నా ప్రియ సహోదరీ, సహోదరులారా, ఈ రోజు మీతో మాట్లాడడము నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:19వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను'' అని ఈ వచనములో దావీదు ఎలుగెత్తి చెబుతున్నాడు. దావీదు ఆలాగున ఎందుకు చెబుతున్నాడు? ముందు వచనాలలో చెప్పబడిన రీతిగానే, దావీదుకు బలమైన శత్రువులు ఉన్నారు. ఎంతోమంది అతనిని ద్వేషించారు. వారు అతనికంటె ఎంతో బలిష్టులు అని చెబుతున్నాడు. బైబిల్ నుండి కీర్తనలు 18:20వ వచనములో చూచినట్లయితే, " నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను'' ప్రకారం ప్రభువు దావీదు యందు ఇష్టము కలిగియుండెను గనుకనే, అతనిని తప్పించాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడై యుండెను. కనుకనే, దేవుడు అతనిని హెచ్చించెను.

ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 37:23వ వచనములో చూచినట్లయితే, "ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును'' ప్రకారం అవును, మనము ఎప్పుడైతే, యథార్థమైన జీవితమును కలిగియుంటామో, ప్రభువు మనలను తప్పించడానికి ఇష్టపడతాడు. అందుకే కీర్తనలు 18:36వ వచనములో చూచినట్లయితే, "నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు'' అని దావీదు అంటున్నాడు. అవును, నీతిమంతులు అడుగులు యెహోవా చేత నిర్దేషించబడతాయి. ఒక నీతిమంతుడు ఎన్నడు కూడా క్రింద పడిపోడు. దావీదు తన శత్రువు రాజైన సౌలు నుండి 10 సంవత్సరములకు పైగా తప్పించుకొని దాగుకొని తిరుగుచుండెను. ఆ సమయములో దావీదు అరణ్యములో నివసించాడు. కానీ, అరణ్యములో నుండి ఆ కష్టతరమైన జీవనము నుండి ప్రభువు అతనిని తప్పించి, రక్షించాడు. తన శత్రువులందరి నుండి ప్రభువే అతనిని తప్పించియున్నాడు. "ప్రభువు నన్ను తప్పించి, విశాలమైన స్థలమునకు నన్ను నడిపించాడు'' అని దావీదు అంటున్నాడు. విశాసలమైన స్థలము అనగా, స్వేచ్ఛ, స్వాతంత్య్రము గల ఒక స్థలము. ప్రభువు దావీదునకు స్వాతంత్య్రము నిచ్చి, ఇక ఎన్నడు కీడులో ఉండనివ్వలేదు.

నా ప్రియులారా, మనము కూడా దేవుని యొక్క స్వాతంత్య్రమును అనుభవించునట్లుగా ఆయన తన ఆత్మను మనకు ఇచ్చియున్నాడు. బైబిల్‌లో 2 కొరింథీయులకు 3:17వ వచనములో చూచినట్లయితే, "ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాత్రంత్యము నుండును'' ప్రకారం ప్రభువు ఆత్మచేత మనము నింపబడినప్పుడు, ఆత్మీయ జీవితమును మనము అనుభవించునట్లుగా ఆయన మనలను విశాలమైన స్థలములోనికి నడిపిస్తాడు. బైబిల్‌లో ఎఫెసీయులకు 2:7వ వచనమును చూచినట్లయితే, "క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను'' ప్రకారం క్రీస్తు యేసునందు మనము కలిగియున్న విశాలమైన స్థలము ఇదియే. ఘనతతో కూడిన స్థలము అది. పరలోక స్థలములందు క్రీస్తు కూడా కూర్చుండబెట్టి, ప్రభువు మనలను ఎంతగా ఘనపరచుచున్నాడు కదా. దేవుని ఆత్మ మనతో మరియు మనలో ఉన్నప్పుడు, మనము నిశ్చయముగా ప్రతిఫలమును పొందుకుంటాము. క్రీస్తుతో కూడా జీవించునట్లుగా విశాలమైన స్థలములోనికి ప్రభువు మనలను నడిపిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, మీ యందున్న క్రీస్తును, అనుభూతి చెందండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు దావీదును విశాలమైన స్థలమునకు తీసుకొని వచ్చినట్లుగానే, దయచేసి నీవు మా కొరకు సిద్ధపరచిన విశాలమైన స్థలమునకు మమ్మును కూడా తీసుకొని రమ్ము. దేవా, నీ ఆనందం ఎల్లప్పుడు మాలో ఉండునట్లుగాను మరియు పరిశుద్ధమైన చేతులతో మరియు యథార్ధమైన హృదయంతో నీతిగా నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా ప్రతి అడుగును నీవు నడిపిస్తావనియు మరియు మా పాదాలను ఎన్నటికిని తొట్రిల్లనియ్యవని నమ్ముచున్నాము. దేవా, దావీదు వలె మా శత్రువులు అనేకులు మమ్మును ద్వేషించుచున్నారు, కనుకనే మేము ఎక్కడికి వెళ్లగలము? ప్రభువా, దావీదును నడిపించినట్లుగానే, నేడు విశాల స్థలములోనికి మమ్మును కూడా నడిపించుము. యేసయ్యా, నీతో కూడా పరలోక స్థలములయందు కూర్చుండబెట్టుము. ప్రభువైన యేసయ్యా, ఈ సందేశాన్ని చదువుచున్న మాపైకి నీ ఆత్మ దిగివచ్చునట్లుగాను, నీ ఆత్మ చేత మమ్మును కొలతలేనంతగా, నీ అభిషేకముతో మమ్మును నింపుము. ప్రభువా, శత్రువు భయమును మా నుండి తొలగించి, భవిష్యత్తును గురించిన భయమును మాలో నుండి తీసివేసి, మా శత్రువుల నుండి తప్పించి, మమ్మును బయటకు తీసుకొనిరమ్ము. దేవా, మమ్మును అణిచివేయాలని ప్రయత్నించుచున్న ప్రతి దుష్ట శక్తులన్నిటిని మా యొద్ద నుండి పారద్రోలుము. ప్రభువా, మా జీవితములో నుండి దుష్ట శక్తులన్నిటిని తొలగించి, ఘనతతో కూడిన స్థలములో క్రీస్తుతో కూడా మమ్మును కూర్చుండబెట్టుమని యేసుక్రీస్తు ఘనత గల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.