నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 5:14వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మనమెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము'' అని చెప్పబడినట్లుగానే, నేడు మీ హృదయంలో ఉన్న ప్రతి కోరికను మీరు సంశయము లేకుండా ఆయన సన్నిధికి తీసుకురావచ్చునని ప్రభువు ఈ రోజు ప్రేమతో మీకు గుర్తు చేయుచున్నాడు. ఎందుకనగా, నేటి వాగ్దానము ప్రకారము, మీరు ఆయన పరిపూర్ణ చిత్తానుసారంగా అడిగినప్పుడు, ఆయన మీ ప్రార్థనలను తప్పకుండా ఆలకించి, ఆయన తగినకాలములో మీ ప్రార్థనలన్నిటికిని జవాబిస్తాడు. అనేకసార్లు, మనము మన అంచనాలకు అనుగుణంగా మన జీవితమును ప్రణాళిక చేసుకుంటాము. తగిన వయస్సులో వివాహము చేసుకోవాలని, చదువు పూర్తి చేయాలని, వృత్తిని నిర్మించుకోవాలని, లేదా మన ప్రణాళిక ప్రకారం మన కలలను సాకారము చేసుకోవలెననియు కోరుకుంటాము. కానీ, దేవుని ప్రణాళికలు ఎల్లప్పుడూ మన ప్రణాళికలన్నిటికంటె ఉన్నతమైనవిగాను మరియు శ్రేష్ఠమైనవిగాను ఉంటాయి. కనుకనే, మనము మన ప్రణాళికలను ఆయన చేతులకు అప్పగించినప్పుడు, ఆయన అసాధ్యమైన వాటన్నిటిని కూడా మన జీవితములో సాధ్యపరుస్తాడు.

నా ప్రియులారా, బహుశా! ఈ రోజు మీరు ఒక అద్భుతం కొరకు ఎదురుచూస్తూ ఉండవచ్చును. మీరు గర్భఫలము కొరకు ఎంతో కాలముగా వేచియుండవచ్చును. మీరు ఇంకా ఎదురుచూస్తున్న ఆశీర్వాదములను మీ చుట్టూ ఉన్నవారు పొందుకుంటున్నారని దుఃఖించుచూ ఉండవచ్చును. ఇతరులు ఆనందిస్తుండగా, మీ ప్రార్థనలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చును. అయినప్పటికిని, ప్రభువు, "నన్ను అడగండి'' అని అంటున్నాడు. ఎందుకంటే, ఆయన మిమ్మును ఎన్నటికిని మరచిపోజాలడు.

బేతెస్ద ప్రత్యేక ఆశీర్వాద కూటములో మేము ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాము. ఆ దంపతులు తమకు వివాహము జరిగి సంవత్సరములు కావచ్చినది. వారు పది సంవత్సరములు వివాహ బాంధవ్యంలో కలిసి ఉన్నామని తమ సాక్ష ్యమును పంచుకున్నారు. అదేమనగా, తన భార్య గర్భం దాల్చిన ప్రతిసారీ, కొన్ని వారాలలోనే వారు బిడ్డను కోల్పోయేవారు. క్రమముగా గర్భస్రావము జరుగుతుంది. ఈ హృదయ విదారక అనుభవం అనేకసార్లు జరిగి, వారిని క్రుంగదీసి, నిరుత్సాహపరచినది. మీలో అనేకమంది ఈ రోజు అదే బాధను అనుభవించుచూ ఉండవచ్చును; ఇతరుల నిరాశను, బాధపెట్టుచున్న మాటలను భరించుచూ, గర్భమును సంపూర్ణంగా తగిన కాలము వరకు భరించలేకపోవుచూ ఉండవచ్చును.

2023వ సంవత్సరములో, వారు దేవుని సహాయం కోరుతూ బేతెస్ద ప్రార్థన గోపురమును సందర్శించారు. ప్రార్థన సమయములో, మా మామయ్య మరియు అత్తయ్యగారు, వారికి ప్రవచించి, 'వచ్చే సంవత్సరం మీరు ఒక చక్కని బిడ్డకు జన్మనిస్తారు చెప్పారు.' వారు ఆ దేవుని వాగ్దానమును, ప్రవచనమును స్థిరంగా నమ్మారు. సరిగ్గా ఒక సంవత్సరము తరువాత, పది సంవత్సరముల నుండి కలిగియున్న నిరీక్షణ అనంతరం ప్రభువు వారికి ఒక ఆరోగ్యవంతమైన మగబిడ్డను అనుగ్రహించి ఆశీర్వదించియున్నాడు. వారు దాదాపు నిరీక్షణను కోల్పోయినప్పటికిని, దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచి, వారి దుఃఖమును శాశ్వతమైన ఆనందంగా మార్చియున్నాడు. హల్లెలూయా!

అదేవిధంగా, నా ప్రియులారా, అదే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుచున్నాడు. మీ జీవితమును ఇతరులతో పోల్చుకోవద్దు. మీ వివాహమును, మీ పిల్లలను, మీ వృత్తిని, లేదా మీ అభివృద్ధిని మరెవరితోనూ పోల్చుకొనవద్దు. దేవుడు మీ జీవితము కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరచియున్నాడు. కనుకనే, నా స్నేహితులారా, సమస్తమును ఆయన చేతులకు అప్పగించి, ఆయన పరిపూర్ణ సమయమును విశ్వసించినప్పుడు, పై కుటుంబమునకు అద్భుతము జరిగించిన అదే దేవుడు, నేడు మీకు కూడా అలాంటి గొప్ప అద్భుతమును జరిగిస్తాడు. ఈ రోజు మీ జీవితములో అసాధ్యంగా అనిపించినవాటన్నిటిని రేపు మీ జీవితములో సాక్ష్యముగా మార్చబడుతుంది. ఎందుకంటే దేవునికి ఏదియు అసాధ్యమైనది కాదు. సమస్తమును సాధ్యము. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మేము నీకు మొఱ్ఱపెట్టినప్పుడు, నీవు మా మొరను ఆలకించుచున్నందుకై నీకు వందనములు. దేవా, నీవు తగిన కాలములో సమస్తమును జరిగిస్తావనియు,నీవు మా పట్ల కలిగియున్న ప్రణాళికలన్నియు ఉత్తమమైనవనియు నమ్ముచూ, మా ప్రణాళికలు, కోరికలు మరియు మా భవిష్యత్తును గూర్చి కలలన్నిటిని నీ ప్రేమగల చేతులకు అప్పగించుచున్నాము. దేవా, నీవు మా పట్ల గొప్ప కార్యములను జరిగించుము. ప్రభువా, సంతానము లేని మమ్మును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము, మా ఎదురుచూపులకు నీవు ఒక ముగింపును దయచేసి, మాకు గర్భఫలమును దయచేసి, మా జీవితములో ఒక అద్భుతము జరిగించుము. ప్రభువా, మా జీవితములో ఎంతో కాలముగా సంతానము లేకుండా, దుఃఖముతో ఉన్నాము, మా యొక్క కన్నీళ్లను తుడిచి, మాకు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని అనుగ్రహించుము. దేవా, మా యొక్క వృత్తి, ఆర్థికము, విద్యా మరియు కుటుంబ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న మమ్మును బలపరచుము. ప్రభువా, మా జీవితములో అసాధ్యమైన వాటన్నిటిని, నిరాశను మరియు భయమును తొలగించుము. దేవా, నీ వాగ్దానముల కొరకు సహనముతో ఎదురు చూడటానికి మా హృదయమును నీ యొక్క విశ్వాసంతో నింపుము. యేసయ్యా, మా జీవితము నీ అద్భుతాలు జరిగించే శక్తికి మరియు నీ నిత్యమైన ప్రేమకు, విశ్వసనీయతకు సాక్ష్యముగా మార్చబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.