నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు బైబిల్ నుండి ఒక చక్కటి వాగ్దానముగా కీర్తనలు 46:1వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' ప్రకారము దేవుడు ఆపత్కాలములో మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. అనేకసార్లు, నా భర్తగారు ఈ వచనము చెబుతుంటారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు నా భర్తగారికి కాల్ చేసి, ప్రార్థన చేయించుకునేవారు. మీ యొక్క కష్ట సమయములలో ప్రభువే మీకు నమ్ముకొనదగిన సహాయకుడు అని నా భర్తగారు వారికి చెప్పేవారు. అవును, మన జీవితములలో కష్టాలు ఎదురైనప్పుడు మనము ప్రభువు చెంతకు వెళ్లతాము. ఆలాగుననే, రాజైన దావీదు కష్టాలు ఎదురైన ప్రతిసారి కూడా దేవుని యొక్క బలిపీఠము యొద్దకు పరుగెత్తేవాడు. బైబిల్ నుండి కీర్తనలు 18:2వ వచనములో చూచినట్లయితే, అనేకసార్లు దావీదు ఈలాగున చెప్పేవాడు, "యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము'' ప్రకారము కష్టాల సమయములో దావీదు దేవుని తన కోటగా ఉంచుకున్నాడు. కనుకనే, దావీదు ఏ విషయమైన సరే, మొదటగా ప్రభువు యొద్దకు వెళ్లి ప్రార్థించేవాడు. ప్రభువు లేకుండా ఎక్కడికి వెళ్లేవాడు కాదు. అందుకే, ప్రభువు కూడా దావీదు ఎక్కడికి వెళ్లినను, ఆయన అతనికి తోడుగా ఉండెను. అందుకే బైబిల్‌లో 2 సమూయేలు 8:14వ వచనమును చూచినట్లయితే, "మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలి దండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను'' ప్రకారము దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ, అతనికి విజయమిచ్చెను. నా ప్రియులారా, మీ జీవితములో కూడా ప్రభువు చేయబోయేకార్యము ఇదియే అయి ఉన్నది. మీలో కొందరు, 'నేను ఎంతగానో ప్రయాణము చేయాలి' అని చెబుతుండవచ్చును. 'నాతో ప్రభువు ఉన్నాడా?' అని మీరు అడుగుచుండవచ్చును. అయితే, నా ప్రియులారా, మీరు బయటకు వెళ్లినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రభువు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది.

ఒకసారి మేము కుటుంబముగా ఒక సమస్యను ఎదుర్కొన్నాము. ఆ సమయములో ప్రభువు నా భర్తగారి ద్వారా ఈ విధంగా మాట్లాడియున్నాడు, ' నా బిడ్డలారా, ఈ కష్ట సమయములో మీరు నిరుత్సాహపరచబడకండి. ఓపికగా కనిపెట్టి ఉండండి. ప్రార్థనలో ఉండండి. నేను మీకు తోడుగా ఉంటాను. మీ కుటుంబముపైన నేను ఒక మేఘము వలె ఆవరించి కప్పుతాను. మీరు ఎక్కడికి వెళ్లినను, నేను మీ యొద్దకు వస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీ మార్గమున మిమ్మును నడిపించు దేవుడను నేనే, మీకు విజయమిచ్చువాడను నేనే అని చెప్పియున్నాడు.' అవును, ప్రభువు మాతో మాట్లాడిన ప్రతిసారి కూడా, 'నా బిడ్డలారా, నా కృప మీకు చాలును' అను ఈ మాటతో ఆయన మమ్ములను ఆదరిస్తాడు. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 12:9వ వచనమును చూచినట్లయితే, "అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను'' ప్రకారం మీ జీవితములో శ్రమలు ఎదురైనప్పుడు, మీరు భయపడకండి, ఓపికగా కనిపెట్టండి, ప్రార్థనలో కనిపెట్టండి. బైబిల్ నుండి రోమీయులకు 12:12వ వచనములో ఉన్నట్లుగానే, మీరు ఆ వచనమును గట్టిగా పట్టుకొనండి, "నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి'' ప్రకారము ఎటువంటి పరిస్థితిలోను మీరు కూడా ప్రార్థనను విడువకుండా ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండండి. కనుకనే, ఈ వచనమును గట్టిగా పట్టుకొనండి. దావీదు చెప్పిన రీతిగానే, ' ప్రభువా, నీవే మా దుర్గము, నీవే మా ఆశ్రయము, నీవే మమ్మును విడుదల చేయువాడు, నా యొక్క ఆశ్రయ దుర్గము కేడెము నీవే' అని మీరు కూడా చెప్పండి. నూతన నిబంధన గ్రంథములో ఫిలిప్పీయులకు 4:13వ వచనములో చూచినట్లయితే, "నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను'' అని పౌలు భక్తుడు చెప్పినట్లుగానే, " నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను'' అని మీరు కూడా చెప్పాలి. యేసయ్య సహాయముతో మేము అన్నిటిని చేయగలము అని చెప్పగలగాలి. మీరు, 'ఎటువంటి కష్టాలను మరియు శ్రమలను చూచి నేను భయపడను' అని చెప్పాలి. పౌలు భక్తుడు అనేకమైన శ్రమలను ఎదుర్కొన్నాడు. క్రీస్తు నిమిత్తము అతను కొట్టబడియున్నాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. ఓడ పగిలి శ్రమడియున్నాడు, ఒకసారి సర్పము చేత కాటువేయబడ్డా. అప్పుడు ప్రజలు అతనిని రాళ్లతో కొట్టారు. అయినప్పటికిని, 'నన్ను బలపరచు క్రీస్తు యేసునందు నేను సమస్తమును చేయగలను' అని అతడు ధైర్యముగా చెప్పగలిగాడు.

మా కుమార్తె స్టెల్లా రమోలా ఈ విధంగా పాట పాడుచుండేది, 'యేసయ్యా, నా జీవితములో ఉంటే అది నాకు చాలును' అని తరచు అదే పాట పాడేది. అవును, మన ఆపత్కాల సమయములో, ఆపదలు ఎదుర్కొంటున్నప్పుడు, మన ఆశ్రయము, మన సహాయము ప్రభువుగా ఉంటున్నాడు. ప్రియులారా, ప్రార్థనలో ప్రభువు వైపు చూడండి, మీకు సహాయము వస్తుంది. అందుకే బైబిల్ నుండి ఒక చక్కటి వచనమును మనము చూడగలము, "దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు'' ప్రకారము ఇది ఎంత చక్కటి వాగ్దానము కదా! నా ప్రియ స్నేహితులారా, ప్రతి ఉదయమున మొదటి స్థానమును ఆయనకు ఇచ్చి, ఆయన వైపు చూస్తూ, ఆయన సహాయము కొరకు వేడుకుందాము. ప్రభువు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటూ మీకు సహాయ ము చేస్తాడు. మీరు ఎప్పుడు కూడా కదిలించబడరు, చలించబడరు. ప్రతి ఉదయం, మీరు మేల్కొన్నప్పుడు, దేవుని మొదట వెదకండి, మీ ప్రణాళికలు, మీ పని మరియు మీ కుటుంబ జీవితంలోకి ఆయనను ఆహ్వానించండి. మీరు ఆయనతో మీ రోజును ప్రారంభించినప్పుడు, ఆయన సన్నిధి మేఘంలా మీ ముందు వెళుతుంది మరియు ఆయన చేయి మీ అడుగులను నడిపిస్తుంది. గుర్తుంచుకోండి, సహాయం ఇప్పటికే మీ మార్గములో ఉన్నది. ప్రభువు మీ యుద్ధాలతో పోరాడి మీకు శాంతి మరియు విజయాన్ని ఇస్తాడు. మీకు ఇప్పుడు కన్నీళ్లు రావచ్చును, కానీ త్వరలో మీరు ఆనందిస్తారు. ఎందుకంటే, ప్రభువు మీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. మీరు ఆయనపై పూర్తిగా ఆధారపడినప్పుడు, ఆయన బలమైన హస్తము మిమ్మును లేవనెత్తుట మీరు అనుభవించెదరు. కనుకనే, నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, కష్టాల్లో మాకు ఎల్లప్పుడు సహాయంగా ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీవు ఆపత్కాలములో మాకు సహాయము చేసే దేవుడవన్న నీ వాగ్దానమును బట్టి, నీకు వందనాలు. ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి పోరాటంలోనూ మాతో ఉండుము. యేసయ్యా, కదలించబడలేని మా దుర్గము మరియు ఆశ్రయం నీవే. కనుకనే, దేవా, నీ మహిమ మరియు రక్షణ మేఘంతో మా ఇంటిని కప్పుము. ప్రభువా, మా ప్రతి బలహీనత మరియు బాధకు నీ కృప చాలినంతగా మాకు దయచేయుము. దేవా, నీవు మాతో ఒక దుర్గము వలె మాతో ఉండుము. మేము ఎప్పుడు కూడా, ఏది కూడా మమ్మును కదిలించకుండా, బలపరచుము. దేవా, మా జీవితములో ఇక శ్రమలు వద్దు. ప్రతిది చక్కగా జరుగునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము ఏ పని చేయుచుండినను నీవు మాకు తోడుగా ఉండి, మాకు సహాయము చేసి, మమ్మును వర్థిల్లజేయుము. ప్రభువా, ఏదియు కూడా మమ్మును అణిచి వేయకుండా ఉండునట్లుగా మాకు సహాయము చేయము. దేవా, రాబోవు కాలములో నీ సన్నిధానమును మేము అతి సమీపముగా అనుభవించునట్లుగా సహాయము చేయుము, అద్భుతమైన భవిష్యత్తును మాకు దయచేయుము. దేవా, ప్రతి ఉదయకాలములో నీ వైపు చూచునట్లుగా నీకృపను మాకిచ్చి, విజయమును మాకు దయచేయుము. యేసయ్యా, మా యొక్క ప్రతి శ్రమలోను మాకు బలం, సహనం మరియు విశ్వాసమును దయచేయుము. యేసయ్యా, నీ యొక్క శాంతిసమాధానము, విజయం మరియు దైవీక అనుగ్రహంతో మమ్మును ఆశీర్వదించుము. దేవా, ప్రతి మూయబడిన ద్వారములను తెరిచి మా కుటుంబంలో అద్భుతాలు చేయుము. దేవా, మా యొక్క ప్రతి ఉదయము నీ సన్నిధి మరియు ఆనందంతో నింపబడి ఉండునట్లుగా కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.