నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనం ధ్యానించడానికి ఒక చక్కటి వచనమును దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. అందుకే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 16:5వ వచనములో కీర్తనాకారుడైన దావీదు ఇలాగున అంటున్నాడు, "యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు'' ప్రకారం అన్నిటికిని ఆయనే చాలిన దేవుడు. అవును, "నీవే, మా స్వాస్థ్యభాగమునకు ఆధారము'' అని చెప్పి దేవుడు తనకు ఇచ్చిన దానితో దావీదు ఎంతగానో సంతృప్తి చెందాడు. అవును, నా ప్రియులారా, మీరు కూడా, "దేవుడు మా స్వాస్థ్యభాగము'' అని చెప్పినప్పుడు, దేవుడు మీకు సమస్తమును మీకు అనుగ్రహించి, మిమ్మును సంతృప్తిపరుస్తాడు. అందుకే బైబిల్‌లో, కీర్తనలు 23:5వ వచనములో దావీదు మరల ఆ మాటలనే నమ్మకంగా ప్రకటించాడు, " నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది'' ప్రకారం మీ గిన్నె నిండి పొర్లునప్పుడు, మీరు, "ప్రభువా, చాలు, చాలు, చాలు. నీవు మమ్మును ఎంతగానో సమృద్ధిగా ఆశీర్వదించావు, అని అంటారు.''

మా మనవరాలు క్యాట్లిన్ అన్నా దినకరన్ ఒక చక్కటి పాట పాడేది: (ఇట్స్ బబ్లింగ్, ఇట్స్ బబ్లింగ్, ఇట్స్ బబ్లింగ్, ఇన్ మై సోల్. ఐ యామ్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్, సిన్స్ జీసస్ మేడ్ మీ హోల్'' ( అది నాలో పొంగుతుంది, అది ఉప్పొంగుతుంది, ఇది నా ఆత్మలో పొంగుతుంది. యేసు నన్ను రక్షించాడు, నేను ఆడి, పాడుతాను'' అనే ఆంగ్ల పాటను ఆమె బిగ్గరగా పాడుతుంది. మరియు ఆమె పాడినప్పుడు, ఇల్లు అంతయు ప్రతిధ్వనించేది! ఆమె ఎంతో ఆనందంతో, ఆమె ఆ పాటను పాడేది. అవును, మన గిన్నె దేవునితో నింపబడినప్పుడు మన జీవితాలలో కూడా అదే జరుగుతుంది.

బైబిల్‌లో, కీర్తనలు 16:9వ వచనము చూచినట్లయితే, దావీదు ఎంతో గొప్ప నమ్మకంతో ముందుకు కొనసాగుతూ, ఇలాగున అంటున్నాడు: " అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడ సురక్షితముగా నివసించుచున్నది'' అని చెప్పిబడినట్లుగానే, మన శరీరమంతా ఆనందముతో హర్షిస్తుంది. మన భౌతిక శరీరం కూడా దేవుని ఆశీర్వాదంతోను మరియు ఆనందముతో కూడా నింపబడి ఉంటుంది. ఎటువంటి అనారోగ్యం మనలో ఉండదు. మన హృదయాలు ఆనందిస్తాయి. అవును, నా ప్రియులారా, దేవుడు మన గిన్నె ఎల్లప్పుడూ తన ఆనందంతో నింపబడి ఉండాలని మన పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి, మనం ఇలాగున చెబుతూ ఉండాలి, "యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు'' మరియు మన జీవితములో మనకు శూన్యముగా అనిపించినప్పుడు, మనం ఇలాగున అడగాలి, "ప్రభువా, నా గిన్నె ఖాళీగా ఉన్నది. నన్ను నింపుము, ప్రభువా. నన్ను నీతో నింపుము'' అని చెప్పాలి. ఇంకను మన గిన్నెలో లోకానికి సంబంధించిన ఏదియు కూడా కనిపించకూడదు. ఆలాగుననే, దేవుడు ఆనందముతో మీ గిన్నెను తన సంతోషముతో నింపుతాడు. బైబిలు ఇలా చెబుతుంది, " నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు'' ప్రకారంగా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషములు నింపబడి యుంటాయి. కనుకనే, ఆ సంతోషమును దేవుడు నేడు మీకు ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు.

కానా అను ఊరిలో జరిగిన ఒక వివాహములో యేసు పాల్గొనెను. ఆ వివాహమునకు యేసు తల్లి ఆయన యొద్దకు వచ్చి, 'ద్రాక్షారసము లేదని' ఆయనతో చెప్పగా, యేసు-ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. పరిచారకులు ఆయన మాటలకు విధేయత చూపి వాటిని నీళ్లతో నింపినప్పుడు, ఆ నీరు మంచి ద్రాక్షారసముగా మారింది.

అవును, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును కూడా తన సన్నిధితో, తన బలంతో, తన జ్ఞానంతో, తన నడిపింపుతో నింపును గాక. అవును, ప్రభువు తన మంచితనంతో మిమ్మును తృప్తిపరచును గాక. ఇంకను, కీర్తనలు 16:7 లో, దావీదు ఇలాగున అంటున్నాడు, " నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది'' ప్రకారం, రాత్రి పూట కూడా, అతను దేవుని నుండి నడిపింపును పొందుకున్నాడు. ఆ విధంగా ప్రభువు అతని గిన్నెను పొంగిపొర్లునట్లుగా నింపాడు. ప్రభువుచేత నింపబడిన నిల్వ ఎప్పుడూ ఎండిపోదు. ఆయన 24 గంటలు మీ గిన్నెను నింపుతూనే ఉంటాడు. కాబట్టి, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. మీ ఆలోచనలను, మీ భావోద్వేగాలను, మీ శరీరాన్ని మరియు మీ చర్యలను నియంత్రించమని ఆయనను అడగండి. ఆయనతో ఇలా చెప్పండి, 'ప్రభువా, మా గత విజయాలన్నిటితో మేము అస్సలు సంతృప్తి చెందలేదు. ప్రభువా, మమ్మును నీ సన్నిధిలో నిత్యసంతోషములతో మమ్మును నింపుము,'' అని చెప్పినప్పుడు, నిశ్చయముగా దావీదును నింపినట్లుగా నేడు మీ జీవితాలను మరియు మీ హృదయాలను కూడా నింపుతాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, 2 కొరింథీయులకు 3:5 ప్రకారం, " మా వలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది'' అని చెప్పబడినట్లుగానే, మన యొక్క సామర్థ్యము, సంపాదన అంతయు దేవుని వలన కలిగినవి మాత్రమే. మన సొంత సామర్థ్యంతో మనం సంతృప్తి చెందలేము. మన సమృద్ధి ఆయన నుండే వస్తుంది. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడే, మీరు దేవుని సమృద్ధితో నింపబడాలని ప్రార్థించినప్పుడు, నిశ్చయముగా, ఆయన తన సమృద్ధితో మీ గిన్నె నిండి పొంగి పొర్లునట్లు చేసి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, నీవే మా భాగము, మా స్వాస్థ్యభాగము, మా పానీయ భాగముగా ఉన్నావు, కనుకనే, మమ్మును నీతో పానీయభాగముతోను, స్వాస్థ్య భాగముతోను నింపుము. దేవా, భౌతిక సంబంధమైన ఆనందముతో కాదు, నీ ఆనందముతో మా హృదయములను నింపుము. ప్రభువా, మా హృదయము నీ సన్నిధిలో సంతోషించునట్లుగాను మరియు ఎన్నడును అలసిపోకుండా, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషములను మాకు దయచేయుము. దేవా, గిన్నె పొంగిపొర్లునంత వరకు నీ ఆత్మను మాలో కుమ్మరించుము. ప్రభువా, నీ యొక్క జ్ఞానము, బలము మరియు మంచితనముతో మమ్మును సంతృప్తిపరచుము. దేవా, మా ఆలోచనలు, భావోద్వేగాలు మరియు మేము వేయుచున్న ప్రతి అడుగును మాకు ముందుగా నీవు వెళ్లి, మమ్మును నడిపించుము. ప్రభువా, మా శరీరం సురక్షితంగా నివసించునట్లుగాను, మా ఆత్మ నీ ఆనందంలో విశ్రాంతి పొందునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మమ్మును రాత్రింబగళ్లు నీ సన్నిధితో నూతన తైలముతో అభిషేకించి, మా గిన్నె నిండి పొంగిపొర్లునట్లుగా చేయుము. దేవా, మా సమృద్ధి నీ నుండే వస్తుంది, కనుకనే, దేవా, మా కొరతలన్నిటిని తొలగించి, మాలో నీవు సమృద్ధిని అనుగ్రహించి, మా జీవితాలను సంతృప్తిపరచుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.