నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి నహూము 1:7వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము...'' ప్రకారం మన ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అవును, ప్రియులారా, ఆశ్రయ దుర్గము అనగా, అర్థమేమిటి? భద్రతను కలిగియుండే ఒక చోటు లేక స్థలము అని అర్థము. సాధారణంగా, వరద ముప్పులు లేదా ప్రకృతి వైపరీత్యాలు కలుగబోవుచున్నప్పుడు, ప్రభుత్వము మనలను క్షేమముగా ఉండే స్థలములకు వెళ్లమని హెచ్చరికలను జారి చేస్తారు. యుద్ధాలు తరుచుగా జరుగుచున్న స్థలాలలోను, బాంబు సెల్టర్ అను స్థలములను ఏర్పాటు చేస్తారు. ఇనుముతో చేయబడియున్న ఇనుప ద్వారములు కలిగియుండు అది ఒక చిన్న గది. భూమిలో అది దాచబడి ఉంటుంది. లేదా ఏదైనా భవనములో భద్రముగా ఉంటుంది. ఏదైనా అపాయము వారికి ఎదురైనప్పుడు, ప్రజలు పరుగెత్తుకొని వెళ్లి, అందులో ఆశ్రయమును పొందుకుంటారు. అదేవిధముగా, నా ప్రియులారా, నేడు మనము కూడా సురక్షితముగా ఉండడాని ప్రభువు మనకు ఆశ్రయ దుర్గమై యున్నాడని బైబిల్ గ్రంథము తెలియజేయుచున్నది. కనుకనే, మీరు భయపడకండి.

బైబిల్‌లో ఆదికాండము 6వ అధ్యాయంలో, రాబోయే జలప్రళయం గురించి దేవుడు నోవహును ఎలా హెచ్చరించాడో మనం చూడగలము. సురక్షితంగా ఉండటానికి దేవుడు ఒక ఓడను నిర్మించమని అతనికి ఆజ్ఞాపించాడు. భూమిని తుడిచివేయడానికై వరదలు పంపించబోవుచున్నాను అని నోవహుతో ప్రభువు సెలవిచ్చినప్పుడు, ఆ వరదల సమయములో ప్రజలు క్షేమముగా ఉండడాని కొరకై నోవహుతో ఒక పెద్ద ఓడను నిర్మించమని చెప్పాడు. అటువంటి పరిస్థితులలో, నోవహు అక్కడ ఉన్న ప్రజలతో, వారి చెడుతనమును విడిచిపెట్టి, ఆ ఓడలోనికి ప్రవేశించమని వారిని హెచ్చరించాడు. కానీ, ఎవ్వరు అతని మాట వినలేదు. అతడు పిచ్చివాడు అని అన్నారు. ఎందుకనగా, వరద రావడాన్ని వారు ఎవ్వరు కూడా చూడలేదు. వారు వర్షమును కూడా చూడలేదు. కాబట్టి, వారు అతనిని చూచి నవ్వుకున్నారు. వారు అతనిని చూచి మరియు అతడు చెప్పినది నమ్మలేదు. అయితే, వరదలు వచ్చినప్పుడు, నోవహు అతని కుటుంబము ఎంతో భద్రముగా ఉన్నారు. ఎందుకనగా, వారు దేవుని మాట విని, ఆయనను నమ్మియున్నారు. వారు అతని మాటలకు లోబడ్డారు. ఇంకను నోవహు ప్రభువుతో నమ్మకముగా నడిచాడు. అందుకే, ప్రభువు అతనిని ఎన్నుకున్నాడు. అతనిని ఓడలో భద్రపరచాడు.

అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, ఏదైన ఉపద్రవము మీ జీవితములో వస్తున్నప్పుడు, ఏదైన మీ మీద దాడి చేయుచున్నప్పుడు లేదా మీరు కష్టములో ఉన్నప్పుడు, యేసు నొద్దకు పరుగెత్తండి. ఆయనే మీకు ఆశ్రయ దుర్గము. అనేకసార్లు మానవులముగా, 'ఈ మనిషి నాకు సహాయము చేస్తాడు, ఈ వ్యక్తి నన్ను బయటకు తీసుకొని వస్తాడు, ఇతను నాకు తోడ్పడుతాడు అని అనుకుంటాము.' అయితే, ప్రజల యొద్దకు వెళ్లమని మన మనస్సు మనలను ప్రేరేపిస్తుంది. కానీ, క్లిష్టమైన పరిస్థితులలో, మొదటగా మనము ప్రభువు యొద్దకు మాత్రమే వెళ్లాలి. ఆయనే మనకు సురక్షితమైన ఒక స్థలము. ఆయనే మనకు ఆశ్రయము, మన ఆశ్రయ దుర్గము ఆయనే, కనుకనే, ఆయన మనలను సురక్షితముగా ఉంచుతాడు. సరైన సమయములలో తగిన ప్రజలను మన సహాయము కొరకు ఆయన మన యొద్దకు వారిని తీసుకొని వస్తాడు. ప్రభువే మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 46:1వ వచనములో వ్రాయబడి ఉన్నట్లుగానే, "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' అన్న వచనం ప్రకారం ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అవును, ప్రియ స్నేహితులారా, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఈ రోజు ఆయన సజీవుడు, ఆయన మనకు ఆశ్రయ దుర్గము. ఆయన యొద్దకు మనము పరుగెత్తుకొని వచ్చి, భద్రముగా ఉందాము. ఎందుకనగా, 'ప్రభువే మనకు బలమైన కోటగా ఉన్నాడనియు మరియు నీతిమంతులు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉందురు' అని బైబిల్ గ్రంధము స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి, మీరు ఇప్పుడే ప్రభువు యొద్దకు పరుగెత్తండి. మీరు సురక్షితముగాను మరియు భద్రముగా ఉంటారు. ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి, ఆయనకు వందనాలు చెల్లించి, ప్రార్థిద్దాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపా కనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, మేము కష్టాలలో ఉన్నాము, అనారోగ్యముతోను, కోర్టుకేసులో ఇరుక్కపోయి ఉన్నాము, మా ఉద్యోగములో పై అధికారుల యొద్ద మాకు మంచి పేరు లేదు, ప్రజలు మాకు వ్యతిరేకముగా ఉన్నారు. కనుకనే, దేవా, నీవే మాకు ఆశ్రయముగా ఉండి, ఈ రోజు నీవు మాకొక మార్గమును దయచేయుము. దేవా, మేము నిన్ను గట్టిగా పట్టుకొని ఉన్నాము. కనుకనే, మా కష్టములన్నిటి నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, అపత్కాలములో నీవు మాకు ఆశ్రయముగా ఉండి, మా ఆపదల నుండి మమ్మును తప్పించి, సురక్షితముగా మేము, నీలో దాగి ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రియమైన ప్రభువా, ప్రతి తుఫానులోనూ నీవే మాకు ఆశ్రయం. దేవా, భయం మమ్మును ఆవరించినప్పుడు, నీవే మాకు సమాధానము మరియు భద్రత. దేవా, కష్టాలలో, నీవే మా ఆదరణ మరియు దుర్గముగా ఉన్నావు. ప్రభువా, మా కార్యములన్నియు విఫలమైనప్పుడు నీవే మాకు ఆశ్రయం. ప్రభువా, మొదట నీ దగ్గరకు పరిగెత్తడానికి మాకు సహాయం చేయుము, చివరిగా కాదు. యేసయ్య, నీ స్వరాన్ని పాటించడానికి నోవహు కలిగియున్న విశ్వాసాన్ని నేడు మాకును అనుహ్రించుము. దేవా, మా యొక్క ప్రతి శోధనలోనూ మమ్మును కాపాడి, రక్షించి, మమ్మును నడిపించుము. ప్రభువా, నీ ప్రేమ యొక్క భద్రతలో మేము సురక్షితముగా నివసించునట్లుగా చేయుము. దేవా, నీవే, మా బలమైన కోట, మా దాగు చోటు నీవే. దేవా, మేము సంపూర్ణంగాను ఇప్పుడు మరియు ఎల్లప్పుడు నిన్ను నమ్ముకొనియున్నాము. దేవా, మా ఆపత్కాలములో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు మా పట్ల ఉండి, మమ్మును భద్రపరచుమని యేసుక్రీస్తు సాటిలేని నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.