నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు మనకు బైబిల్ నుండి ఇవ్వబడిన వాగ్దానము జెకర్యా 8:12వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు'' అని సెలవిచ్చినట్లుగానే, ఈ వాగ్దాన వచనము ఎంత గొప్పదై యున్నది కదా! దేవుని బిడ్డలారా, ఇది పొందుకొనుట ఎంత ఆశీర్వాదకరము కదా! మనకు అంతయు దీవెనకరముగా ఉన్నట్లయితే, ఈ లోకములో మనకు ఇంక ఏమి కావాలి? దేవుని యొక్క ఈ గొప్ప ఆశీర్వాదములను మనము పొందుకోవాలంటే, మనము ఆయనను గట్టిగా పట్టుకొని, ఆయన దీవెనలను మనము పొందుకొనగలము. అందుకే బైబిల్ నుండి తీతుకు 3:14వ వచనములో చూచినట్లయితే, "మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమునుబట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను'' అని చెప్పబడినట్లుగానే, మనము నిష్ఫలులు కాకుండునట్లుగా సత్‌క్రియలను చేయుటకు నేర్చుకొనవలెనని ప్రభువు మన పట్ల వాంఛ కలిగియున్నాడు. కనుకనే, ఈ రోజు నుండి మనము సత్‌క్రియలు చేయుటకు నేర్చుకుందాము.

బైబిల్ నుండి యోహాను 15:5వ వచనములో చూచినట్లయితే, దేవుని దీవెనలు ఎలా పొందుకొనవలెనని చక్కగా వివరించబడియున్నది. ఈ వచనములో చూచినట్లయితే, "ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు'' అని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మనము ఫలించవలెననగా, మనము క్రీస్తుయందు నిలిచి ఉండవలెను.

అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 13:15వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, ఎల్లప్పుడును స్తుతియాగము చేయుటకు మనము నేర్చుకొనవలెను. ఇంకను బైబిల్ నుండి 2 కొరింథీయులకు 9:12వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది'' అని చెప్పబడిన ప్రకారముగా, మనము ఎల్లప్పుడు దేవునికి స్తుతులు చెల్లించవలెనని ప్రభువు మన కోరుచున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:16-20వ వచనములలో మనము చూచినట్లయితే, "మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను'' అని పౌలు భక్తుడు అంటున్నాడు. అతడు దేవుని ప్రజలకు కృతజ్ఞతలు చెల్లించడం మరియు వారి కొరకు ప్రార్థించడం ఎన్నడు కూడా మానలేదని పౌలు స్పష్టముగా మనకు తెలియజేయుచున్నాడు. వారు దేవుని మరింత లోతుగా గుర్తెరగడానికి మరియు ఆయన వారిని పిలిచిన నిరీక్షణను అర్థం చేసుకోవడానికి జ్ఞానం, ప్రత్యక్షత మరియు ఆత్మీయ అవగాహనను పొందుకోవాలనియు అతడు ఆ సంఘ ప్రజల కొరకు ప్రార్థించియున్నాడు. కనుకనే, మనము కూడా ఆలాగుననే, చేయుటకు నేర్చుకుందాము.

అవును, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు సేవకులారా, మన హృదయాంతరంగములో నుండి మనకు అనుగ్రహింపబడిన ప్రతి దీవెనను బట్టి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. అందుకే బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 5:18వ వచనములో మనము చూచినట్లయితే, "ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము'' అని చెప్పబడినట్లుగానే, మనము ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఆయన దీవెనను బట్టి, ఎల్లప్పుడు మనము ప్రభువును స్తుతించుట ద్వారా సమృద్ధియైన ఆశీర్వాదములను పొందుకుంటాము. మరియు మనము కృతజ్ఞతలు చెల్లించిన ప్రతిసారి దేవుని సమాధానము మరియు సంతోషము మనలను నింపుతుంది. కనుకనే, నా ప్రియులారా, మన జీవితములను దేవునికి సమర్పించుకుందాము. ఆయన యొద్ద నుండి పొందుకున్న విషయములను జ్ఞాపకము చేసుకుందాము. ఇప్పుడు కూడా దేవుని కృపను బట్టి, ఆయనకు వందనములు చెల్లించి ప్రార్థించుకుందాము. నా స్నేహితులారా, మన జీవితములను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుందాము. ఆయన మన కొరకు చేసిన వాటన్నిటిని జ్ఞాపకము చేసుకొని, ఆయన కనికరమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి, మనము ఆయనయందు నిలిచియుండి, ఎల్లప్పుడు ఆయనను స్తుతించినంత వరకు, ఆయన తన వాగ్దానం ప్రకారం మన జీవితాలను ఫలభరితంగా చేసి, సమృద్ధియైన జీవితమును మనకు అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమందున్న తండ్రీ, నీవు ఇదివరకే మాకిచ్చిన దీవెనలను బట్టి నీకు వందనములు. దేవా, నీ యొక్క మంచితనము మరియు నీ కృపను బట్టి నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా జీవితంలో మీరు దయతో కుమ్మరించిన ప్రతి ఆశీర్వాదానికి నీకు వందనములు. దేవా, ద్రాక్షవల్లి నీవు, తీగలైన మేము కొమ్మను అంటిపెట్టుకొని ఉన్నట్లుగా, మేము నీ మహిమ కొరకు ఎల్లప్పుడు ఫలించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, ప్రతి అవసరం కొరకు నిన్ను నమ్మడానికి మరియు మేము హృదయపూర్వకంగా ఎల్లప్పుడు నీకు కృతజ్ఞతా స్తుతులు అర్పించడానికి మాకు నేర్పించుము. దేవా, నీ యొక్క జ్ఞానము, సమాధానము మరియు ఆనందముతో మమ్మును నింపుము. ప్రభువా, మా జీవితం ఆధ్యాత్మికంగా, శారీరకంగా మరియు ఆర్థికంగా ప్రతి రంగంలో ఫలభరితంగా ఉండునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క మంచితనమును చూడటానికి మా కళ్ళను తెరువుము మరియు నీతో సన్నిహితంగా నడవడానికి మా విశ్వాసాన్ని బలపరచుము. ప్ర్రభువా, నీ యొక్క సమృద్ధియైన దీవెనలు మా జీవితంలో మరియు మా ద్వారా పొంగిపొర్లుచూ, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా చేయుము. దేవా, ఇప్పుడు కూడా మాకు నీ యొక్క ఆశీర్వాదముల కొరకు వేడుకొనుచున్నాము. దేవా, మా అవసరతలన్నిటిని తీర్చి, సమృద్ధియైన దీవెనలను మా మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.