నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 41:15వ వచనమును మనము ఈ రోజు ధ్యానించుకుందాము. ఆ వచనము, "కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను'' ప్రకారం ప్రియులారా, నురిపిడి మ్రాను అంటే ఏమిటి అని ఆశ్చర్యపోవుచున్నారా? ధాన్యమును గడ్డి మరియు పొట్టు వంటి ఇతర మాలిన్యముల నుండి వేరుపరచడానికై, ఆ రోజులలో నురిపిడి మ్రాను అను పరికరమును ఉపయోగించేవారు. మాలిన్యములన్నిటిని తొలగించి వేసి, ధాన్యమును మరొక వైపు పంపించేందుకు అది ఎంతో పదునుగా ఉండేది.

కాబట్టి, నా ప్రియులారా, ఇప్పుడు అటువంటి "కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను చేస్తానని'' ప్రభువు అంటున్నాడు. మరి మాలిన్యములన్నిటిని తొలగించే అంత పదునుగా మిమ్మును నియమించుచున్నాడు. అయితే, మన జీవితాలలో మాలిన్యములు ఏమిటి? శోధింపజేసే కొన్ని నిర్ణయాలు అయి ఉండవచ్చును. మనము చేయబోయే పాపాలు తప్పులు కావచ్చును. మనలను ఎంతో శోధించే పాపము కావచ్చును. ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశలు కావచ్చును. మనలో ఉన్నట్టువంటి ఆ యొక్క విషయాలన్నిటిని ఈ నురిపిడి మ్రాను మంచిని మరియు చెడు నుండి మనలను వేరు పరుస్తుంది. ఇంకను పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు మన జీవితములో ఉన్నటువంటి మాలిన్యములన్నిటిని తొలగించేందుకు ప్రభువు మనకు సహాయము చేస్తాడు. పరిపూర్ణంగా పవిత్రమైన పరిశుద్ధ జీవితమును మనము కలిగి ఉండగలుగుతాము. ఈ లోకములో ఉన్నటువంటి పాపములు, శరీరాశలు, లోకాశలు, అన్నిటి నుండి కూడా దూరముగా ఉండగలుగుతాము. పరిశుద్ధ పవిత్ర జీవితాన్ని మనము కలిగి ఉంటాము.

నా ప్రియులారా, ఈ రోజు కూడా ప్రభువు మిమ్మును పదును పరుచుచున్నాడు. ఒక కత్తి మొద్దుబారినప్పుడు, మనము ఉపయోగించము కదా! దానిచేత దేనిని కూడా కోయలేము. ఏ విధంగాను అది మనకు ఉపయోగపడదు. అది ఒక మంచి ప్రతిఫలమును ఇవ్వలేదు. ఒక కత్తి పదునుగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేనినైనను కోసి కూడా వేరుపరచగలుగుతాము. మంచిగా కోయగలుగుతాము. అదేవిధముగా నా ప్రియులారా, ఈ రోజు మిమ్మును పదును చేయుచున్నాడు. మంచి నుండి చెడునంతటిని వేరుపరచగలుగుతాడు. ఒక పరిపూర్ణమైన పవిత్రమైన జీవితమును కలిగి ఉంటారు. ఈ రోజు ఈ దీవెనను మీరు పొందుకుంటారా? ఆలాగైతే, నేడు మీ జీవితాలు పదును చేయగల నురిపిడి మ్రానుగా ఉండునట్లుగా మన దేవుని హస్తాలకు అప్పగించినట్లయితే, ఆయన మీలో ఉన్న మాలిన్యమును తొలగించి, మిమ్మును క్రొత్తదైన నురిపిడి మ్రానుగా చేసి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మమ్మును నురిపిడి మ్రానుగా చేయుచున్నందుకై మరియు మా జీవితములోనికి మాలిన్యములన్నిటిని తొలగించుచున్నందుకై, మమ్మును శుభ్రపరచుచున్నందుకై, మమ్మును బాగుచేయుచున్నందుకై, పదును పరచుచున్నందుకై, మమ్మును కేంద్రీకరింపజేయుచున్నందుకై మరియు మమ్మును నీ చేతులలో ఉపయోగకరమైన సాధనంగా చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, మాకున్న చెడు స్నేహాలు, సహవాసాలు, బంధాలన్నిటిని తొలగింపజేయుము. దేవా, మాలో ఉన్న లోకాశలన్నిటిని తొలగింపజేసి, నీకు సమీపముగా నీ యొద్దకు రాకుండా చేయువాటన్నిటిని మా నుండి తొలగించుము. ప్రభువా, పరిపూర్ణమైన ధాన్యముగా మేము బయటకు వచ్చునట్లుగా కృపను దయచేయుము. శుద్ధమైన పవిత్రముగాను, పూర్ణతను కలిగి నీ మంచితనమునకు సాక్షులముగా, మా చుట్టు ఉన్నవారికి దీవెనకరముగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, ఈ రోజు మమ్మును దీవించి, ఈ రోజు మంచి మేలులను చేయుటకు మమ్మును బలపరచుము. ప్రభువా, ఈ రోజు, మమ్మును నీ ప్రేమగల చేతులలోనికి అప్పగించుకొనుచున్నాము, మమ్మును పదును పెట్టి, ఒక ఆకారములోనికి వచ్చునట్లుగా సహాయము చేయుము మరియు మమ్మును శక్తివంతమైన, నీ పరిశుద్ధాత్మతో నిండిన నురిపిడి మ్రానుగా చేయుము. దేవా, దయచేసి మా జీవితంలోని ప్రతి కల్మషాన్ని నరికి వేసి, నిన్ను సంతోషపరచే పవిత్ర జీవితాన్ని గడపడానికి, యథార్థతతో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, నడిపించుము. దేవా, నీవు మా కొరకు సిద్ధపరచిన సంపూర్ణత మరియు ఆనందంలో నడుచుకొనుటకు కృపను దయచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.