నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 4:9వ వచనము మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను'' ప్రకారం దేవుడు తన గొప్ప ప్రేమను బట్టి, తన ఏకైక కుమారుని యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించియున్నాడు. అందును బట్టి, యేసుక్రీస్తు తన రక్తాన్ని ఆ సిలువలో మన కొరకు కార్చియున్నాడు. కనుకనే, మనము నూతన సృష్టిగా మార్చబడుచున్నాము.
బైబిల్‌లో సౌలు అను ఒక వ్యక్తి ఉండెను. అతడు ఉగ్రత పాత్రయైయున్నాడు. అతడు యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా చెడు కార్యములను జరిగించేవాడు. దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు వ్యక్తిగతంగా అతనిని దర్శించి, ఆయన ప్రేమను బట్టి, సౌలు పౌలుగా మారడము జరిగియున్నది. పౌలు సెయింట్ పాల్‌గా, అనగా అపొస్తలుడైన పౌలుగా పిలువబడ్డాడు. అంతమాత్రమే కాదు, పౌలు ఒక గొప్ప దైవజనునిగా మార్చబడ్డాడు. అతని జీవితము పూర్తిగా రూపాంతరపరచబడినది. అందుకే గలతీయులకు 2:20వ వచనములో చదివినట్లయితే, " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడ ను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించు చున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు తెలియజేసియున్నాడు. ప్రారంభములో క్రీస్తుతో కూడ ఎటువంటి సంబంధము లేనప్పుడు, ఆయన కోపాన్ని ఉగ్రత పాత్రగా అతడు ఉండేవాడు. కానీ, యేసయ్య తన హృదయములోనికి ప్రవేశించినప్పుడు, అతనిని పూర్తిగా మార్చినప్పుడు, దేవుడు పౌలును కృపా పాత్రగా రూపాంతరపరచాడు.
అవును, నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రేమను బట్టి, మన జీవితాలు పూర్తిగా మార్చబడతాయి. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 5:17వ వచనములో చూచినట్లయితే, మనము నూతన సృష్టిగా మార్చబడతాము. ఆ వచనము, " కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను'' ప్రకారం మన పాత అనవసరమైనటువంటి మరియు వ్యర్థమైనటువంటి అలవాట్లన్నియు మన జీవితమును విడిచి వెళ్లిపోతాయి. మన స్వభావము అంతయు నూతనంగా మార్చబడుతుంది. మనము నూతనంగా మార్చబడతాము. మనము కూడా సిలువ వేయబడాలి. యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడడానికి మనలను మనము ఆయనకు సమర్పించుకున్నప్పుడు, మనము నూతనంగా మార్చబడతాము. బైబిల్‌లో 2 కొరింథీయులకు 5:17 ప్రకారం మనము నూతన సృష్టిగా మార్చబడియున్నాము. మనము దేవుని ప్రేమ చేత నింపబడతాము. దేవుని ప్రేమతో మనము ఎప్పుడైతే నింపబడతామో, అప్పుడు ప్రజలందరికి ఆ ప్రేమను కనుపరచి, వారందరిని యేసుక్రీస్తు యొద్దకు తీసుకొని రాగలుగుతాము. నా ప్రియ స్నేహితులారా, నేడు మీ జీవితములోనికి ఈ ఆశీర్వాదములను రాబోవుచున్నవి. ఇప్పుడే మనము ప్రార్థించి, ఇటువంటి ఆశీర్వాదములను మనము పొందుకుందాము. ఆలాగుననే, పౌలు వలె మన జీవితాలను దేవునికి సమర్పించినట్లయితే, నిశ్చయముగా నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును నూతన సృష్టిగా మార్చి, దీవించును గాక.
ప్రార్థన:
ప్రశస్తమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు పంపించినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా కొరకు ఆ సిలువలో నీవు రక్తమును చిందించినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ చీకటి నుండి, అంధకారము నుండి మమ్మును విడిపించి, కాపాడుమని మొఱ్ఱపెట్టుచున్నాము. యేసయ్యా, నీ రక్తముతో మమ్మును శుద్ధీకరించుము, నీ ప్రేమతో మమ్మును నింపుము. తద్వారా, మేము ఆయన ద్వారా జీవించగలము. యేసయ్యా, నీవు సిలువపై చేసిన త్యాగం ద్వారా మాకు ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకై నీకు వందనాలు. ప్రభువా, సౌలును పౌలుగా మార్చినట్లుగానే, మా జీవితాన్ని కూడా మార్చగలవని మేము నమ్ముచున్నాము. దేవా, మాలోని ప్రతి పాత, అవాంఛిత మరియు ఆధ్యాత్మికం కాని అలవాటును తొలగించుము. దేవా, మమ్మును క్రీస్తు ప్రేమతో నింపబడిన నూతన సృష్టిగా చేయుము. దేవా, మేము ఇకపై మా కొరకు జీవించకుండా, క్రీస్తు మాలో జీవించి మా ద్వారా ప్రకాశింపజేయుము. యేసయ్యా, నీ ప్రేమను ప్రతిబింబించడానికి మరియు ఇతరులు నిన్ను తెలుసుకునేలా నడిపించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ దయ మరియు కృప ద్వారా నీవు మా జీవితంలోకి ఆశీర్వాదాలను కుమ్మరించుమని కోరుచున్నాము. యేసయ్యా, నీ రక్తము ద్వారా మా పాపములను కడిగి శుద్ధీకరించి, మమ్మును అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.