నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 1:4వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, మీ జీవితములో ఈ రోజు ఏదైనా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ, అందులో చిక్కుకొనిపోయి ఉన్నారా? కొన్నిసార్లు అన్నియు చక్కగా ప్రణాళిక చేసుకుంటాము. కానీ, ఏదో ఒక విధముగా, ఆటంకములు ఎదురువుతుంటాయి. ఒక ఆటంకము కాదు కానీ, చాలానే ఎదురువుతాయి. మీరు అటువంటి పరిస్థితులలో ఉన్నారా? అయితే, ఈ రోజు ఈ వాగ్దానము మీ కొరకని మీ స్వంతము చేసుకొనండి. ఆ వాగ్దానము, "మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను'' అని చెప్పబడిన ప్రకారము మనలో సత్‌క్రియ నారంభించినవాడు దేవుడే గనుకనే, ఆయనే దానిని చివరి వరకు కొనసాగించి ముగిస్తాడు.

నా జీవితములో కూడా అనేక ఆటంకములు ఎదుర్కొన్నాను. నేను 9 మరియు 10వ తరగతిలో ఉన్నప్పుడే, నేను ఒక మంచి వైద్యురాలిని కావాలని ఒక గొప్ప ఆశ నాలో ఉండేది. నేను వైద్యురాలిని కావాలి అంటే, ఐదు సంవత్సరములు నేను ఎమ్‌బిబియస్ మరియు మూడు సంవత్సరములు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవాల్సి ఉంటుంది. అన్నియు నేను అనుకున్నట్లుగా జరిగియున్నట్లయితే, నేను 2020వ సంవత్సరముకల్లా అన్నియు ముగించుకోవలెను. అయితే, ఎనిమిది సంవత్సరములలో ముగించవలసినది, అనేకమైన ఆటంకముల తర్వాత, మరియు ఎన్నో విరామముల తర్వాత, పదన్నాలుగు సంవత్సరములు నేను నా చదువులను ముగించవలసి వచ్చినది. అనేకసార్లు, నేను "ప్రభువా, నన్ను ఎందుకు ఈ స్థలమునకు నడిపించావు, నేను ఇక్కడ చిక్కుకొనిపోయి ఉన్నాను '' అని అనుకొనేదానను. అటువంటి సమయములో, నాకు ఎప్పుడు కూడా ఈ వచనము ఆదరణ కలిగిస్తుంది.

ఆలాగుననే, నా యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరములో ఉన్నప్పుడు, ఇక అన్నియు కూడా ముగిసిపోతాయి అని అనుకున్నాను. అయితే, ఆకస్మాత్తుగా ప్రభువు మమ్ములను ఒక బిడ్డతో ఆశీర్వదించబోవుచున్నాడు అని తెలుసుకున్నాము. కాబట్టి, మరల ఒక పెద్ద విరామము నా చదువులలో ఏర్పడినది. నేను దీర్ఘకాలము విరామము తీసుకొని, మరల కళాశాలలో చేరాను. మా ప్రొఫెసర్లు అందరు నన్ను చూచి ఆశ్చర్యపడ్డారు, ' శిల్పా, నీవు మరల వచ్చావా? నీవు ఈ కోర్సును ఆపివేశావు అని మేము అనుకున్నామని చెప్పారు.' అయితే, నేను ఈ కోర్సును ముగించేంతవరకు ప్రభువు నన్ను నడిపిస్తాడు అని నేను నమ్మాను. ఆ సమయములో ప్రభువు నన్ను అనేకులకు సాక్ష్యముగా నిలువబెట్టుకున్నాడు. అంతమాత్రమే కాదు, నేను మా ప్రొఫెసర్లందరికి, 'ప్రభువు, నన్ను ఇంతవరకు నడిపించాడు, ఆలాగుననే, నన్ను అంతము వరకు కూడా నడిపిస్తాడు' అని చెప్పాను.

అవును, నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే, ఇంతవరకు మిమ్మును నడిపించిన దేవుడు అంతము వరకు మిమ్ములను కూడా నడిపించి, అనేకులకు సాక్ష్యముగా నిలువబెట్టుకుంటాడు. నేడు మీరు కూడా అటువంటి విధానములో ఉన్నారేమో? మీరు ముందుకు సాగిపోలేక, మీరున్న స్థలములోనే చిక్కుకొనిపోయి ఉన్నారేమో? లేక మీరు అనుకున్న రీతిగా పనులు జరుగకపోయినట్లయితే, అనేకమైన సందేహములు మరియు ఆటంకములు ఎదురవుచున్నట్లయితే, నా ప్రియులారా, మీ పట్ల సత్‌క్రియలు ప్రారంభించిన దేవుడు మిమ్ములను అంతము వరకు నడిపిస్తాడు అని జ్ఞాపకము ఉంచుకొనండి.

అదేవిధముగా, నా ప్రియులారా, ఈ రోజు మీ హృదయములో ఏదైనా ఒక ఆశ మరియు మీ భవిష్యత్తును గురించిన కలలు ఏవైన ఉన్నట్లయితే, అది ఎట్టి పరిస్థితులలో కూడా జరగడానికి సాధ్యపడలేదు అని మీరు భావించుచున్నట్లయితే, ఇప్పుడే ప్రభువు పాదాల చెంత మీ విన్నపములను మరియు ఆశలన్నిటిని సమర్పించినప్పుడు, అది దేవుని చిత్తమైతే, ఆయన అంతము వరకు మిమ్మును నడిపిస్తాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మన జీవితాలను మరొకసారి యేసయ్యకు సమర్పించుకుందాము. అనేకమైన ఇబ్బందులలో చిక్కుకొనిపోయి ఎటువెళ్లాలో తెలియని పరిస్థితులలో ఉన్నాము, తదుపరి ఏ అడుగు వేయాలో తెలియని పరిస్థితులలో ఉన్నారా? అవును, మీరు అటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే, ఇప్పుడే, యేసయ్యకు మీ జీవితములను సమర్పించండి. అనేకసార్లు పరిస్థితులను మన హస్తములలోనికి తీసుకోవాలని ప్రయత్నిస్తాము. కానీ, 'ప్రభువా, ఈ రోజు నీ హస్తములకు అన్నిటిని సమర్పించుచున్నాము' అని చెప్పండి. నా ప్రియ స్నేహితులారా, మీ పట్ల సత్‌క్రియలు ప్రారంభించిన దేవుడు నిశ్చయముగా అంతము వరకు ఆయన మిమ్మును నడిపిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపకలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీ బిడ్డలైన మా పట్ల నీవు కలిగియున్న అద్భుతమైన ప్రణాళికల కొరకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము అనేకమైన ఇబ్బందులలో చిక్కుకొనిపోయి ఎటువెళ్లాలో తెలియని పరిస్థితులలో ఉన్నాము, తదుపరి ఏ అడుగు ముందుకు వేయాలో మాకు తెలియడము లేదు, నీవు మేము వెళ్లవలసిన మార్గమును మాకు చూపుము. కనుకనే, ప్రభువా, ఈ రోజు, మా ప్రణాళికలను, కోరికలను, కలలను, మరియు భవిష్యత్తును నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, మా ప్రణాళికలను, కోరికలన్నియు నీ ఉద్దేశముల ప్రకారము మా జీవితములో అన్నిటిని నెరవేర్చుము. ప్రభువా, మేము ప్రణాళిక చేసుకున్నవన్నియు అనుకున్న సమయానికి జరగకపోయినప్పటికిని కూడా, ప్రభువా, అవి ముగిసే వరకు నీవు మమ్మును నడిపించుము. దేవా, ఎటువంటి సందేహములు మాలో ఉండకుండా, నీ పరిపూర్ణమైన సమయాన్ని విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క సంకల్పం ప్రకారం మేము ఎక్కడ ఎటువంటి అడుగు వేయాలో మమ్మును స్పష్టముగా మాకు తెలియజేయుము. దేవా, నీ వాక్యము ద్వారా నీవు మాతో స్పష్టంగా మాట్లాడి, మేము వేయవలసిన తదుపరి అడుగును వారికి చూపించుము. ప్రభువా, మా జీవితములలో నీవు ప్రారంభించిన సత్‌క్రియలను సంపూర్తి చేయుమని యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.