నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 33:19వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, "ఆయన నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను'' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ వాగ్దానము మోషేకు మాత్రమే కాదు, ఆయన పిల్లలందరికి చేసిన వాగ్దానం ఇది. ఆయన తన మంచితనాన్ని మన యెదుట నుండి దాటిపోనివ్వడు. కానీ, దానిని మన మీద కుమ్మరిస్తాడు. మన దేవుడు నిజంగా మంచి దేవుడు. యెహోషాపాతు, " యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి'' అని ప్రకటించాడు. శత్రువులు అతనిపైకి లేచినప్పుడు, అతను తన చేతులను పైకెత్తి, గాయకులను పాడుటకును స్తుతించుటకును నడిపించాడు మరియు దేవుని మంచితనాన్ని మాత్రమే ప్రకటించాడు. ప్రభువు తన ప్రజల యొక్క పాటలను, స్తుతులను ఘనపరచాడు, కనుకనే, ఆయన వారి శత్రువులను నాశనం చేశాడు మరియు వారి భయాన్ని విజయంగా మార్చాడు. యెహోషాపాతు, "వారికిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపో గలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టెను. ఎందుకంటే, దేవుడు ఇదివరకే యుద్ధమును జయించాడు. నిజంగా, ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది మరియు ఆయన తన పిల్లలను ఆశీర్వదించడంలో నిరంతరము ఆనందిస్తాడు.

బైబిల్ నుండి యిర్మీయా 32:40వ వచనములో ప్రభువు స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు, " నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను'' ప్రకారం ఆయన స్వభావం మంచితనం, దయాళత్వము మరియు సమద్ధితో నిండి ఉన్నది. దేవునికి సంపూర్ణంగా లోబడాలనియు, పాపం, భయం మరియు లోకంపై నమ్మకాన్ని విడిచిపెట్టాలనియు ఆయన మనలను తన వైపు తిరగమని పిలుచుచున్నాడు. కనుకనే, మనం ఇలాగున చెప్పినప్పుడు, "ప్రభువా, నీ చిత్తము నెరవేరును గాక'' అని పలికినప్పుడు, ఆయన తన మంచితనమంతా మన మీదికి వచ్చునట్లుగా చేస్తాడు. అందుకే యోహాను 1:16వ వచనములో చూచినట్లయితే, "ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి'' అని చెప్పబడిన ప్రకారంగానే, ఆయన పరిపూర్ణత నుండి మనం ఒకదాని వెంబడి ఒకటి ఆశీర్వాదాలను, కృప వెంబడి కృపను, కనికరము వెంబడి కనికరమును పొందుకుంటామని స్పష్టంగా మనకు తెలియజేయుచున్నది. ఇది తన పిల్లల పట్ల దేవుని హృదయమై యున్నది. ఆయన మంచితనం మరియు దయాళత్వము యొక్క అంతములేని పొంగిపొర్లుచున్న ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, మరియు కృప వెంబడి కృపను దేవుడు నేడు మీకు అనుగ్రహిస్తాడు.

దేవుని యొక్క మంచితనానికి సహోదరి అలోక్ షాహా యొక్క ఒక చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. ఇరవై సంవత్సరాలుగా ఆమె భర్త మద్యానికి బానిసై, అతని సంపాదన అంతా త్రాగడానికి వృధా చేసుకున్నాడు. అయితే, ఆమె వంట మనిషిగా పనిచేసి వారి యొక్క ఇద్దరు పిల్లలను పెంచడానికి ఎంతగానో కష్టపడినది. పేదరికం, అప్పులు, అప్పులవారి వేధింపులు వారిని కృంగదీశాయి, మరియు వారి చిరిగిన బట్టలు మరియు అద్దె ఇల్లు, ఆ యిల్లు తరచుగా వర్షాల వలన మునిగిపోయేది. ఆమె బంధువులు వారిని విడిచిపెట్టారు మరియు నిరాశ ఆమెను, జీవితాన్ని ముగింపు దశకు చేర్చింది. ఆ సమయంలో, ఆమె పొరుగువారు ఆమెను యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు రమ్మని పిలిచారు. మరియు త్వరలోనే ఆమె యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమాన్ని చూడటం ప్రారంభించింది. టి.వి. కార్యక్రమముల ద్వారా యేసు గురించి వినడంతో ఆమె హృదయం గొప్ప నిరీక్షణతో నిండిపోయింది, మరియు ఆమె ఆత్మహత్య తలంపుల స్థానంలో సమాధానము వచ్చి ఆక్రమించుకొనెను. ఆమె తన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించి, క్రమం తప్పకుండా ప్రార్థనకు హాజరుకావడం ప్రారంభించింది. 2018లో, రూర్కెలాలో జరిగిన యేసు పిలుచుచున్నాడు కూటాలలో పాల్గొన్నప్పుడు, నేను ఇలాగున అన్నాను, 'దేవుని ఇంటిని (అంటే ప్రార్థన గోపురం)ను కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు'' అని చెప్పాను. ఆమె ప్రార్థన గోపురం నిర్మించడానికి ఒక చిన్న కానుక ఇచ్చింది, ఆమె భరించగలిగేది అదే. 2020 లో, కోవిడ్ సమయంలో, దేవుడు ఆమెకు కోల్‌కతాలో ఒక చక్కటి ఇంటిని ఇచ్చాడు, ఇరవై సంవత్సరాల తర్వాత ఆమె భర్తను మద్యం నుండి విడిపించాడు, వారి అప్పులను రద్దు చేశాడు మరియు వారి కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. నా ప్రియమైన వారలారా, ఈరోజు ఆమె కుమార్తె వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నది మరియు ఇప్పుడు ఆమె తన మనవరాళ్లలో ఆనందిస్తుంది. మనం ఎంత అద్భుతమైన యేసును సేవించుచున్నాము. ఆమె కొరకు ఈ కార్యమును చేసిన దేవుడు నేడు మీ కొరకు కూడా దీనిని జరిగిస్తాడు. కాబట్టి మీ హృదయాన్ని కలవరపెట్టనీయకండి, ఎందుకంటే ఆయన మంచితనం ఎన్నటికిని ఓటమి పాలు కాదు. అది నిరంతరము నిలిచి ఉంటుంది. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీ మంచితనము యొక్క వాగ్దానమునకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మోషే యెదుట నీ మంచితనము కనుపరచినట్లుగానే, ఈరోజు మా జీవితంలో అది పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, మా భయములు, మా పోరాటములు మరియు మా కోరికలను నీకు అప్పగించుచున్నాము. దేవా, వాటన్నిటిని మా యెదుట నుండి తొలగించి, మాకు కనికరమును, కృప నిరంతరము నిలిచి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా బలహీనతను నీ బలంతో, మా కొరతను నీ సమృద్ధితో, మరియు మా నిరాశను నీ నిరీక్షణతో భర్తీ చేయుము. దేవా, నీ దయ మాలో నిరంతరము నిలిచియుండునట్లుగాను మరియు నీ ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదములు, కృప వెంబడి కృపను, కనికరము వెంబడి కనికరమును మా మీద ప్రవహించునట్లుగా చేయుము. దేవా, యెహోషాపాతువలె మా స్వరమును ఆరాధనలో ఎత్తి, నీవు మా యుద్ధములతో పోరాడుదువని మరియు మా భయమును విజయంగా మారుస్తావని నమ్మి ముందుకు సాగుటకు మాకు నేర్పించుము. దేవా, మా జీవితం నీ ముగింపులేని నిత్యము నిలిచియుండు మంచితనమునకు సాక్ష్యము ఇచ్చు కృపను మాకు దయచేయుము. దేవా, మాకు మేలు చేయుటను ఎన్నటికిని ఆగిపోకుండా సత్యములో మేము నిలిచియుండునట్లుగా మాకు కనికరమును చూపుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.