నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నా ప్రియులారా, మీకందరికి తెలిసినట్లుగా నా జీవితములో ఈ రోజు ఎంతో విశాదకరమైన దినము. ఎందుకనగా, ఈ రోజు నాకు ఎంతో ప్రశస్తమైన ఏకైక కుమార్తె ఏంజల్‌ను కోల్పోయాను. అయితే, వీటన్నిటి మధ్యలో ఈ లేఖనానుసారముగా ప్రభువు నన్నెంతగానో దీవించి, బలపరచాడు. ఈ రోజు మనకు ఇవ్వబడిన వాగ్దానముగా మనము బైబిల్ నుండి మత్తయి 6:33వ వచనమును చదువుదాము. ఆ వచనము, "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును'' ప్రకారం ప్రియులారా, మీరు ప్రభువును మరియు ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకినప్పుడు, దేవుని ఆశీర్వాదాలన్ని కూడా మీకు కలుగుతాయి.

నా ప్రియులారా, ఒకవేళ మీరు, 'అయ్యో, నా భర్తను కోల్పోయాను, నా కుమార్తెను, కుమారుని మరియు నా ప్రియులను కోల్పోయాను' అని ఏడుస్తూ ఉండకండి. నా జీవితములో చూచినట్లయితే, నా వేదనంతటి మధ్యలో కూడా దేవుని ఘనపరచాలని నేను యేసు వైపు చూడడము నేర్చుకున్నాను. నేను మరియు మా కుటుంబమంతయు యేసు వైపు మాత్రమే మా దృష్టిని ఉంచియున్నాము. తద్వారా, దేవుడు మమ్మును అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇంకను ఆయన ఎంతో మంది బిడ్డలను మాకిచ్చియున్నాడు. బైబిల్ నుండి 1 యోహాను 2:16వ వచనమును మనము చదివినట్లయితే, "లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు; అవి లోక సంబంధమైనవే.'' మరియు బైబిల్ నుండి కీర్తనలు 143:3 వ వచనములో చూచినట్లయితే, శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టు చున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు'' ప్రకారం ఈ లోకాశల వలన అపవాది మనలను గాఢాంధకారములో నివసింపజేస్తాడు. కనుకనే, మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

అవును, నా ప్రియులారా, అపవాది మన గృహమును, మనము కలిగియున్న సమస్తమును మ్రింగివేయాలని అపవాది వేచి ఉంటూ, గర్జించుచు తిరుగుచుంటాడు. అయితే, యేసు రక్తము మనలను కడిగి ఈ లోకములో ఉన్న శరీరాశలన్నిటి నుండి మనలను విడిపించగలదు. నా ప్రియులారా, మీకు ఈ లోకములో శాంతి, సమాధానమును నెమ్మది, సంతోషము లేకపోతే, యేసు యొద్దకు రండి, సిలువ యొద్దకు రండి, మీరు ఆ సిలువ యొద్ద శాంతి సమాధానమును, సంతోషము సమస్తమును పొందుకుంటారు. బైబిల్‌లో లూకా 10:42వ వచనమును మనము చూచినట్లయితే, అందులో మరియను గురించి చదువుతాము. మార్త, లాజరుల యొక్క సహోదరియైన మరియ గురించి మనము చూడగలము. ఆమె యేసయ్యను హత్తుకొని యుండెను. ఆయన సన్నిధిని నిత్యము వెదకుచుండెను. అందును బట్టి, మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో యేసు ప్రభువు ఆమెను గురించి సాక్ష్యమిచ్చెను. ఆలాగుననే, బైబిల్ గ్రంథములో అనేకులు అంధకారముతో నింపబడి, యేసు నొద్దకు రావడము మనము చూడగలుగుతాము. దేవుని సన్నిధిని వాక్యములో ఉన్న శక్తి, యేసు చెంతకు రావడానికి సహాయపడినది. ఇంకను అంధకారమంతటిని కూడా తొలగించి వేయబడాలని యేసు వెలుగునొద్దకు వారందరు వచ్చారు. ఆలాగుననే, నా ప్రియులారా, ఇప్పుడు కూడా మీ అంధకారము నుండి మీరు బయటకు రాగలరు. మీరు చేయవలసినదంతయు, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకినట్లయితే, నిశ్చయముగా ప్రభువు సమాధానము, సంతోషము మరియు ఆయన యందు గుప్తములైయున్న దీవెనలన్నియు మీకు అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, మా హృదయాన్ని తెరిచి, నీ రాజ్యాన్ని మరియు నీతిని మొదట వెదకుతూ మేము నీ ముందుకు వచ్చుచున్నాము. ప్రభువా, మా దుఃఖం, శోధన మరియు చీకటితో నిండిన ఈ లోకములో, శాంతి, ఆనందం మరియు సమృద్ధిగా ఆశీర్వాదం యొక్క ఏకైక ఆధారంగా ఉన్న నీ వైపు మేము చూచుచున్నాము. తండ్రీ, నీ అద్భుత సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, మా ప్రియులను కోల్పోయిన మాకు నీ యొక్క దైవీకమైన సమాధానమును అనుగ్రహించుము. ప్రభువా, అంధకారములో ఉన్న మమ్ములనందరిని నీ వెలుగులోనికి తీసుకొని రమ్ము. దేవా, దేవుని సన్నిధానముతో మమ్మును నింపి, మా జీవితమును పునరుద్ధరీకరించి, నూతన జీవమును మాకు దయచేయుము. యేసయ్యా, నీ సన్నిధానముతో నింపబడిన ఒక మంచి జీవితమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, యేసు యొక్క విలువైన రక్తం ద్వారా మమ్మును కడిగి శుభ్రపరచుము. యేసయ్యా, ఈ లోకాశలను విడువకుండా, నీ వెలుగు నుండి మమ్మును దూరంగా లాగడానికి ప్రయత్నించే శత్రువు యొక్క ప్రతి కుట్ర నుండి మమ్మును విడిపించుము. యేసయ్యా, మరియవలె, అన్నింటికంటే ఉత్తమమైన నీ సన్నిధిని మేము ఎంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా మార్గం బాధాకరమైనది లేదా అస్పష్టంగా ఉన్నప్పుడు కూడా, నీ వాక్యాన్ని అంటిపెట్టుకుని, నీ సత్యంలో నడవడానికి మమ్మును అనుమతించుము. ప్రభువా, నీ ఆనందం మా బలం. నీ శాంతి ద్వారా మా హృదయాన్ని కాపాడుము. మరియు నీ ప్రేమ మమ్మును ప్రతిరోజు నీతో లోతైన సంబంధంలోనికి నడిపించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.