నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేడు ఎంతో ప్రత్యేకమైన దినము! ఈ రోజు మా తల్లిగారియైన సహోదరి స్టెల్లా దినకరన్ అమ్మగారి జన్మదినము. వివాహము తర్వాత నేను మా అమ్మగారిని కోల్పోయాను. కానీ, తల్లియైన స్టెల్లా అమ్మగారు, ఆ ఖాళీ స్థలమును పూర్తి చేశారు. ఒక తల్లి వలె నా గురించి ఎంతో జాగ్రత్త వహించారు. నా ముగ్గురు బిడ్డలను ప్రసవించడములో నా తల్లిగారు నాకు ఎంతో సహాయము చేశారు. మా స్వంత తల్లివలె నాకు ఆహారమును తినిపిస్తూ, నా పట్ల ఎంతో జాగ్రత్త తీసుకుంటూ, నా గురించి అన్నిటిని పట్టించుకునేవారు. ఈ రోజు కూడా ప్రార్థనతో నన్ను కప్పి ఉంచుచున్నారు. అటువంటి తల్లిని కలిగియుండడానికి నేను ఎంతో దీవించబడియున్నాను. అమ్మా! మీకు దీవెనకరమైన జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 29:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును'' ప్రకారం మనము మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మన మనవి తప్పకుండా ఆలకిస్తాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, సాధారణంగా, ప్రజలు ఇతరులు వారి గురించి వినాలని కోరుకుంటారు. అందుకే ట్విట్టర్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ను కలిగియుంటారు. కానీ, ఇతరులు వింటున్నారా? లేదా? అనేది నిశ్చయంగా వారికి తెలియదు. మరొక వైపు దేవుని బిడ్డలమైన మనము మన మొఱ్ఱను ప్రభువు ఆలకించాలని కోరుకుంటాము. బైబిల్ నుండి కీర్తనలు 130:2వ వచనములో దావీదు భక్తుడు ఈలాగున అంటున్నాడు, "యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.'' మరియు కీర్తనలు 5:1వ వచనములో మనము చూచినట్లయితే, "యెహో వా, నా మాటలు చెవిని బెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము'' అని చెప్పబడినట్లుగానే, లోకములో ఉన్న అనేకుల మొరలు ఇదే అయి ఉంటున్న ది. మన ప్రార్థనలు ఆలస్యమగుచున్నప్పుడు, ప్రభువు చెంత ఈలాగున మొరపెడుతూ ఉంటాము. ఈ లోకములో ఉన్న ప్రజల యొద్దకు వెళ్లి వారు మన మనవులను వినాలని అనుకుంటాము. ఉన్నత అధికారుల యొద్దకు మనము వెళ్లుతూ ఉంటాము. కానీ, కొన్నిసార్లు వారు మన మాటలను పట్టించుకోకపోవచ్చును. అయితే, మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఆలాగున ఉండదు. ఆయన ఎల్లప్పుడు మన మనవులను ఆలకిస్తాడు.

ప్రభువైన యేసుక్రీస్తు 2 వేల సంవత్సరముల క్రితము ఆయన ఈ లోకములో పరిచర్య చేయుచున్నప్పుడు, ఆయనను నమ్మిన ప్రజలు ఆయన యొద్దకు వచ్చి, అనేకసార్లు ఆయనకు అంతరాయము కలుగజేసేవారు. యేసయ్య, పరిచర్య కొరకు వెళ్లుచున్నప్పుడు, 12 సంవత్సరములు రక్తస్రావముగల స్త్రీ యేసు యొద్దకు వచ్చి, ఆయనకు అంతరాయము కలుగజేసెను. మరియు యేసయ్యా మార్గములో వెళ్లుచున్నప్పుడు, సమాజ మందిరపు అధికారియైన యాయీరు కూడా వచ్చి, ఆయనకు అంతరాయము కలుగజేశాడు. కానీ, యేసయ్య, తొందరపడలేదు. ఓపికతో వారి మొఱలను ఆలకించేవాడు. ఆయన వారిని చూచి ఆగేవారు. వారి గృహాలకు వెళ్లి, అస్వస్థతతో ఉన్నవారిని ఆయన తాకి స్వస్థపరచేవాడు. ఆయన యొద్దకు వచ్చిన వారందరు స్వస్థపరచబడ్డారు. వారు అద్భుతాలను పొందుకున్నారు. 'దావీదు కుమారుడా, నా యందు కృపను చూపుము, నన్ను కనికరించుము' అని గ్రుడ్డి బిక్షకుడు అడిగినప్పుడు, యేసయ్య అతనిని దాటి వెళ్లిపోలేదు, ఆయన అదే స్థలములో నిలిచి ఉండిపోయాడు. ఆ గ్రుడ్డివానిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు, ఆయన అతనిని తాకి స్వస్థపరచాడు. అవును, నా ప్రియులారా, యేసయ్య మీ హృదయాన్ని కూడా ఆలకించుచున్నాడు. మీ యొక్క నిశ్శబ్ద సంభాషణను కూడా ఆయన వింటున్నాడు. అనేకసార్లు ప్రభువుతో నేను ఆలాగున మాట్లాడేదానను. నా మాటలు ప్రభువు ఆలకించడం లేదు అని అనుకుంటున్నప్పుడు, 'ప్రభువా, నీవు నా మాటలను ఆలకించుచున్నావు' అని చెప్పేదానను. నేను మాట్లాడుచున్నాను, నీవు నా మాటలను ఆలకించుచున్నావు, నేను నీతో మాట్లాడేది ఆపివేయలేను' అని చెబుతాను. మా బంధువులలో ఒక చిన్న పాప, అట్టి విధముగా ప్రార్థించుట నేను వినియున్నాను. తన పేరు జైరా, తనకు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. తను ఎప్పుడు ప్రార్థిస్తూ, ప్రార్థిస్తుండేది. ప్రార్థన చివరిలో యేసయ్యా, నీతో మాట్లాడేది నేను ఆపి వేయలేను అని చెప్పింది. ఎందుకనగా, నీవు నా ప్రార్థన ఆలకించుచున్నావని నాకు తెలుసు, కానీ, ఈ ప్రజల కొరకు నేను ఆపివేయవలసి వస్తుంది అని చెప్పింది. తను ఎంతో చక్కగా ఉంటుంది, మధురముగా మాట్లాడుతుంది.

అవును, నా ప్రియ స్నేహితులారా, దేవునితో మాట్లాడుతూ ఉండండి మరియు పరలోకపు తలుపులను నిత్యము తడుతూ ఉండండి, ప్రభువు ఆలస్యము చేస్తున్నాడని మీకు అనిపించవచ్చును. కానీ, నా స్నేహితులారా, ఎప్పుడు విడిచిపెట్టకండి, ప్రార్థన చేయుచూ ఉండండి. ఆత్మలో ఎల్లప్పుడు ప్రార్థన చేయండి, అని పౌలు చెప్పియున్నాడు. మీరు శ్రమల ద్వారా వెళ్లుచున్నప్పుడు, కొన్నిసార్లు మాటలు కూడా బయటకు రావు, అటువంటి సమయములో మీరు ఆత్మలో ప్రార్థించవచ్చును, మీరు దేవుని భాషలతో మాట్లాడవచ్చును. అప్పుడు మీ ప్రార్థన ఆలకించబడుతుంది. మీకు అద్భుతము జరుగుతుంది. కాబట్టి, ఆయనకు మొఱ్టపెట్టుటకు విడిచిపెట్టకండి, ప్రభువు వైపు ఇప్పుడు మనము చూద్దామా? ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, 'మీరు నాకు మొఱ్ఱపెట్టుదురు, నేను ఆలకిస్తానని సెలవిచ్చినట్లుగానే,' మేము ఇప్పుడు నీకు మొఱ్ఱపెట్టుచున్నాము, మా యొక్క మొఱ్ఱలను ఆలకించుము. జీవముగల దేవుడవు నీవే, మా ప్రార్థనలను ఆలకించుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మా ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుము. ప్రభువా, ఇప్పుడే మేము అద్భుతాలను పొందుకొనుటకు మాకు నీ కృపను చూపుము. తండ్రీ, ఇప్పుడే, మా వ్యాధులను తాకి మమ్మును స్వస్థపరచుము. దేవా, మా శరీరములో పాడైన ప్రతి అవయవములన్నియు ఇప్పుడే స్వస్థత పొందుకొనునట్లుగా చేయుము. దేవా, మా మనవులు మరెవరూ విననట్లు మాకు అనిపించినప్పటికిని, నీవు మా యొక్క ప్రతి మాటను, ప్రతి కన్నీటిని మరియు మా నిశ్శబ్ద ఆలోచనలను కూడా శ్రద్ధగా వింటున్నావని మాకు తెలుసు. కనుకనే, దేవా, నీవు మా వైపు చూస్తున్నావనియు, మా మొఱ్ఱలను ఆలకించుచున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, ఓపికగా మా మొరలను విని శక్తివంతంగా జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు. ప్రభువా, మా ప్రార్థనలకు జవాబులు ఆలస్యంగా అనిపించినప్పుడు కూడా ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, ఆత్మలో ప్రార్థించడం మరియు మా అద్భుతం దాని మార్గంలో ఉందని నమ్మడం మాకు నేర్పించుము. ప్రభువా, నీవు మాకు నిత్యము ఎంతో సమీపముగా ఉన్నందుకై నీకు వందనాలు. యేసయ్య, మేము ఎల్లప్పుడు నిన్ను పూర్తిగా నమ్మునట్లుగాను మరియు మేము నీతో మాట్లాడుతూనే ఉండునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.