నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 17:28 వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు'' ప్రకారం ప్రతి ఆలోచనకు, ప్రతి కార్యమునకు కావలసినటువంటి శక్తి ప్రభువు యొద్ద నుండి మాత్రమే లభిస్తుందని బైబిల్ చెబుతుంది. మనము నిజముగా ఆయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. ప్రతి ఆలోచన, ప్రతి కార్యము ఆయన యొద్ద నుండి కలుగుతుంది. ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, ఫిలిప్పీయులకు 2:13వ వచనమును చూచినట్లయితే, "ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే'' ప్రకారం మనము దేవుని సన్నిధానముతో నింపబడియున్నప్పుడు, మన స్వంతగా ఏది చేయడానికి ప్రభువు అనుమతించడు. బైబిల్ నుండి 2 కొరింథీయులకు 3:5వ వచనములో చూచినట్లయితే, "మా వలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది'' ప్రకారం మనము ఏమై యున్నామో అది కేవలము దేవుని కృప వలననై యున్నాము.

నా ప్రియులారా, దేవుడు తన మహా కృపల చేత మనకు ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు. మేము నిర్వహించబడిన ఒక కూటములో ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నేను ప్రార్థించుచున్నాను. నేను ప్రార్థించుచుండగా, మధ్యలో ప్రభువు నాకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. నేను ఆ ప్రత్యక్షతను గురించి చెప్పడానికి నేను చాలా వెనుకడుగు వేశాను. ఈ ప్రార్థన సమయములో ప్రజలు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నాడు కదా అని అనుకున్నాను. ఈ సమయములో ఈ అద్భుతమైన ప్రార్థనను ఆపివేయాలని అని అనుకున్నాను. అయితే, ప్రభువు ఆ ప్రవచనమును అనుగ్రహిస్తూనే ఉన్నాడు. 'ఇవాంజెలిన్ ఈ ప్రత్యక్షతను ప్రజలతో చెప్పు' అని ప్రభువు నాతో స్పష్టముగా మూడువ సారి చెప్పాడు. అప్పుడు నేను ప్రజలకు దానిని ఈలాగున గురించి తెలియజేశాను, "ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని గుండె చాలా తక్కువగా కొట్టుకొంటున్నది. ప్రభువు నిన్ను ఇప్పుడే తాకియున్నాడు. ప్రభువు నీ కను దృష్టిని స్వస్థపరచియున్నాడు'' అని చెప్పాను. ఆ ప్రార్థన అయిపోయిన అనంతరము, అదే వ్యక్తి వేదిక మీదికి పరుగెత్తుకొని వచ్చాడు. అతడు ఎంతో సంతోషముతో నేను స్వస్థపరచబడ్డాను అని పైకి క్రిందికి దూకుతూ, ఉత్సాహముతో దేవుని స్తుతించాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మన మర్మములను బయలుపరచడానికి మన హృదయాలను ప్రేరేపిస్తాడు. బైబిల్‌లో రోమీయులకు 8:14వ వచనములో చూచినట్లయితే, "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదు రో వారందరు దేవుని కుమారులై యుందురు'' అని చెప్పబడినట్లుగానే, ప్రియులారా, ప్రభువు నేడు మిమ్మును కూడా తన ఆత్మ చేత నడిపిస్తాడు. మీరు దేవుని బిడ్డలై యున్నారు. ప్రత్యక్షతలు ఇవ్వమని ప్రభువును వేడుకొనండి. ఆత్మలో మిమ్మును కదిలించమని ప్రభువును అడగండి. ఎఫెసీయులకు 2:10వ వచనములో చూచినట్లయితే, " మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము'' ప్రకారముగా మీరు దేవుని చేత సృష్ఠింపబడినవారై యున్నారు. కాబట్టి, ఈ విషయమును జ్ఞాపకముంచుకొని, మన పరుగు పందెములో అనుదినము కూడా ముందుకు పరుగెత్తాలి. బైబిల్‌లో 1 కొరింథీయులకు 9:24 వ వచనములో చూచినట్లయితే, " పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందు నట్లుగా పరుగెత్తుడి '' ప్రకారం మీ స్వంత రక్షణను కొనసాగించుకొనండి. భయముతో వణకుతోను, మీ స్వంత రక్షణను కొనసాగించండి. నేడు ఆయన యొద్ద నుండి బహుమానము పొందుకొను రీతిగా మీరు ముందుకు పరుగెత్తండి. అప్పుడు మీ హృదయాన్ని అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా ప్రభువు మిమ్మును ప్రేరేపిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీలో జీవించుటకును, చలించుటకును మరియు నీ సన్నిధిని కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రములు. దేవా, మా యొక్క ప్రతి కోరిక మరియు మేము చేయుచున్న ప్రతి కార్యము నీ నుండే రావాలి. ఎందుకంటే, మాలో పనిచేయునది నీవే. గనుకనే, దేవా, నీకు ఇష్టమైనది చేయడానికి మరియు నడుచుకోవడానికి నీ కృపను మాకిమ్ము. ప్రభువా, దయచేసి మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి, నీ ప్రియమైన బిడ్డగా నడిపించుము. దేవా, నీ స్వరాన్ని వినడానికి మరియు నీ పరిపూర్ణ మార్గాల్లో నడవడానికి మా హృదయాన్ని కదిలించుము. దేవా, మేము నీ చేతిపనిని, యేసులాగే మంచి పనులు చేయడానికి సృష్టించబడ్డామని నమ్ముచున్నాము. ప్రభువా, మా ముందుంచిన పందెములో ఓర్పుతో పరుగెత్తడానికి, ప్రతిరోజూ భక్తితో మా రక్షణను సాధించడానికి మరియు నీవు మా ముందు ఉంచిన బహుమతిని గెలుచుకోవడానికి ముందుకు సాగడానికి మాకు సహాయం చేయుము. తండ్రి, నిన్ను మా హృదయాలలో కలిగియుండి, మేము నీ మీదనే దృష్టిని ఉంచడానికి, పరుగు పందెములో మేము పరుగెత్తు కృపనిమ్ము. ప్రభువా, నీలో నివసించే శక్తిని మరియు నీలో మాత్రమే చలించే కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీ యొక్క సంపూర్ణ సన్నిధిలో మేము నీ యందు మాత్రమే ఉండగలిగే కృపనిమ్ము. యేసయ్యా, అపవాదికి సంబంధించిన, ఏదియు మమ్మును ఎంతమాత్రము తాకకుండా ఉండునట్లుగా సహాయము చేయుము. దేవా, శరీరాశలు మాలోనికి రాకుండా, నీ మధురమైన అద్భుతమైన సన్నిధానముతో మమ్మును నింపి, నూతనమైనవారినిగా మమ్మును మార్చుము. ప్రభువా, నూతన అభిషేకము, నూతన ప్రత్యక్షతను మాకు కలిగించునట్లు నీ ప్రత్యేకమైన ఆత చేత మమ్మును నింపుము. దేవా, విజయవంతులైన వారినిగా మమ్మును మార్చుమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.