నా ప్రశస్తమైన స్నేహితులారా, నేడే రక్షణ దినము. లేఖనం అదే చెబుతుంది, మరియు రక్షణ నిజంగానే ఉన్నతమైన గొప్ప బహుమానము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 12:2వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను'' ప్రకారం ఆయన మనకు బలమును, కీర్తనకాస్పదము, ఆయన మనకు రక్షణాధారముగా ఉన్నాడు. రక్షణ అనగా, వినాశము మరియు విధ్వంసం నుండి రక్షించబడటం. కానీ గొప్ప వినాశనం పాపం వలన వస్తుంది. పాపం యొక్క జీతం మరణం. పాపం ఆత్మను, జీవమును మరియు సంబంధాలను కూడా చంపుతుంది. అత్యంత విషాదకరమేమనగా, ఇది జీవము నిచ్చు యేసుతో మనకున్న సంబంధాన్ని కూడా తెంచి వేస్తున్నది. కనుకనే, మరణం కఠోరమైనది మరియు పాపం కూడా భయంకరమైనది. అయితే, దేవునికి స్తోత్రములు. యేసు మనలను రక్షించడానికి మన కొరకు వేచియున్నాడు.
ఇంకను బైబిల్ నుండి లూకా సువార్త 15వ అధ్యాయములో మనము చూచినట్లయితే, తన తండ్రి నుండి దూరమై, తన ఆస్తినంతటిని తీసుకొని పాపంలో వృధా చేసి, పందుల మధ్య జీవించుచూ, అనాథగా మిగిలిన తప్పిపోయిన కుమారుని గురించి మనం చదువుతాము. తన తండ్రి యొద్దనున్న దాసులు కూడా ఆశీర్వదించబడ్డారని గుర్తించినప్పుడు, అతను పశ్చాత్తాపపడిన హృదయంతో తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. అతను సన్నగా, మురికి బట్టలతో, సిగ్గుతో, చెప్పులు లేకుండా, విరిగిన హృదయముతో తన తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు, ఆ తండ్రి, 'ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను. ' అయితే, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద క్షమాపణ కోరుకున్నాడు మరియు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి, నిజమైన జీవమును పొందుకోవడము అంటే ఇదే.

నా ప్రియులారా, మనము పాపములను ఒప్పుకొని, దేవునికి మొఱ్ఱపెట్టినట్లయితే, "తండ్రీ, నేను పాపిని, నన్ను క్షమించు మరియు నన్ను నీ బిడ్డగా మరల నీ యొద్దకు చేర్చుకొనుము'' అని చెప్పినప్పుడు మన పరలోకపు తండ్రి ప్రేమతో మనలను తన యొద్దకు చేర్చుకొని, మనము కోల్పోయిన దానినంతటిని తిరిగి మనకు రెండంతలుగా అనుగ్రహిస్తాడు. ఒక పాపి రక్షింపబడినట్లయితే, పరలోకము మిక్కిలి సంతోషిస్తుంది మరియు దేవదూతలు కూడా సంతోషిస్తారు. దేవుడు మీకు రక్షణకు కారణభూతుడగు దేవుడుగా ఉన్నాడు. కనుకనే, మీరు ఆయన యందు నమ్మకముంచండి మరియు దేనికిని భయపడకండి. ఆయన శిక్షించడానికి కాదు గానీ, క్షమించడానికి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి, మీరు పశ్చాత్తాపపడి, మీ పాపములను విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి, యేసు యొద్దకు రండి. మీకు సహాయం చేయమని ఆయనను అడగండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మీ జీవితాలను మారుస్తాడు మరియు మిమ్మును రూపాంతరపరుస్తాడు. అంతమాత్రమే కాదు, మరొకసారి ఆశీర్వాదాలతో మిమ్మును అలంకరిస్తాడు. ఆయన మిమ్మును దాసులనుగా విడిచిపెట్టకుండా, తన ప్రియమైన పిల్లలనుగా మిమ్మును స్వతంత్రులనుగా చేసి కౌగలించుకుంటాడు.

నా ప్రియులారా, ఇటువంటి రక్షణ మహిమను కనుపరచేందుకు, పుణెలోని హర్ష్ మోసెస్ మదన్‌కర్‌ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. అతను దేవుని యందు భయభక్తులతో పెరిగాడు, ఆదివారం సండేస్కూల్ గాయక బృందంలో కూడా చురుకుగా ఉండేవాడు మరియు యువకుడిగా గ్రామ పరిచర్యలో కూడా పాల్గొన్నాడు. కానీ, తన Äౌవన వయస్సులో, హర్ష్ దూరంగా వెళ్ళిపోయాడు. అతను ప్రార్థన చేయడం మానేశాడు, చర్చిని నిర్లక్ష్యం చేశాడు మరియు మద్యం, మాదకద్రవ్యాలు మరియు ధూమపానంలో మునిగిపోయాడు. అతని తిరుగుబాటు ఇంట్లో కలహాలకు దారితీసింది, ఎందుకంటే అతను తన తల్లిదండ్రులతో గొడవలు పడ్డాడు. అయితే, అతని తల్లి ఉపవాసం ఉండి అతని జీవము కొరకు హృదయపూర్వకంగా ప్రార్థించింది. అతను పునరావాస కేంద్రంలో సమయం గడిపినప్పటికిని అతనిలో ఏమి కూడా మార్పు చెందలేదు మరియు అతను ఈ లోక సుఖభోగాలను వెంబడిస్తూ, పాపంలోనికి లోతుగా మునిగిపోయా డు. 2023లో విషాదం ఒక జరిగింది. అతడు స్నేహితులతో కలిసి టపాకాయ లు పేలుస్తుండగా, అతని ముఖం మీద పటాకులు పేలాయి. అతను తీవ్రంగా కాలిన గాయాలతో కళ్ళు చెదిరి, కంటిలో తీవ్రమైన రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. నాలుగు రోజుల తర్వాత, అతని ఎడమ కన్ను తొలగించవలసి ఉంటుందని వైద్యులు ప్రకటించా రు. అతని తల్లి వెంటనే హర్ష్ సోదరి ద్వారా నాకు ఈమెయిల్ పంపి ప్రార్థన సహాయమును కోరారు. నేను ప్రార్థనలో స్పందించాను మరియు ప్రార్థనా యోధులు కూడా అతని కొరకు భారంగా ప్రార్థించడం ప్రారంభించారు. ప్రభువు నుండి ఒక వాగ్దానం అతనికి పంపబడినది, ' నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ' ఆ మాటలు అతని హృదయాన్ని బ్రద్ధలు చేశాయి. తన ఐసియు బెడ్ నుండి, హర్ష్ పశ్చాత్తాపంతో దేవునికి ఈలాగున మొరపెట్టాడు, 'ప్రభువా, నన్ను క్షమించు. నేను పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను స్వస్థపరచు' అని చెప్పి ప్రార్థించినప్పుడు, దేవుడు అతని లోతైన ప్రార్థన విన్నాడు, ఆ క్షణం నుండి పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభించాయి. అతను కోలుకోవడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. కన్నీళ్లతో హర్ష్ తన తల్లితో, ' నేను నా కంటి చూపును కోల్పోయినా, నేను యేసును విడిచిపెట్టను, నేను ఆయనను వెంబడిస్తాను ' అని అన్నాడు. అతని అమ్మమ్మ వెంటనే అతనిని యేసు పిలుచుచున్నాడు యౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్చెను. తద్వారా, దేవుడు వారి పట్ల ఒక అద్భుతం చేసాడు. అతని ఎడమ కన్ను కాపాడబడింది మరియు అతని కంటి చూపు పూర్తిగా పునరుద్ధరించబడింది. కేవలం 40 రోజుల్లోనే, హర్ష్ పూర్తిగా స్వస్థతను పొందుకున్నాడు. అయితే, అతి పెద్ద అద్భుతం ఏమిటంటే, అతని దృష్టి పునరుద్ధరించబడటమే కాకుండా, అతని జీవితం రూపాంతరం చెందింది. అతని పాత స్నేహితులు అతనిని విడిచిపెట్టినప్పటికిని, యేసు అతనికి ప్రాణ స్నేహితుడు అయ్యాడు. 2024 వ సంవత్సరములో, అతను దైవభక్తిగల స్త్రీ అయిన రూతును వివాహం చేసుకున్నాడు మరియు వారు ఇప్పుడు కలిసి ప్రభువైన యేసును వెండిస్తూ ఆయనను నమ్మకంగా సేవించుచుండెను. దేవుడు తన శరీరాన్ని స్వస్థపరచడమే కాకుండా ఆత్మను కూడా రక్షించాడు. అవును, నా ప్రియులారా, శరీరాన్ని స్వస్థపరచడమే కాకుండా ఆత్మను కూడా రక్షించే యేసులో మనకు ఎంత అద్భుతమైన రక్షకుడు ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా ఈరోజే మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి మరియు ఆయన మీ కోసం అన్నిటిని నూతనంగా మారుస్తాడు. నిశ్చయముగా దేవుడు మీకు రక్షణాధారమైన ఆనంద అభిషేకమును మీకు బహుమతి ఇచ్చి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే బహుమతికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ఇప్పుడు కూడా, మేము నీ యెదుట మా పాపాలను ఒప్పుకుంటున్నాము మరియు నీ క్షమాపణ కొరకు కోరుచున్నాము. దేవా, తప్పిపోయిన కుమారుడు తన తండ్రిచేత కౌగిలించుకున్నట్లుగానే, ఈ రోజు మేము నీ చేత కౌగిలించబడునట్లుగా, మమ్మును కడిగి, పునరుద్ధరించి, మరియు నీ ప్రేమతో మమ్మును నింపుము. యేసయ్యా, మా పాపం నుండి మేము దూరంగా ఉండడానికి మరియు నీ రక్షణ ఆనందంలో మేము నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము నీపై మా పూర్తి నమ్మకాన్ని ఉంచునట్లుగాను మరియు మేము భయపడకుండా మమ్మును నీ రక్షణానందముతో నింపుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.