నా ప్రియులారా! నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 94:19 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, మనము ఈ లోకములో జీవించినంత కాలము, కష్టాలను మరియు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటాము. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మనలో విచారములు హెచ్చుగా ఉండవచ్చును. కానీ, మన విచారములు అత్యంత తీవ్రమైనప్పుడు, ప్రభువు మనకు తన ఓదార్పును అనుగ్రహించి, మన హృదయములను బలపరుస్తాడు. ఆయన ఆదరణ, ఆయన వాక్యము ద్వారా, ఇతరుల ద్వారా మరియు పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా మనకు లభిస్తుంది. ప్రభువు సన్నిధి మన ఆత్మలకు నూతన ఉత్సాహమును అనుగ్రహించుచున్నది. మనము కలిగియున్న విచారములలో నుండి మరల మనము పైకి లేవనెత్తబడడానికి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి మరియు విజయమును పొందుటకు మనకు బలమును అనుగ్రహించుచున్నది. కనుకనే, మీరు ఎటువంటి అవమానమును పొందకుండా, మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులను జయించెదరు. ప్రభువు మీ జీవితములో నూతన కార్యములను జరిగించెదరు మరియు మీరు నూతన కార్యములను సాధించునట్లుగా మిమ్మును సమర్థులనుగా చేయబడుదురు. ఆయన మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించి, ఘనపరచి, స్థిరపరుస్తాడు.

అందుకే బైబిల్ నుండి కీర్తనలు 71:21వ వచనములో చూచినట్లయితే, " నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మన గొప్పతనమును వృద్ధిచేసి, అన్ని వైపుల నుండి మనలను ఆదరిస్తాడు. కాబట్టి, మీ హృదయములను కలవరపడనీయకండి. ప్రభువు ఈ రోజు మీకు అటువంటి కృపను అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 34:18-19వ వచనములలో చూచినట్లయితే, "విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిల ఋో నుండి యెహోవా వానిని విడిపించును'' అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, మనకు ఆపదలు వచ్చినప్పటికిని ఆయన మనలను రక్షించును. నీతిమంతులకు అనేక కష్టాలు ఎదురైనప్పటికి, ప్రభువు వారిని వాటన్నింటి నుండి విడిపిస్తాడు. కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికిని, ప్రభువు మిమ్మును రక్షించి విడిపిస్తాడు మరియు మీ జీవితములో మీకు ఎదురవుచున్న ప్రతి ఆటంకములను తొలగించబడునట్లుగా యేసు కూడా మీకు ముందుగా నడుస్తాడు. అందుకే బైబిల్ నుండి మీకా 2:13వ వచనములో చూచినట్లయితే, " ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును'' అని చెప్పబడినట్లుగానే, ప్రాకారములు పడగొట్టుటకు దేవుడు మీకు ముందుగా వెళ్లుచున్నాడు. కాబట్టి, మీరు దేనికిని భయపడవద్దు. ప్రభువు తానే మీకు ముందుగా వెళ్లుచూ, మీకు మార్గమును సిద్ధపరుస్తాడు.

నా ప్రియమైనవారలారా, కనుకనే, యేసు మీ వేదనను అర్థము చేసుకుంటాడు; ఎందుకంటే, ఆయన తానే ఎంతగానో సిలువలో వ్రేలాడదీయ్యబడి, ఎంతో వేదనను, బాధలను అనుభవించియున్నాడు. ఆయన సిలువకు వెళ్ళడానికి ముందుగా ఆయన అనుభవించిన శ్రమలను గురించి ఆలోచించండి. గెత్సేమనే తోటలో, యేసు ఎంతో వేదనకు గురయ్యాడు. ఆయన చెమట రక్తపు బిందువుల వలె మారింది. ద్రోహము, నిందారోపణలు, తృణీకారము మరియు అన్యాయపు తీర్పు తన కోసము ఎదురు చూచుచున్నాయని ఆయనకు తెలుసు. అందుకే యేసు తండ్రిని చూచిన, " కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.'' అయినప్పటికి, ఆయన తండ్రి చిత్తమును ఎరిగి, 'నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక' అని పలుకుతూ ఆయన తనను తాను సంపూర్ణముగా తండ్రికి సమర్పించుకున్నాడు. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 9:14వ వచనములో చూచినట్లయితే," నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును'' అని చెప్పబడినట్లుగానే, నిత్యుడైన ఆత్మ ద్వారా ఆయన తనను తాను నిష్కళంకమైన బలియాగంగా అర్పించుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా బలపొందిన యేసు ధైర్యముగా సిలువకు వెళ్లాడు.

నా ప్రియులారా, ఆయన బాధ అంతటితో ముగించలేదు, సిలువపై ఆయన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే, " నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?'' అని ఆయన కేకలు వేశాడు. ఎందుకనగా, మన యొక్క పాపము, బాధలు మరియు దుఃఖము ద్వారా అనుభవించుచున్న బాధ నుండి మనలను విడిపించడానికి, అలాగే తండ్రి ప్రేమను మరియు తోడును మనకు అందించడానికి ఆయన ఆ వేదనను భరించాడు. ఆయన చేసిన తన యొక్క త్యాగము ద్వారా ఆయన బాధ యొక్క శక్తిని జయించాడు. తాను బాధింపబడుచూ, శ్రమలకు గురవుచున్నప్పటికిని, యేసు తనను సిలువ వేయుచున్న వారి కొరకు ప్రార్థించి, "వారిని క్షమించమని'' తండ్రిని కోరాడు.

నా ప్రియులారా, ఆ తర్వాత, రాజులకు రాజుగా ఆయన మూడవ రోజున తిరిగి లేచియున్నాడు. ఆయన నేడు కూడా సజీవంగా ఉన్నాడు; అలసిపోయిన, భారముతో కృంగిపోయిన ప్రతి హృదయముతో ఆయన ఇలా అంటున్నాడు: " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును,'' ఇంకను, నేడు మీకున్న భారము ఏదైనప్పటికి, దానిని నా చేతులకు అప్పగించండి, మీకు అన్యాయం జరిగినట్లయితే అధైర్యపడకండి. నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని కలుగజేస్తాను'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.

కాబట్టి, నా ప్రియులారా, మీ జీవితములో విచారములు, బాధలు, తృణీకరణ, ద్రోహము లేదా నిరాశ మిమ్మును జయించనివ్వకండి. యేసును ఆయన బాధింపబడిన సమయములో బలపరచిన అదే దేవుడు నేడు మిమ్మును కూడా బలపరుస్తాడు. కనుకనే, నేడు మీరు మీ భారములను ఆయనకు అప్పగించి, ఆయన పరిపూర్ణ చిత్తాన్ని నమ్మండి. మీరు ఎక్కడైతే బాధను, అవమానమును అనుభవించియున్నారో, సరిగ్గా అదే స్థలంలో ప్రభువు మిమ్మును ఆదరిస్తాడు. ఆయన మీ జీవితంలో పునరుద్ధరణను, ఘనతను మరియు మహిమను కలిగిస్తాడు. ఆయన మీ దుఃఖమును సంతోషంగానూ, మీ శ్రమలను ఒక సాక్ష్యంగానూ మారుస్తాడు. కాబట్టి, ఈ రోజు ధైర్యము వహించండి. ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మీకు ముందు నడుస్తున్నాడు మరియు మీ యొక్క శ్రమలన్నిటి నుండి ఆయన మిమ్మును జయించువారినిగా బయటకు నడిపిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన యేసయ్యా, మా యొక్క శ్రమలలో నీవు మాతో కూడా ఉన్నందుకు మరియు విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు మా హృదయమును ఆదరించినందుకై నీకు వందనములు. దేవా, నీ వాక్యమును నమ్మడానికి మరియు మా యొక్క ప్రతి భారమును నీ చేతులకు అప్పగించడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము బాధలను, తృణీకారమును, దోషమును, అన్యాయమును లేదా నిరాశను ఎదుర్కొన్నప్పుడు, ' నా చిత్తము కాదు, నీ చిత్తము నేర్చుము ' అని చెప్పుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును బలపరచి, మా యొక్క ప్రతి శోధనను జయించడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, మేము అవమానం మరియు దుఃఖమును అనుభవించిన ప్రతి స్థలములోను, నీ యొక్క పునరుద్ధరణను మాకు కలిగించుము. దేవా, మా హృదయమును నీ యొక్క సమాధానముతో నింపి, నీ యొక్క ఉద్దేశమును మా జీవితములో నెరవేర్చబడుటకు మాకు నీ బలమును అనుగ్రహించుము. ప్రభువా, మమ్మును బాధించు వారిని క్షమించడానికి మరియు నీ యొక్క ప్రేమతో వారిని ఆశీర్వదించడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితములో నీ యొక్క ఆదరణ, ఘనతను మరియు మహిమను బయల్పరచుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.