నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడం మరియు దేవుని వాగ్దానాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అవును, ఇట్టి వాగ్దానమును మనమందరము కలిసి స్వీకరిద్దామా? కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 6:35వ వచనమును తీసుకొనబడినది. కాబట్టి, ఆ వాగ్దానమును చూచినట్లయితే, " అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు'' అని చెప్పబడిన ప్రకారం మనము అటువంటి జీవాహారమైన యేసును నేడు మనలోనికి ఆహ్వానిద్దాము, మనము తృప్తిని పొందుకుందాము.

ఒక వ్యాపార ప్రకటనను మీకు తెలియజేయాలని కోరుచున్నాను, అది 'లేస్ చిప్స్' కొరకు ఇవ్వబడిన ప్రకటనలో ఇలా అంటుంటారు: ఒక చిప్ తినడమే సరిపోదు. మనం ఒకటి తింటూనే ఉంటాం, కానీ అది వాంఛను పూర్తిగా సంపృత్తిపరచలేదని అనిపిస్తుంది. మనము భౌతిక, లోకిక విషయాలతో మనకు తృప్తి ఇవ్వాలని ప్రయత్నించినప్పుడు, ఇది ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. ఆలాగుననే, మనం సంపద కొరకు పరుగు తీసినట్లయితే, ఎంత డబ్బు సంపాదించినా ఆ ఆంతర్యములో ఉన్న వాంఛను తీర్చలేము; అది కేవలం మరింత కోరికను మాత్రమే పెంచుతుంది. మనం భౌతిక సుఖాలను వెతుకుతూనే ఉన్నట్లయితే, అవి కూడా మనలను సంపతృప్తినిచ్చునట్లుగా ఉండవు. మనం తినే ఆహారం కూడా, దాని పట్ల మనం మితిమీరిన వ్యామోహం లేదా అత్యాశకు లోనైనప్పుడు, మన కడుపును ఎప్పటికిని పూర్తిగా సంతృప్తిపరచలేదు. కొంతమంది శరీరానికి గొప్ప ఆనందాన్ని ఇస్తాయని భావించే వాటితో కడుపు నింపుకోవడానికి తింటూనే ఉంటారు, కానీ చివరికి మరింత ఆకలితోనే వారు మిగిలిపోతారు.

కానీ, నా ప్రియులారా, ప్రభువునందు మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఇటువంటి ఆనందము మనలో నింపబడుతుంది. నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇటువంటి ఆనందమును పొందుకున్నాను. అతి చిన్న వయస్సులో నేను ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనుటకు ఎంతో వాంఛతో ప్రార్థించాను. కానీ, 13 ఏళ్ల వయసులో ప్రభువు నన్ను ఆయన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు, ఈ లోకంలో ఉన్నది ఏదియు ఇవ్వలేనంత విధంగా నా హృదయం పూర్తిగా సంతృప్తితో నింపబడినది. అయితే, మా నాన్నగారు నిర్వహించుచున్న ఒక కూటములో, మా నాన్నగారు ప్రార్థించుచున్న సమయములో, ప్రభువు నన్ను వ్యక్తిగతంగా సందర్శించి, తన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపినప్పుడు, అక్షరాల దేవుని సన్నిధితో నా హృదయం పూర్తిగా నిండిపోయింది; వర్ణించలేని ఆనందంతో నేను ఉప్పొంగి పోయాను! అంతమాత్రమే కాదు, చెప్పనశక్యము కానీ ఆనందంతో నేను నింపబడ్డాను. ఆ క్షణం తర్వాత, 3 రోజుల వరకు నాకు తినాలన్న గానీ, తాగాలన్న గానీ ఏమాత్రం నాలో ఎటువంటి కోరిక కలుగలేదు. కారణము, నేను పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ ఆనందముతో నింపబడియున్నాను. నా జీవితములో ఇంతవరకు నేను ఎన్నడును పొందుకోలేని ఆనందమును మరియు దేవుని సన్నిధిని ఆ రోజు నేను పూర్తిగా అనుభవించాను. ఆ రోజు నుండి దేవుని సన్నిధిని ఎంతగానో ఆనందించుచూ వచ్చియున్నాను. ఈనాటికిని, నేను ఆ దేవుని సాన్నిధ్యాన్ని ఆనందించుచూనే ఉన్నాను; అది నేను ఊహించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువగా నన్ను ఎల్లప్పుడూ సంతృప్తిపరచుచున్నది. హల్లెలూయా!

అందుకే, నా ప్రియులారా, ఈ రోజు నుండి దేవుడు తన స్వరాన్ని ప్రతీ ఉదయం పరిశుద్ధాత్మ ద్వారా మీకు బోధిస్తారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ నుండి ఇవ్వబడిన ప్రతి వాక్యం మీ ఆత్మను నింపుతుంది మరియు మీ లోతైన వాంఛను తీర్చి మిమ్మును తృప్తిపరుస్తుంది. "అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు'' అని సెలవిచ్చినట్లుగానే, నా ప్రియ స్నేహితులారా, ప్రతిదినము ఉదయకాలమున ఇట్టి వాక్యమును మీరు అంగీకరించినట్లయితే, ఆయన ఈ రోజు నుండి మీకు తన యొక్క ఆత్మను మీకు కొలతలేకుండా అనుగ్రహించి, తన ఆనందముతో మిమ్మును నింపుతాడు. కనుకనే, మనము ఇట్టి ధన్యతను స్వీకరిద్దామా? ఆలాగుననే, నేడు మీకు తృప్తికరమైన జీవాహారమును పొందుకొనుటకు మీ హృదయాలను యేసునకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు ఇటువంటి గొప్ప ఆనందాన్ని మరియు సంతృప్తిని అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నేడు నీవు మాతో పంచుకున్న వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడుచున్నావన్న ఆనందముతో నీవు మా హృదయాలను తృప్తిపరచుము. ప్రభువా, మాకు జీవాహారముగా ఉన్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, జీవాహారమైన నీ వాక్యమును మేము పొందుకొనునట్లుగాను మరియు ప్రతి ఉదయమున ఆ వాక్యమును మేము వినడానికిని మరియు ధ్యానించడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీవు మాకిచ్చిన వాక్యమును అనుదినము మేము చదువుచున్నప్పుడు, దానిని మా హృదయపూర్వకంగా అంగీకరించునట్లుగా చేయుము. ఇంకను ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా హృదయాలను నింపుము. తద్వారా, దేవా, గొప్ప నిరీక్షణ మరియు ఆనందము నేడు మాలో నింపబడునట్లుగా చేయుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి భయమును మా నుండి తొలగించుము. ప్రభువా, నీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మలో మమ్మును శక్తివంతులనుగా చేయుము. దేవా, మేము ఈ రోజు నీ చిత్తాన్ని జరిగించునట్లుగాను మమ్మును బలపరచుము. ప్రభువా, నీవు మాకు బోధించి, మమ్మును నడిపించుము. యేసయ్యా, నీ ప్రేమలో మేము వేరుపారునట్లు చేయుము. ప్రభువా, ఎల్లప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును కలుసు కొని, మాకు నిజమైన సంతృప్తిని దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.