నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు పంటను కోయు దినము. దేవుడు మన నిమిత్తము మీ కొరకు దాచియుంచిన అత్యుత్తమ ఆశీర్వాదాన్ని మీరు పొందబోవుచున్నారు. అందుకే నేటి వాగ్దానముగా సామెతలు 11:18 చూడండి. బైబిల్ ఇలాగున చెబుతుంది, "భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును'' ప్రకారం మనము నీతిని నిత్యము విత్తాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. ఆలాగుననే, ఒక వ్యక్తి ఎప్పుడూ తిరుగుతూ, ప్రజలతో మాట్లాడుతూ, కార్యాలయములో తన పని సక్రమంగా చేయకుండా ఉండేవాడు. ఎప్పుడు ప్రజలు చుట్టు తిరుగుతూ ఖాళీగా ఉండేవాడు. కానీ, తన యజమానుని ముందు మాత్రము, అతను తన పని తాను చక్కగా చేయుచున్నట్లు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు, అదే కార్యాలయములో, తన సొంత పనిని జాగ్రత్తగా చూసుకుంటూ, చాలా కష్టపడి పనిచేయుచున్న మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ, మొదటి వ్యక్తి తన యజమానునితో అన్ని రకాల చెడు విషయాలను మరియు తప్పుడు నివేదికలను మాట్లాడుతూనే ఉంటాడు. దాని ఫలితంగా, ఆ యజమాని మంచి ఉద్యోగిని గురించి తన మనస్సులో చెడు అవగాహనను పెంచుకున్నాడు.
ఆ కార్యాలయములో ఎన్నో విషయాలను గురించి నిత్యము ఫిర్యాదు చేయుచూ, ఈ మోసగాడు అన్ని మంచి పనులు చేయుచున్నది తానేనని ఆ యజమానిని నమ్మించాడు. కాబట్టి, ఆ యజమాని అతనికి ఎక్కువ జీతాలు మరియు ఉన్నత పదవిని ఇవ్వడము జరిగింది. అతను ఆ యజమానునితో సన్నిహితంగా ఉండేవాడు మరియు ఇతరుల పనిని కూడా తాను చేసిన పనిగా చూపించేవాడు. ఆలాగుననే ఆ యజమానుని హృదయమును ఆకట్టుకుని, ఆ యజమాని చాలా మంచి అభిప్రాయముతో అతనిని ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. అయితే, చివరికి అతడు చేయుచున్న చెడు పనులన్నియు కూడా, ఈ యజమాన్యము చేయలేకపోయాడు. ఎందుకంటే, చాలా అబద్దాలు ఉండెను. కానీ, నిజం ఎల్లప్పుడూ బయటపడే మార్గాన్ని కనుగొంటుంది. అతను ఆ అబద్ధాలన్నింటిని ఎంతో కాలము నిలబెట్టుకోలేకపోయాడు. ఒకటి వెంబడి ఒకటి వెలుగులోనికి వచ్చింది మరియు తీరా విచారించినప్పుడు, అతని యొక్క అన్ని ప్రతికూల నివేదికలు మరియు దుష్ట చర్యలను కనుగొన్నాడు. అతని మీద ఆ యజమాని ఎంతో ఆగ్రహముతో ఉండెను. కనుకనే, అతన్ని అక్కడికక్కడే వెంటనే ఉద్యోగములో నుండి తొలగించాడు. అప్పుడు, మౌనంగా ఉండి, కష్టపడి పనిచేసిన వ్యక్తి ఇంతకాలం నిజాయితీగా ఉన్నాడని ఆ యజమాని గ్రహించాడు. వెంటనే, ఆ యజమాని అతనికి అదే స్థానం మరియు జీతం ఇచ్చాడు; తక్షణమే, అతను ఉన్నత స్థాయికి ఎదిగాడు. వెంటనే అతనికి ఔనత్యము లభించినది.
అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ వచనం ఎంతో నిజం: దుష్టుడు మోసకరమైన వేతనమును సంపాదించుకుంటాడు. అది చూడడానికి అది వృద్ధిపొందుచున్నట్లుగా అనిపించవచ్చును. కానీ, అది శాశ్వతం కాదు. అది చాలా మోసకరమైనదిగా ఉంటుంది. అది అస్థిరమైన స్థితిలో ఉంటుంది. కానీ, నీతిని విత్తువాడు, మనుష్యుల యెదుట మరియు దేవుని యెదుట సరైన పనులు చేయువాడు, వాడు తప్పకుండా బహుమానమును పొందుతాడు. అది బలమైన పునాదితో కూడిన బహుమానం. దేవుని నుండి అట్టి దైవాశీర్వాదం ఎన్నటికిని వారి యొద్ద నుండి తీసివేయబడదు. మీరు మీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే, మీరు నీతిలో విత్తియున్నారు. కనుకనే, నేడు మీరు దానిని బహుమానముగా పొందుతారు. ఆలాగుననే, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీతిని విత్తేవారు ఖచ్చితంగా బహుమానమును పొందుతారని నీ వాక్యంలోని వాగ్దానానికై నీకు వందనాలు చెల్లించుచున్నాను. దేవా, నీ బిడ్డలైన మాకు న్యాయము జరిగించుము. ప్రభువా మేము పనిచేస్తున్న స్థలములో మేము అన్యాయము తప్పుడు నిందారోపణలు, ఎదుర్కొంటున్నాము, తద్వారా, మేము నీతిగా చేయుచున్న పనులకు తగిన బహుమానమును మేము పొందుకొనలేకపోవుచున్నాము. కనుకనే ప్రభువా, మేము ఈ రోజు నీతిలో నడవడానికి, యథార్థతతో పనిచేయడానికి మరియు మేము చేయు ప్రతి పనిలో మమ్మును ఘనపరచడానికి ఎంచుకొనియున్నాము. కనుకనే మమ్మును అదే మార్గములో నడిపించుము. దేవా, మేము చేసిన ప్రతి పనికి ఫలితాలు ఆలస్యంగా ఉన్నవని అనిపించినప్పటికిని, ప్రతి ప్రయత్నాన్ని మరియు ప్రతి విత్తనాన్ని నీవు చూస్తున్నావని నమ్ముతూ నమ్మకంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, ఇతరులు తప్పుడు మార్గాల ద్వారా అభివృద్ధి చెందుతున్నట్లు అనిపించినప్పుడు మా హృదయాన్ని అసూయ నుండి రక్షించుము. దేవా, మమ్మును నిరుత్సాహపరచవద్దు, ఎందుకంటే, నీ కాలము పరిపూర్ణమైనది మరియు నీ యొక్క బహుమానము తప్పకుండా మా యొద్దకు వచ్చునని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ వాక్యం యొక్క స్థిరమైన పునాదిపై మా జీవితాన్ని నాటండి మరియు మా ప్రతిఫలము గొప్పగా, శాశ్వతంగా మరియు నీ అనుగ్రహంతో నింపబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.