఆయన నన్ను చంపినప్పటికిని, నేను ఆయనను నమ్ముతాను' అని చెప్పాడు. కాబట్టి, అతనికున్న దృఢమైన నమ్మకం కారణంగా, దేవుడు అతని పట్ల బహుగా ఆనందించాడు. కనుకనే దేవుడు, యోబు జీవితములో తాను ఎదుర్కొన ప్రతి వ్యతిరేకత నుండియు మరియు ప్రతి శోధన నుండి అతనిని పైకి లేవ నెత్తాడు. అంతమాత్రమే కాదు, అతడు కోల్పోయిన దానిని దేవుడు అతనికి రెండంతలుగా మరల అనుగ్రహించి, అతనిని సమృద్ధిగా ఆశీర్వదించాడు.
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అదే దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు! ఆయన జీవముగల మరియు ప్రేమగల దేవుడు. మరియు ఆయన మీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలను జరిగించాలని కోరుకుంటున్నాడు. మీరు కలిగియున్న సమస్తమును కోల్పోయినట్లు మీకు అనిపించుచున్నదా? 'నాకు నమ్మకము లేదు. నన్ను ఎవరూ ప్రేమించేవారు లేరు. నన్ను ఎవరూ పట్టించుకోరు' అని మీరు అంటున్నారా? ధైర్యంగా ఉండండి! ప్రభువు ప్రేమగల దేవుడు. కనుకనే, మీరు ఆయన వైపు చూడండి. ఆయనను హత్తుకొనండి. ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. నా ప్రియులారా, నేడు మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నను సరే, ఇప్పుడే, మీరు ఆయనను మీ హృదయపూర్వకంగా నమ్మినప్పుడు, మీరు ఆయనలో ఉన్న సమృద్ధియైన ఆశీర్వాదాలను పొందుకుంటారు. ఆలాగుననే, నేడు మీరు ఆయనను మీరు యోబువలె పరిపూర్ణంగా నమ్మిట్లయితే, మీరు దేవుని మహిమను తప్పకుండా చూచెదరు! ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
 ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవు సమస్తమును చేయగలవని తెలుసుకొని, సంపూర్ణమైన విశ్వాసంతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, మేము మా జీవితములో నష్టపోయినా, నిరాశ చెందినా, నీపైనే మా దృష్టిని నిలుపుటకు మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవిత పయనములో ఎటువంటి శోధనలు ఎదురు వచ్చినను, మేము నిన్ను అంటిపెట్టుకుని ఉండునట్లుగా మా విశ్వాసాన్ని బలపరచుము. యేసయ్యా, ఎటువంటి సందేహం, భయం లేదా నిరుత్సాహం, నీ యొక్క ఓడించలేని ప్రేమలో మేము దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మమ్మును నీ సన్నిధితో ఆవరించునట్లుగాను, జీవితంలోని ప్రతి తుఫానులలో కూడా, నీవు మాకు ఆశ్రయముగా ఉండుము. ప్రభువా, మా కష్టాల నుండి మమ్మును పైకి లేపి, నీ దైవీకమైన చిత్తం ప్రకారం మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మా గమ్యమును నీవు నియంత్రించగలవని తెలుసుకుని, మా హృదయాన్ని శాంతితో నింపుము. దేవా, మేము నీ యందు యోబువలె భయభక్తులతోను, విధేయతతోను నడవడానికి మరియు నీ వాగ్దానాలను గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ యొక్క పరిపూర్ణమైన ప్రణాళికను మేము నమ్మునట్లుగాను, తద్వారా, మేము నీ మహిమ మా జీవితంలో బయలుపరచబడునట్లుగా మాకు నీ కృపను చూపుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

 దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి    
  Donate Now


