నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 8:18వ వచనము, "ఇదిగో, నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండ మీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము'' ప్రకారం ఇది ఎంతటి మహిమాన్వితమైన సత్యం! దేవుడు మనలను సాధారణ జీవితమును గడపడానికి పిలువలేదు, కానీ ఆయన మహిమ కొరకు సూచనలుగా మరియు మహత్కార్యములుగాను ప్రకాశించుట కొరకు మనము పిలువబడియున్నాము. బైబిల్‌లో యెహోషువ 24:15వ వచనములో చూచినట్లయితే, " యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము '' అని యెహోషువ ప్రకటించెను. కనుకనే, ప్రతి కుటుంబం చేయవలసిన సమర్పణ ఇదియే. ఒక కుటుంబంగా ప్రభువును సేవించడం మనం విడిచిపెట్టకూడని ఒక గొప్ప భాగ్యముగా యెంచవలెను. నేడు మీరు మీ కుటుంబము పట్ల ఈ నిర్ణయం తీసుకొనియున్నారా? కనుకనే, స్నేహితులారా, నేటి నుండి మీ పిల్లలతోను, మీరు కుటుంబముగా కలిసి నిలువబడి, మేము ప్రభువును సేవిస్తాము అని చెప్పి, ప్రతి ఒక్క కుటుంబం దేవునికి తమను తాము అప్పగించుకున్నప్పుడు, అది దాచబడని ఒక గొప్ప సాక్ష్యంగా మారుతుంది.
ప్రభువు నన్ను ఎలా పిలిచాడో నాకు గుర్తుంది. నేను మా కుటుంబంలో చిన్నదానను. మా ఇంట్లో అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండేవారు, కానీ నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నేను సరదాగా, నిర్లక్ష్యంగా ఉంటాను, ప్రభువును గురించి ఎటువంటి తలంపులు నాలో ఉండవు. అయినప్పటికిని, తన గొప్ప కృపతో, ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన నన్ను తన బిడ్డగా మార్చాడు, నన్ను తన మందలోనికి తీసుకువచ్చాడు మరియు ఆయన తగిన కాలంలో, దేవుని శక్తివంతమైన సేవకులైన నా భర్తతో నన్ను ఐక్యపరచాడు. కలిసి, మేము ప్రభువును సేవించాము మరియు నా జీవితం సంపూర్ణంగా రూపాంతరపరచబడినది. ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలను, "ఇదిగో, నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండ మీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.'' ఇది నా బలం కాదు, దేవుని కృప ద్వారా కలిగిన గొప్ప కార్యము. ఆయన నా జీవితములో ఏమి జరిగించాడో, మీ జీవితములో అదే కార్యమును చేయగలడు. ఆయన మీ ఇంటిని, మీ పిల్లలను మరియు మీ భవిష్యత్తును తన శక్తికి మరియు మహిమకు సాక్ష్యంగా మార్చగలడు.
దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రతి కుటుంబం శ్రమలు, దుఃఖాలు మరియు శోధనలను, అప్పుల బాధలను ఎదుర్కొంటుండవచ్చును. కానీ, దేవుని వాక్యం నుండి కీర్తనలు 91:1-2వ వచనములలో ఇలాగున చెబుతుంది: " మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.'' అవును, ఇంతటి గొప్ప ఆశీర్వాదానికి రహస్యం ఏమిటంటే, ప్రతిరోజు ఆయన సన్నిధిలో నివసించడమే. ప్రార్థన మరియు ఆరాధనలో ప్రభువుకు దగ్గరగా ఉండండి, ఆయన మీ కుటుంబాన్ని రక్షించి, పైకి లేవనెత్తుతాడు. మీరు కుటుంబముగా ఒక్కటిగా కలిసి, పాటలు పాడి, దేవుని మహిమపరచినప్పుడు ఆయన ఆత్మ మీ ఇంటిని సమాధానముతో నింపుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీ హృదయాన్ని దేవుని వైపునకు తెరవండి. మీ కుటుంబాన్ని యేసుకు అప్పగించండి. అప్పుడు ఆయన తన కృపతో మిమ్మల్ని కప్పుతాడు, ఈ తరం వారి మధ్య సూచనలుగాను, మహత్కార్యములుగాను మిమ్మల్ని ప్రకాశించునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమంద్ను తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా,ఈ రోజు నీ వాక్యం అనే గొప్ప బహుమానమునకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మమ్మును మరియు మా పిల్లలను నీ బిడ్డలనుగాను మరియు సూచనలుగాను, మహత్కార్యములుగాను జీవించడానికి పిలిచినందుకు నీకు వందనాలు. దేవా, నిన్ను సేవించడానికి ఎంచుకున్న మా కుటుంబాన్ని ఆశీర్వదించుము. సర్వశక్తిమంతుడవైన ప్రభువా, నీ సన్నిధి నీడలో మా కుటుంబాన్ని మరియు మమ్మును భద్రపరచి, నీ కృపతో మమ్మును కప్పి కాపాడుము. యేసయ్యా, నీ సన్నిధి ద్వారా మా గృహములో సమాధానము, ఐక్యత మరియు ఆనందాన్ని దయచేయుము. దేవా, నీవు మమ్మును మార్చినట్లుగానే, నీ పరిశుద్ధాత్మ శక్తితో మా కుటుంబాన్ని కూడా మార్చుము. ప్రభువా, మా కుటుంబం కలిసి నీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయుము. దేవా, ఈ తరంలో మా కుటుంబం నీ మహిమ కొరకు ప్రకాశించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత విలువైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.