నా ప్రియ స్నేహితులారా, నేడు మీతో మాట్లాడడము నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. మరియు ఈ రోజు మనం కలిసి దేవుని ఆశీర్వాదంలో ఆనందించబోవుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:14వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తి నొందుదురు; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, ఈ రోజు ఇంతటి గొప్ప సమృద్ధియైన ఉన్నత ఆశీర్వాదము మీ మీదికి దిగివచ్చుచున్నది. కనుకనే, బైబిల్ నుండి 1 పేతురు 2:9వ వచనములో చూచినట్లయితే, " అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు'' అని సెలవిచ్చిన ప్రకారము దేవుడు మనలను 'రాజులైన యాజక సమూహముగాను మరియు ఆయనచే, ' ఏర్పరచబడిన వంశము' అని పిలుచుచున్నాడు. కనుకనే, మీరు ఆయనను స్తుతించువారుగాను, మీరు ఆయనను ఎన్నుకొని, ఆయనను గట్టిగా హత్తుకున్నందున మీరు దేవునికి రాజులైన యాజక సమూహముగాను మరియు ఆయనకు పరిశుద్ధజనముగా ఉండియున్నారు.

ఎందుకనగా, మీరు ఆయనచేత ఏర్పరచకొనబడియున్నారు మరియు ఆయనను విడువక పట్టుకొనియున్నారు. అలాంటి వారి మీద ప్రభువు ఎంతో ఆనందించుచున్నాడు మరియు ఆయన వారిని తన సమృద్ధియైన ఆశీర్వాద ములతోను, తన ఐశ్వర్యంతో తృప్తిపరచుచున్నాడు. కొందరు, ' మీ తలరాత ఇంతే. ఇలాగే మీరు నిర్మూలము కావడం మీ విధి ' అని చెప్పవచ్చును. అయితే, ప్రభువు అంటున్నాడు, ' మీ తలరాత ఆయనచే సమృద్ధిగా ఆశీర్వదించబడియుండుటయే' అని మీరు గుర్తించాలి. ఆమేన్! అదియే మీ చివరి గమ్యముగా ఉంటుంది.

బైబిల్‌లో యాకోబును చూడండి. అతను ఒంటరితనం మరియు కష్టాల గుండా వెళ్లుచున్నప్పుడు, అతడు ప్రభువు మీద ఆధారపడి, ఆయన వైపు చూచినప్పుడు, ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమి యొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం! నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు, ప్రపంచమంతట యాకోబు నుండి వచ్చిన ఇశ్రాయేలు వంశమంతా ఆశీర్వదింపబడియున్నదని మనము చూడగలము. ఆమేన్! అలాంటి గొప్ప ఆశీర్వాదం నేడు మీ మీదికి రాబోవుచున్నది. మరియు అది ప్రభువు మిమ్మును తీసుకొని వెళ్లబోయే గమ్యము, సమృద్ధితో నిండిన స్థానం. కాబట్టి, నా ప్రియులారా, ఈరోజు మీరు మీ సమస్యలను గురించి ఆందోళన చెందకండి. దేవుని చేతి గట్టిగా పట్టుకుని ఉండండి, ఆయన క్రొవ్వుతో యాజకులైన మిమ్మును సంతోషపరచి, తన ఉపకారముల చేత తృప్తిపరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీవు మమ్మును నీ స్వంత జనముగాను మరియు రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను పిలిచినందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, ఈ రోజు మేము సమృద్ధితో జీవించాలన్న నీ వాగ్దానమును మేము మా స్వంతము చేసుకొనుటకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, చీకటిలో ఉన్న మమ్మును నీ యొక్క వెలుగులోనికి పిలిచి, మమ్మును నీ సొత్తయిన ప్రజలనుగా మమ్మును పిలిచినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మేము నాశనము అవుతాము అని పలుకు ప్రతి అబద్ధాన్ని నీవు గద్దించమని కోరుచున్నాము. యేసయ్యా, మా శ్రమలను మరియు కష్టాలను దాటి మమ్మును నీవు వాగ్దానము చేసిన సమృద్ధిగల చోటికి నడిపించుము. దేవా, మేము నీ చేతిని గట్టిగా పట్టుకోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నిన్ను మా పూర్ణ హృదయముతో స్తుతించడానికి కృపను దయచేయుము. దేవా, మేము కలిగియున్న దారిద్య్రమును, లేమిని తొలగించి, సమస్తమును సమృద్ధితో మమ్మును నింపును యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.