నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుడు మీకు ఒక గొప్ప బహుమానమును అనుగ్రహించుచున్నాడు. ఈ లోకములోనే గొప్ప బహుమానములను ఇచ్చువాడు ఆయన మాత్రమే. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 149:4వ వచనమును మన ధ్యాననిమిత్తము తీసుకొనబడినది. ఆ వాగ్దాన వచనమేమిటో మనము నేడు చూద్దామా? "యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును'' ప్రకారం ప్రభువు దీనులను ప్రేమించుటకు సమర్థుడై యున్నాడు. ఎందుకనగా, మన వినయములోనే దేవుడు కనపరచబడతాడు. గర్వము, అహంకారము, అతిశయము, ఢాంబికము గలవారిని దేవుడు ద్వేషిస్తాడు. అటువంటి అహంకారము గలవారితో ఆయన సహవాసము కలిగి ఉండడానికి ఏ మాత్రము ఇష్టపడే దేవుడు కాడు. ఎందుకంటే, అది దేవుని స్వభావమును లేక గుణశీలతను ప్రతిబింబింపజేయదు. కనుకనే, ఎవరైతే అత్యంత సహనముగా ప్రతి పరిస్థితులలోను తమ్మును తాము తగ్గించుకొని ఉంటారో? వారి నోటి మాటలను, భాషలను, చర్యలను అదుపు ఉంచుకుంటారో? ఇది చూడడానికి మనము మన భాగాన్ని కోల్పోవునట్లుగా కనిపించవచ్చును. ఈ లోకములో ఆ పరిస్థితులో ఓడిపోతున్నట్లుగా మనము కనబడవచ్చును. అవును, నా ప్రియులారా, మనం మౌనంగా ఉన్నప్పుడు లేదా మన కోపాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడు అది ఓడిపోయే వాదనలా అనిపించవచ్చును. కానీ, అది ప్రభువు దృష్టికి అయితే నిజమైన విజయం. ఎందుకనగా, అది దీనులకు విజయముతో ఆయన కిరీటమును అలంకరింపజేస్తాడు.

ఒకసారి పరిచర్య పర్యటనలో నేను చూసిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశించుచున్నాను. నేను పరిచర్య చేయడానికి ఒక నగరానికి వెళ్లుచున్నప్పుడు, భద్రతా తనిఖీ కోసం విమానాశ్రయంలో ఉన్నాను. ఆ విమానాశ్రయంలో భద్రత ధళాల యొక్క తనిఖీ జరుగుతూ ఉంటుంది. వారు ప్రతి ఒక్కరిని తమ బ్యాగులు, గడియారాలు, బెల్టులు మరియు పర్సులు వంటి అన్ని వస్తువులను స్కానింగ్ బెల్టుపై ఉంచమని చెబుతారు కదా! నేను నా వస్తువులను ఆలాగున ఉంచి మరియు ఇతరులను గమనించడం మొదలుపెట్టాను. ఒక వ్యక్తి తన వస్తువులన్నింటిని జాగ్రత్తగా ఆ బెల్టుపై పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, మరికొందరు అతని వెనుక వరుసలో ఉన్నప్పటికిని, అతనిని దాటి, దూసుకుంటూ ముందుకు వెళ్లిపోతూ, తమ వస్తువులను ముందుగా పెడుతున్నారు. అయితే, ఈ వ్యక్తి ఎలా స్పందిస్తాడు అని నేను గమనిస్తూ ఉన్నాను.

ఈ వ్యక్తి ఎంతో సహనముగా ఉండుట చూచి, నేను ఆశ్చర్యపోయాను. అతని వెనుక నుండి వచ్చిన వారికి విరుద్ధముగా ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను ముందుగా వచ్చాను కదా, నేను మొదటగా ఉన్నాను కదా, మీకు ఎంత ధైర్యముగా ఇలాగున చేస్తారు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. అతడు నిరాంతరాయంగా అందరు ముందుకు వెళ్లుటకు అనుమతి ఇచ్చుచుండెను. కానీ, భద్రతాధళ అధికారి ఇవవ్నియు గమనించుచుండెను. అతడు నేరుగా వచ్చాడు, ఇతర ప్రజల యొక్క వస్తువులన్నిటిని తనిఖీ చేయకుండా ఆపివేశాడు. ఈ వ్యక్తి వస్తువులను తీసుకొని ముందుగా పెట్టి, మిగిలిన వారి వస్తువులను తీసుకొని వెనుక పెట్టి, వారందరిని వెనుకకు వెళ్లిపొమ్మని చెప్పాడు. చాలా హుందా తనముతో ఆ వ్యక్తిని మొదటి వరుసలోనికి తీసుకొని వెళ్లాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, తగ్గింపుగలిగియున్నవారు దేవుని చేత విజయమును బహుమానముగా అందుకుంటారు. ఆలాగుననే ఆయన మనలను కూడా గమనించుచున్నాడు. తగ్గింపు మరియు దీనత్వముతో విభిన్నమైన పరిస్థితులలో మనలను మనము ఏ విధంగా కాపు కాచుకుంటామో చూస్తాడు. ఆయన విజయము కొరకు మనము వేచి ఉండాలి, ఆయన బహుమానము కొరకు వేచి ఉండాలి, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. కనుకనే, నేడు మనము కూడా ఇటువంటి విజయమును స్వీకరిద్దామా? ఆలాగైతే, మిమ్మును మీరు తగ్గించుకొని, ఆయన హస్తాలకు మీ జీవితాలను సమర్పించుకున్నప్పుడు నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ దీనత్వమును చూచి, మిమ్మును రక్షణతో అలంకరించి దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీ ప్రజలమైన మా పట్ల నీవు ఆనందిస్తున్నందుకై మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, దీనత్వం ద్వారా వచ్చే విజయంతో మమ్మును అలంకరించుము. ప్రభువా, మా యొక్క ప్రతి పరిస్థితిలోనూ మేము ఓపికగా మరియు సహనము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా నాలుకను అదుపులో ఉంచడానికి మరియు మా చర్యలను కాపాడుకోవడానికి మాకు నేర్పుము. ప్రభువా, మా సమస్యల నుండి విడుదల పొందడానికి మేము వేచియుండునట్లుగా మాకు దీనత్వమును మరియు సహనమును నేర్పించుము. యేసయ్యా, మా జీవితంలో నీ యొక్క స్వభావాన్ని మరియు గుణశీలతను ప్రతిబింబించునట్లుగా చేయుము. ప్రభువా, మాలో ఉన్న గర్వం అంతా తొలగించి, మమ్మును వినయంతో నడుచుకొనునట్లుగా చేయుము. ప్రభువా, దీనత్వమును చూచి ఇప్పుడే నీ హస్తము చేత మాకు విజయమును కిరీటముగా ధరింపజేయుము. యేసయ్యా, ఈ వాగ్దానము ప్రకారము, మమ్మును వరుసలో ముందుకు తీసుకొని వెళ్లుము మరియు అందరికంటె మమ్మును ఉన్నతముగా ఉంచుము. దేవా, మేము దీనత్వంతో నడవడానికి మరియు నీకు లోబడి జీవించినప్పుడు నీ ప్రతిఫలం మరియు కటాక్షం మమ్మును వెంబడించునట్లుగా చేయుము. ప్రభువా, మేము దీనత్వం వహించిన ప్రతి సమయము నీవు మాలో ఆనందించుచున్నావని మేము నమ్ముచూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.