నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 19:5వ వచనమును ప్రభువు మనకు వాగ్దానముగా ఇచ్చుచున్నాడు. ఆ వచనము, "కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు'' ప్రకారము మీరు దేవునికి చెందినవారుగా ఉండెదరు. అందుకే బైబిల్ నుండి యోహాను 14:15వ వచనములో చూచినట్లయితే, " మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు'' అని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవును, మనము ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మనము ఆయనకు స్వకీయ సంపాద్యముగా మార్చబడతాము. మనము దేవుని ప్రేమించుటలో ఎంత జాగ్రత్త వహించాలి కదా? కారణము, దేవుడు మనలను తన స్వకీయ జనముగా ఎంపిక చేసుకొనియున్నాడు. అప్పుడు మనము ఎంత పరిశుద్ధంగా జీవించాలి కదా! అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 6:20 వ వచనములో చూచినట్లయితే, "విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి'' అని చెప్పబడిన ప్రకారము మీ కొరకు యేసయ్య, ఆ సిలువలో తన ప్రాణమును త్యాగము చేసి, మిమ్మును వెలపెట్టి కొనియున్నాడు. యేసయ్య, రక్తము ద్వారా మీరు కొనబడియున్నారు. కనుకనే, మనము ఆయనకు విరోధముగా ఎలాగున పాపము చేయగలము? మనము ఆయన రక్తమును చులకనగా ఎలా త్రొక్కివేయగలము? మీరు దేవుని కొరకై ఎంపిక చేయబడిన జనమై యున్నారు. కనుకనే, మీరు సమస్త దేశ జనులలో దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉన్నారు, గనుకనే మీరు ధైర్యము వహించండి.
అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "సమస్త దేశముల జనులకంటె మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియులారా, ప్రభువు మనలను ఎన్నుకున్నప్పుడు, మన జీవితములలో ఆశీర్వాదములన్నిటిని కూడా మనకు ఎంపిక చేసి ఇస్తాడు.ప్రభువు మనలను ఎంపిక చేసినప్పుడు, మన జీవితములో మనకు రావలసిన దీవెనలను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి మనకు అనుగ్రహిస్తాడు. ఆలాగుననే, మా తండ్రిగారైన డా. డి.జి.యస్ దినకరన్‌గారితో ప్రభువు మాట్లాడి, కారుణ్య విశ్వవిద్యాలయ మును స్థాపించాలని ప్రభువు దర్శనములో చెప్పినప్పుడు, ఆ విశ్వవిద్యాలయమును ప్రారంభించడానికి ప్రభువే ఒక చక్కని స్థలమును ఎంపిక చేసి యున్నాడు. ఆలాగుననే, విశ్వవిద్యాలయము కొరకు కావలసిన స్థలమును వెదకుచూ, మా తండ్రిగారు ఎంతగానో తిరిగారు. అయితే, ఒకరోజు దర్శనములో అద్భుతమైన అందమైన ఒక స్థలమును దేవుడు కనుపరచియున్నాడు. ఆ ప్రదేశము చుట్టు కూడా పర్వతములుండెను. ఆ స్థలము చూడడానికి ఎంతో ఆహ్లాదకరముగాను, ఎంతో అందముగా ఉండెను. కానీ, మా తండ్రిగారు చూచిన ఆ స్థలము వెదకడానికి వెళ్లినప్పుడు, అటువంటి అద్భుతమైన స్థలమును ఎక్కడ కనుగొనలేపోయారు. అయితే, ప్రభువు దర్శనములో చూపించిన అదే స్థలమునకు ఒక దైవజనుడు మా తండ్రిగారిని తీసుకొనివెళ్లియున్నారు. ఆ స్థలము ఇప్పుడు కోయంబత్తూరులో ఉంటున్నటువంటి కారుణ్య విశ్వవిద్యాలయమై ఉన్నది. ఆ ప్రదేశము చుట్టూర కూడా పర్వతములు అద్భుతముగా ఉంటాయి. అది ఎంతో సారవంతమైనటువంటి స్థలముగా ఉన్నది. ఆ స్థలము చుట్టు అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణముగా ఉండియున్నది. నీటి సమస్య మరియు ఆహార సమస్య అక్కడ ఏ మాత్రము ఉండదు. అది ఎంతో దీవెనకరమైన ప్రదేశముగా ఉన్నది. ఆలాగుననే, ప్రభువు మనలను తన స్వకీయ సంపాద్యముగా అనుకొని, ఎంపిక చేసుకున్నప్పుడు, ఆయనే మన జీవితములోని ఆశీర్వాదములన్నిటి కూడా ఎంపిక చేసి మనకు ఇస్తాడు. నా ప్రియులారా, ఈ రోజు నిజంగా సమస్త దేశములలో ఉన్న వారికి కారుణ్య విశ్వవిద్యాలయము ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటున్నది. ప్రపంచము నలుమూలల నుండి విద్యార్థులు వచ్చి, అక్కడ చదువుకుంటూ ఉంటారు. యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు కూడా అది ఎంతో దీవెనకరముగా ఉన్నది.
అవును, నా ప్రియులారా, మనము ఎంత గొప్ప దేవునిని కలిగియున్నాము కదా! అటువంటి అద్భుతమైన స్థలములో విశ్వవిద్యాలయమును కలిగి ఉండడము ఎంత దీవెనకరము కదా! అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును కూడా ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు మీరు వేచియున్న దీవెనలు మీకు రావడములో ఆలస్యమగుచున్నట్లయితే, గనుక, ఆందోళన చెందకండి, కోపగించుకోకండి, ప్రభువు తన నిల్వ గృహములో అద్భుతములను మరియు మీకు రావలసిన ఆశీర్వాదములన్నిటిని మీ కొరకు దాచిపెట్టియున్నాడు. ప్రభువును మీరు ప్రేమించుచూ, ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే, ఆయన మంచితనము ఎంతో మీ యెడల కనపరచుచున్నది. మీ జీవితములో దేవుని ఆశీర్వాదములన్నిటిని మీరు అనుభవించుదురు గాక. నేటి వాగ్దానముగా ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క అద్భుతమైన ఆశీర్వాదములను ఇచ్చే ప్రేమగల దేవుని మేము కలిగియున్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ గొప్ప మంచితనానికి నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ బిడ్డలైన మా జీవితములో ఆశీర్వాదములను నీవు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి మాకు దయచేయము. ప్రభువా, మేము నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలను గైకొనుటకు మా జీవితాలను నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నీవు మా కొరకు దాచియుంచిన అద్భుతమైన ఆశీర్వాదములన్నిటిని మాకు దయచేయుము. యేసయ్య, నీ యందు మాకు సమస్త ఆశీర్వాదములు సమకూర్చబడునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, మేము వేచియున్న సమయమునకు ఈ రోజే మాకు అంతమును కలిగించుము. ప్రభువా, మాకు రావలసిన ఆశీర్వాదములన్నిటిని మేము పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము సమస్త దేశ జనముల కంటె నీకు స్వకీయ సంపాధ్యమగునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, మమ్మును నీ విలువైన సంపాద్యముగా ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. ప్రభువైన యేసు, నీవు మమ్మును క్రయధనము చెల్లించి కొనియున్నావు, మరియు మేము నీకు మాత్రమే చెందినవారము. దేవా, మేము నిన్ను గాఢంగా ప్రేమించడానికి మరియు నీ ఆజ్ఞలను పాటించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా హృదయాన్ని పరిశుద్ధంగాను ా మరియు నీ స్వరానికి మేము లోబడునట్లుగా కృపను దయచేయుము. దేవా, దయచేసి నీ పరిపూర్ణ సమయాన్ని విశ్వసించడం మాకు నేర్పించుము. ప్రభువా, మా నడుచుకొనుటకు మాకు నేర్పించుము. దేవా, మా జీవితంలోని ప్రతి ఆశీర్వాదాన్ని నీ చిత్తానికి అనుగుణంగా ఎంపిక చేసి మాకు అనుగ్రహించుము. దేవా, మమ్మును నీ హస్తములకు సంపూర్ణముగా సమర్పించుకొనుటకు కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


