నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:32వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?'' ప్రకారము యేసు సిలువపై మన కొరకు క్రయధనము చెల్లించాడు కాబట్టి, జీవితంలోని ప్రతి ఆశీర్వాదాన్ని మనం సమృద్ధిగా ఆనందించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. అయినప్పటికి ప్రతి ఆశీర్వాదం యేసుతోనే వస్తుంది. నిజమైన ఆనందం బహుమానములో మాత్రమే కాదు, ఇచ్చేవానిలోనే ఉంటుంది. మనం క్రీస్తును కేంద్రంగా చేసుకుని ఆశీర్వాదాలను పొందినప్పుడు, మన జీవితం దేవుని ఆనందం, రక్షణ మరియు ఆశీర్వాదాలను ఇతరులకు కూడా అందించే మార్గంగా మారుతుంది. అందుచేత, దేవుని ఆశీర్వాదాల సమృద్ధి మనం మాత్రమే ఆనందించడానికి కాక, ఆయన మేలును లోకంతో పంచుకోవడానికి కూడా అని ఉద్దేశించబడింది. కనుకనే, ఆయన మన కొరకు ఈ లోకమునకు దిగివచ్చాడు.
మొదటిది, దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదం అయిన రక్షణను ఇస్తాడు. బైబిల్‌లో యోహాను 1:12వ వచనము ఇలాగున చెబుతుంది, " తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను'' ప్రకారము ఇది మనకందరికి ఎంతో విలువైన బహుమానము. ఇంకను రక్షకుడు (మత్తయి 1:21) అనే అర్థమున్న యేసు, మనలను పాపం నుండి విడిపించి మనకు నూతన జీవమును అనుగ్రహించియున్నాడు. రెండవది, ఆయన క్రీస్తులోని ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదములతో (ఎఫెసీయులకు 1:3) మనలను ఆశీర్వదిస్తాడు, అందులో పరిశుద్ధాత్మ వరములు కూడా కలవు (1 కొరింథీయులకు 12:8-10). ఈ వరాలు దేవునితో సంభాషించడాని కి, ఆయన జ్ఞానాన్ని బయలుపరచడానికి మరియు మన జీవితాలలో ఆయన అధికారమును వ్యక్తపరచడానికి మనకు శక్తినిస్తాయి. మూడవదిగా, దేవుడు మనకు జ్ఞానాన్ని మరియు తెలివిని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఇంకను బైబిల్ నుండి కొలొస్సయులకు 2:3వ వచనమును చూచినట్లయితే, క్రీస్తులో జ్ఞానం మరియు సర్వసంపదలన్నియు గుప్తములై ఉన్నాయని మరియు మనం ఆయనను అంగీకరించినప్పుడు, ఈ సంపదలు మన జీవితాలలోనికి కుమ్మరించబడతాయని ప్రకటించుబడుచున్నది.
అంతేకాకుండా, దేవుడు ఈ లోకంలో మనకు సంపదలు మరియు సదుపాయాలను అనుగ్రహిస్తాడు. బైబిల్ నుండి 2 కొరింథీయులకు 8:9 వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై యుండి యు మీరు తన దార్రిద్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను'' ప్రకారము దేవుడు మనం ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందాలని మన పట్ల కోరుకుంటున్నాడు, మన స్వలాభం కొరకు కాదు, కానీ మనం క్రీస్తులో సంతృప్తి చెంది ఇతరులకు ఔదార్యముగా ఉండాలని మన పట్ల కోరుకుంటున్నాడు. చివరిగా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు శక్తిని అనుగ్రహిస్తాడు (అపొస్తలుల కార్యములు 1:8; అపొస్తలుల కార్యములు 10:38). ఈ శక్తి శత్రువును జయించడానికి, అణచివేయబడిన వారిని బాగుచేయడానికి మరియు అద్భుతాల మార్గములో నడవడానికి మనకు వీలు కల్పిస్తుంది (మార్కు 16:17). యేసు మనలో నివసించినప్పుడు, మనం ఆశీర్వాదాలను ఆనందించడమే కాకుండా జీవితాలను మార్చడానికి ఆయన శక్తిని కూడా మోసుకెళ్తాము. యేసు నామంలో మీరు ఈ రక్షణ, ఆధ్యాత్మిక వరములు, జ్ఞానం, సంపదలు మరియు శక్తిని సమృద్ధితోను మరియు విడుదలతో ఆనందించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా కొరకు నీ కుమారుని అనుగ్రహించినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, యేసు ద్వారా, మేము ప్రతి ఆశీర్వాదాన్ని ఆనందించునట్లుగా, మా జీవితాన్ని రక్షణ ఆనందంతో నింపుము. దేవా, మా మీద ప్రతి ఆధ్యాత్మిక వరములను కుమ్మరించుము. దేవా, పై నుండి మాకు జ్ఞానం మరియు తెలివిని అనుగ్రహించుము. ప్రభువా, మా అవసరాలన్నింటిని తీర్చి మమ్మును ఉదారత్వము గలవారినిగా చేయుము. దేవా, పరిశుద్ధాత్మ ద్వారా నీ శక్తితో మమ్మును కప్పుము. ప్రభువా, అద్భుతాలు మరియు స్వస్థత మా ద్వారా ప్రవహించునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, మమ్మును ఇతరులకు ఆశీర్వాద ప్రవాహంగా మార్చుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.