నా ప్రియమైన వారలారా, ప్రభువు మీ పిల్లలను ప్రసిద్ధులుగా హెచ్చించబోవుచున్నాడు. దేవుడు తన విశ్వాసులైన పిల్లలనే కాకుండా, వారి తర్వాతి తరములను కూడా ఆశీర్వదించడంలో ఆనందించుచున్నాడు. తల్లిదండ్రులు నీతి మార్గములో నడుచుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు, వారు తమ పిల్లలపై దేవుని దయను కుమ్మరించి, ఒక ఆధ్యాత్మిక వారసత్వమును వారికి ఇచ్చుచున్నారు. మన పిల్లలను ఆ దేశంలో బలవంతులుగా చేయాలని, తన సమాధానంతో వారిని నింపాలని మరియు తన మహిమ కొరకు వారిని ప్రతిభావంతులైనవారినిగా నిలబెట్టాలని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు.
నా ప్రియమైనవారలారా, మీ పిల్లలను ఈలాగున ఆశీర్వదించి వృద్ధిపొందింపజేయాలని మీ పిల్లల పట్ల మరియు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రూతు 4:14వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక '' అని చెప్పబడినట్లుగానే, రూతు బిడ్డను గురించి ఈ విధంగా చెప్పబడియున్నది. అతని పేరు ఇశ్రాయేలు దేశమంతటిలోను ప్రసిద్ధిగావించవలెనని వాగ్దానము చేయబడినది. నా ప్రియులారా, ఈ ధన్యతను ప్రభువు మీ పిల్లలకు అనుగ్రహించును గాక. మీ పిల్లలు దేశంలో ప్రసిద్ధులుగా హెచ్చించబడుదురు గాక! అందుకే బైబిల్ నుండి కీర్తనలు 112:2వ వచనములో చూచినట్లయితే, "వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు ప్రభువును భయభక్తులతో అనుసరించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు మీ సంతతి భూమి మీద బలవంతులగుతారు. మీ పిల్లల జీవితంలో జరిగించు ప్రతి కార్యము బలముగా ఉంటుంది. అది ఎంతో శక్తివంతముగాను, బలంగాను ఉంటుంది. మీ పిల్లలు దేశంలో శక్తివంతులుగా ఉంటారు. యథార్థవంతుల వంశము ఈలాగున ఆశీర్వదించబడుతుంది.
నా ప్రియులారా, నేడు ఈ ఆశీర్వాదమును, మీ యథార్థమైన జీవితం నిమిత్తము భయభక్తుల నిమిత్తము మీ పిల్లల మీద ప్రభువు అనుగ్రహించును గాక. అటుతరు వాత, మీ పిల్లల సమాధానం గొప్పగా ఉంటుంది. అందుకే బైబిల్ నుండి యెషయా 54:13వ వచనములో చూచినట్లయితే, " నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును'' అని చెప్పబడినట్లుగానే, ఈ రోజు ఎంతమంది యౌవన బిడ్డలు వారి జీవితములో సమాధానము లేకుండా, తమ ఇంటి మేడ మీద నుండి దూకి, ఇంకను నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవుచున్నా రు. ఎందుకంటే, ఒత్తిడి, మానసిక ఒత్తిడి వలన మరియు ప్రేమ వైఫల్యము ద్వారా వారి జీవితములలో సమాధానమును కోల్పోవుచున్నారు.
ఒకరోజు ఒక వార్తను చదివాను. నిన్న జరిగిన కథ. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఒక ప్రియుడిని కనుగొనినది. ఆమె ఉండేది ఒక ఊరు. ఆ అబ్బాయి ఉండేది వేరొక ఊరు. ఇద్దరూ చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరములుగా వారి ప్రేమ ఈలాగుననే సాగుచుండెను. నిన్న ఆ అమ్మాయి సోదరుడు మరియు తల్లి దీనిని కనుగొన్నారు. అమ్మా! ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? అన్నింటిలోనూ వెనుకబడిపోయావని వారు ప్రేమతో ఆ బిడ్డను వేదన మధ్యలో దానిని విడిచిపెట్టమని చెప్పారు. తన కుమార్తె జీవితము నాశనమైపోకూడదనే మంచి ఉద్దేశంతో, దానిని విడిచిపెట్టమని చెప్పారు. అయితే, ఆ అమ్మాయి వెంటనే, మరుసటి రోజే ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకొనెను. ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయినది. తన చేతుల ద్వారా తన ప్రాణం తీసుకుంది. ప్రేమయే నాకు ప్రాముఖ్యము అనుకున్నది. మా అమ్మ మరియు నా సోదరుడు చెప్పునది నేను అంగీకరించలేనని చెప్పి, మానసిక ఒత్తిడితో ఒక్క క్షణంలో తన ప్రాణమును తీసుకొనెను. చివరికి ఏమి జరిగినది? పోలీసులు వచ్చి ఆ తల్లిని ఖైదు చేశారు. ఆమెను ఖైదీ చేసి తీసుకెళ్లి విచారిస్తున్నారని వార్తల్లో వ్రాశారు. అయితే, ఆ తల్లి ఏమీ జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఇటువంటి బాధాకరమైన సంఘటన, కేవలం క్రీస్తు మాత్రమే ఇవ్వగలిగే ఈ శాంతిసమాధానము నేటి తరానికి ఎంతగానో అవసరమని మనకు గుర్తుచేయుచున్నది.
నా ప్రియులారా, ఆ తల్లి ఏమియు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లుగానే మనము కూడా ఉన్నాము. ఈ తరము పిల్లలు, తల్లిదండ్రులు మంచి చేసినా తప్పుగా భావించుచున్నారు. పిల్లలు ఈ నిర్ణయం తీసుకున్నా, తల్లులకు ఇది బాధాకరమైన ముగింపుగా ఉంటున్నది. రెండు వైపులా గాయపడవలసిన దుస్థితి. తన కుమార్తెను కోల్పోయిన దుఃఖం ఒకవైపు, మరోవైపు నాకేమీ కాకూడదని చెప్పి, ఆమెను ఖైదీని చేసి వారిని వేధించే మరో పరిస్థితి. ఎంత బాధాకరమైన విషయం కదా. తల్లిదండ్రులు పిల్లలను ఏమీ కూడా అనకూడదు. దానికి ఎవరూ కూడా సహాయపడలేరు. సమాజం కూడా సహకరించదు. ఈ స్థితిలో పిల్లలు తప్పుడు పనులు చేసినప్పుడు, మానసిక ఒత్తిడికి లోనై తమ జీవితాలను నాశనం చేసుకునే ఈ సమయంలో ప్రభువు చెబుతున్నాడు, 'నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు నేను అధిక విశ్రాంతి కలుగజేతును. ' కనుకనే, యేసు ప్రేమతో నింపబడి, యేసు వలె పవిత్రమైన జీవితమును గడుపుతూ, తల్లిదండ్రులను ఘనపరచే జీవితమును జీవించి, మేలును అనుభవించునట్లుగా చేసినప్పుడు, వారి సమాధానమును హెచ్చింపజేస్తాడు. దానితో పాటు, తల్లిదండ్రులు యథార్థంగా నడుచుకున్నప్పుడు పిల్లలకు గొప్ప ధన్యత కలుగుతుంది.
అందుకే బైబిల్ నుండి సామెతలు 20:7వ వచనములో చూచినట్లయితే, " యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు'' అని చెప్పబడినట్లుగానే, నీతిమంతుడు తన యథార్థతలో నడుచుకున్నప్పుడు, అతని తర్వాత అతని పిల్లలు ధన్యులవుతారు. తల్లిదండ్రుల కాలంలో బహుశా కుటుంబంలో ధన్యత లేకపోవచ్చును. పిల్లలకు ఇటువంటి ధన్యత లేకపోవచ్చును. కానీ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి యొక్క యథార్థమైన జీవితం, పవిత్రమైన జీవితం, శ్రమల మధ్య ప్రభువు కోసం ఆయన అన్నింటిని సహించి చేసిన త్యాగపూరిత సేవ యొక్క ఫలం పిల్లలకు లభించుచున్నది.
నా యొక్క వ్యక్తిగత జీవితములో చూచినట్లయితే, మా తండ్రి ప్రభువు యొద్దకు కొనిపోబడిన తర్వాతనే మాకు ఎంతో గొప్ప ధన్యత కలిగింది. మా తండ్రి కార్చిన కన్నీటి వలన, ప్రార్థన వలన మా జీవితంలో సమృద్ధియైన ఆశీర్వాదములను అనుభవించుచున్నాము. ఆ ధన్యత నా భార్యకు మరియు పిల్లలకు, ఇంకను సేవాపరిచర్యకు పొందుకొనగలిగాము. ఇది ఎంత గొప్ప ధన్యత. మా తండ్రి యథార్థంగా జీవించి, కష్టపడి, త్యాగం చేసి, తన జీవితమును ప్రభువు కొరకు త్యాగము చేసి, జీవించి ప్రభువు దగ్గరకు కొనిపోబడ్డారు. ఆయనగారు వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రార్థన, ఆయన కన్నీళ్లు నేటి వరకు సజీవంగా మన మధ్యలో ఇంకను జీవించుచున్నవి. కనుకనే, తద్వారా, మాకు ఇటువంటి గొప్ప ధన్యత కలిగింది. మా ద్వారా కోట్ల కొలది ప్రజలకు మరియు దేశములకు కూడా గొప్ప ధన్యతను పొందుకొనుటకు ప్రభువు కృపను చూపించియున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అటుతర్వాత మరొక విషయం, శిక్షణ పిల్లలను ధన్యులుగా మార్చుచున్నది. అందుకే బైబిల్ నుండి సామెతలు 29:17వ వచనములో చూచినట్లయితే, " నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును'' ప్రకారము కాబట్టి మీ పిల్లలను మంచి మార్గంలో నడిపించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు చేయవలసిన సేవను చేయండి. మీ కుమారుడు లేదా కుమార్తె మీ ప్రాణమునకు ఆనందమును కలిగిస్తారు. మీలో విశ్వాసం ఉన్నప్పుడు, పోరాటాల మధ్య కూడా ప్రభువును హత్తుకున్నప్పుడు, ఆ విశ్వాసం మీ పిల్లల మీద, మనవ సంతానము మీద గొప్ప ధన్యతను తీసుకువస్తుంది. అందుకే బైబిల్ నుండి 2 తిమోతి 1:5వ వచనములో చూచినట్లయితే," ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, ప్రియమైన వారలారా, ప్రభువు ఈ కృపను మీకు కూడా అనుగ్రహించును గాక. మీ పిల్లలు భూమి మీద బలవంతులుగా ఉందురు గాక. నా ప్రియులారా, నీతిమంతులు తన యథార్థతలో నడుచుకున్నప్పుడు, వారి తర్వాత వారి యొక్క పిల్లలు ధన్యులవుతారు. మీ యథార్థతను బట్టి మీ పిల్లలు ఈ ధన్యతను అనుభవించునట్లుగా ప్రభువు చేస్తాడు. కనుకనే, నిరుత్సాపడకండి, నిరంతరం యథార్థతలో నడవండి. యథార్థవంతులకు ప్రభువు తోడుగా ఉంటాడు. యథార్థంగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానడు. యథార్థతను విడిచిపెట్టకుండా ఉండండి, ఎలాంటి పరిస్థితుల్లోనూ సొమ్మసిల్లిపోకుండా ఉండండి. మీ పిల్లలకు తగినకాలమందు ఇటువంటి ధన్యత కలుగుతుంది. చింతించకండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీ నామమున ద్వారా ఈ ఆశీర్వాదాన్ని మా పిల్లల మీద ఉంచి, దానిని స్థిరపరచుము. దేవా, మా పిల్లల జీవితములోనికి ఈ ధన్యత దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా పిల్లలు దేశంలో ప్రసిద్ధి చెందునట్లుగా ఆత్మ శక్తి వారిలోకి దిగివచ్చునట్లుగా చేయుము. తండ్రీ, ఈ కార్యములన్నిటిని చేయుచున్నప్పుడు, మా పిల్లలను ఆశీర్వదించి,మా పిల్లల పేర్లు, మనమసంతానము పేర్లు ప్రసిద్ధి చెందునట్లుగా వారిని హెచ్చించుము. దేవా, మా దేశంలో వారిని హెచ్చించి, నీ మహిమ నిమిత్తము వారు వాడబడునట్లుగా చేయుము. ప్రభువా, మా పిల్లలకు నీవు బోధించి, నీ యొక్క సమాధానంతో నింపుము. ప్రభువా, ఈ లోక సంబంధమైన కీడు ఏదీ వారికి రాకుండా, వారిలో మానసిక ఒత్తిడి, ఆత్మహత్య, నష్టం, అనవసరమైన సంబంధాలు, కలత ఏవియు మా పిల్లలకు రాకుండా భూమి మీద బలవంతులుగా ఉండునట్లుగా చేయుము. దేవా, మేము నీతో కలిసి జీవించునట్లుగాను, నీ పోలికను ధరించుకొనునట్లుగాను, నీతితోను, యథార్థతతోను, జీవించునట్లుగాను, సహాయము చేయుము. యేసయ్యా, మేము మా తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చే పిల్లలుగా ఉండునట్లుగా చేసి, వారిని ఘనపరచి, ఆశీర్వదించుము. దేవా, మా పిల్లలు అన్ని విషయాలలో పిల్లలను ప్రసిద్ధి చెందునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


