నా ప్రశస్తమైన స్నేహితులారా, నేడు మీకు విరోధముగా లేచియున్న మీ శత్రువులందరిని మీరు జయించాలని ప్రభువు మీ పట్ల వాంఛకలిగియున్నాడు. కనుకనే, మీరు జీవితములో పురోభివృద్ధిని పొందుకొనకుండా అడ్డుకునే మీ యొక్క శత్రువులనందరిని మీ నుండి తొలగించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? అని మనము చూచినట్లయితే, అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 16:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును'' ప్రకారముగా దేవుడు మీ శత్రువులను సహా మీకు సమాధానకరముగా మిత్రులనుగా చేయుచున్నాడు. కనుకనే, మీ శత్రువులను గురించి మీరు చింతించకండి.

బైబిల్‌లో మనము ఇస్సాకును చూచినట్లయితే, ఇస్సాకు జీవితములో ఇదియే జరిగినది. అక్షరాల ఇస్సాకు దేవుని ఆజ్ఞ ప్రకారము విత్తనములు వేసియున్నాడు. దేవుని ప్రణాళిక ప్రకారము అతడు బావులను త్రవ్వియున్నాడు. అంతమాత్రమే కాదు, ప్రతి దానికి అతడు దేవుని యందు నమ్మిక ఉంచియున్నాడు. కోతకాలము కొరకు దేవుని యందు మాత్రమే నమ్మికయుంచియున్నాడు. ఇంకను నీటి కోసము దేవుని యందు నిరీక్షణను కలిగియున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుడు అతనిని నూరంతలుగా ఆశీర్వదించియున్నాడు. శత్రువులు తనకు విరుద్ధముగా పోరాడుచున్నప్పటికిని, అతడు త్రవ్విన బావులను మూతవేసినప్పటికిని, చివరిగా, ఇంకను అతని శత్రువులు ఇస్సాకుతో, ' మేము నిన్ను ఆపజాలము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు,' అని చెప్పియున్నారు. అంతమాత్రమే కాదు, వారు అతనితో, ' నిన్ను ఎన్నటికిని నాశనము చేయమనియు మరియు అతడు కూడా వారిని నాశనము చేయకూడదని' ఒక నిబంధన చేసుకున్నారు. కనుకనే, నా ప్రియులారా, మీరు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన సమస్తమును మీకు జరిగిస్తాడు. ఏ నరుడు కూడా మిమ్మును ఆపలేడు.

మొట్టమొదటిగా, మనము ఎదుర్కొను శత్రువులు ఎవరు? మొదటిది, దైవీకతకు విరుద్ధముగా ఉన్న శత్రువులు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:7వ వచనములో మనము చూచినట్లయితే, "ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు'' అని చెప్పబడినట్లుగానే శరీరమునకు సంబంధించినవియు మరియు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనవి. ఇంకను బైబిల్ నుండి యాకోబు 4:4వ వచనములో చూచినట్లయితే, "వ్యభిచారిణులారా, యా లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును'' అని చెప్పబడినట్లుగానే, లోకముతో స్నేహము చేయుటకు ఎంపిక చేసుకున్నవాడు దేవునికి శత్రువగుతాడు. అవునండి, అవి లోకపరమైన భోగేచ్ఛలను, దొంగతనము, అవినీతి విధానములు ఇవన్నియు కూడా దేవునికి అసంబంధతమైనవిగా ఉంటున్నవి. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 1:21వ వచనములో చూచినట్లయితే, "మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియల వలన మీ మనస్సులో విరోధ భావముగలవారునై యుండిన మిమ్మును కూడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను'' అని చెప్పబడినట్లుగానే, మీ మనస్సులలో మీరు శత్రువుల వలె ఉండియున్నారు. ఎందుకనగా, మీరు చెడ్డ స్వభావమును అనుసరించియున్నారు. అయితే, ఈ రోజున మన దృష్టిని దేవుని వైపు మరల్చియుండగా, దేవునికి సంతోమును కలిగించే జీవితమును జీవించుచుండగా, పరిశుద్ధత కొరకు బతిమాలుకొనుచుండగా, పరిశుద్ధతగా నడుచుట కొరకు మరియు దేవుని సంతోషపరచే మార్గములో నడుచుట కొరకై పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగివస్తాడు. మన మార్గములను మారుస్తాడు మరియు మనకు బలమును అనుగ్రహిస్తాడు. ఇంకను దైవీకతను శత్రువుగా మరియు దేవునికి విరోధముగా ఉన్నటువంటి దానిని మనలను విడిచిపెట్టి పోవునట్లుగా చేయుచున్నాడు. ఆయన మన జీవితములో దైవీకతను పంపించుచున్నాడు. దైవభక్తి ఈ లోకమునకు మరియు రాబోవు లోకమునకు కూడా సంతుష్ఠిదాయకమైనదిగా ఉంటున్నది. దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక.

రెండవదిగా, క్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా ఉన్నారు. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 3:18,19వ వచనములలో చూచినట్లయితే, "అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటియందే మనస్సు నుంచుచున్నారు '' అని చెప్పబడిన ప్రకారముగా, అవును, భూసంబంధమైన వాటి మీద మనస్సు ఉంచువారు, ఇట్టివారు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. ఎల్లవేళల వారి కడుపును, ఆకలిని సంతృప్తిపరచుకోవడమే చూస్తుంటారు. తమ యోచనలను దేవుని ప్రజల మీద మోపుచూ ఉంటారు. ప్రకృతికి అతీతమైన దైవశక్తిని వారు తాళలేరు. యేసుక్రీస్తు జరిగించుచున్న అద్భుత కార్యములను వారు తట్టుకోలేరు. యేసు ఒక వ్యక్తి జీవితములో అనుగ్రహించు రూపాంతరపరచడానికి ఇచ్చు రక్షణను వారు తాళలేరు. యేసు తన ప్రజలకు తన దయను బట్టి అనుగ్రహించు ఐశ్వర్యమును, సంపదను, వర్థిల్లతను వారు తట్టుకోలేరు. వారి మనస్సు ఎప్పుడు కూడా లంచముల మీదనే ఉంటుంది. వారి మనస్సు ఎళ్లవేళల కూడా ఇతరులను నాశనము చేసి, ఉన్నతమైన అధికారమునకు రావాలనే తలంపులతోనే ఉంటుంది. కానీ, దేవుడు ఆ రీతిగా పని చేయడు. యేసు ఎల్లవేళల తనను తాను తగ్గించుకొని, యేసు ఇచ్చు వర్తమాన సంబంధమైన పవిత్రను బట్టి, యేసుతో అనుసంధానమై ఉండువారిచేత పనిచేయుటకు ఇష్టపడుచున్నాడు. ఇతరులకు క్షమించువారిని యేసు ప్రభువు ఆశీర్వదించుచున్నాడు. వారి అక్కరలలో ఇచ్చువారిని యేసు ప్రభువు ఆశీర్వదించుచున్నాడు. ఆ తర్వాత, వారిని వర్థిల్లింపజేయుచున్నాడు. దీనిని లోకము అంగీకరించలేదు. ఎల్లవేళల కూడా దోచుకోవడము, చంపుకోవడము, మరియు దాని ద్వారా బ్రతకడము మాత్రమే చూస్తుంటారు. వారు సిలువకు శత్రువులుగా ఉంటారు. క్రీస్తు యొక్క శ్రమలు సకల ఆశీర్వాదములను తీసుకొనివచ్చును. యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగమును బట్టి వచ్చు ఆశీర్వాదములకు సంబంధించిన మర్మమును వారు ఎరుగనివారుగా ఉంటారు. వారు శత్రువులైనవారైయినప్పటికిని, అట్టి శత్రువుల మీదికి అధికారమును అనుగ్రహించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనలను మరి ఎక్కువగా యేసు సిలువ త్యాగము ద్వారా ఆశీర్వదించుచున్నాడు. యేసు సిలువ త్యాగమును అంగీకరించి, ఆయన సిలువ త్యాగము ద్వారా దీవించుచూ, ఇతర ప్రజల ఆశీర్వాదము కొరకు మన జీవితమును త్యాగము చేయుచుండగా, అప్పుడు అందరు మనము దేవుని బిడ్డలమని గుర్తెరుగుతారు. వారు మనతో సమాధానముగా ఉంటారు.

చివరిగా శత్రువులు, దేవుని యొక్క పనిని నిర్వర్తించడానికి విరుద్ధముగా నడుచుకొను శత్రువులు. వారు యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన ఇస్కారియోతు యూదా. అందుకే బైబిల్ నుండి యోహాను సువార్త 13:2వ వచనములో చూచినట్లయితే, "వారు భోజనము చేయు చుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక'' అని చెప్పబడినట్లుగానే, యేసును అప్పగించడానికి సాతాను అతని చెవులలో మాట్లాడుచుండెను. యేసు యొక్క పనిని ఆపుచేయుట కొరకు మాత్రమే. అయితే, యూదా అపవాది మాటలు వినెను.అందుకే బైబిల్ నుండి యోహాను సువార్త 13:26,27వ వచనములలో చూచినట్లయితే, " అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను'' అని చెప్పబడినట్లుగానే, యూదా ఆ రొట్టె ముక్కను యేసు చేతిలో నుండి పుచ్చుకొనగానే, యూదాలోనికి సాతాను ప్రవేశించెను. ఆయనను అప్పగించడానికి అతనిని తీసుకొని వెళ్లెను. నా ప్రియ స్నేహితులారా, అతడు యేసును అప్పగించినప్పుడు, ఆయన పనిని చేయకుండా, ఆటంకపరచినప్పుడు, చివరిగా అతడు ఆత్మ హత్యను చేసుకున్నాడు. కానీ, యేసు పని ఎన్నటికి ఆపుచేయబడలేదు. ఏ యూదా ఆయనను ఆపలేడు. యేసుతో కూడా ఉన్నవారు ఆయనను పట్టించినవారు, దేవుని పనిని ఆపుచేయలేకపోయారు. కేవలము యూదానే ఉరి పెట్టుకొని తనకు తానే చనిపోయాడు. కానీ, సిలువలో తన ప్రాణము పెట్టిన తర్వాత, యేసు తిరిగి లేచియున్నాడు మరియు ఆయన నేటికిని సజీవముగా మన మధ్యలో ఉన్నాడు. అవును, ప్రతి ఒక్కరు యేసుతో కూడా సమాధానపరచబడ్డారు. యేసును సిలువ వేసిన వారు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పియున్నారు. ఈలాగున మీకును సంభవించును. ఏ శత్రువు దేవుడు మీకు ఇచ్చిన పనిని ఆపుచేయలేరు. పట్టించేవారిని గురించి భయపడకండి, వారిని నా స్నేహితులారా, పిలువడము కొనసాగించండి, మీరు దేవుని చిత్తమును జరిగించుచూ, ముందుకు కొనసాగండి. పట్టించడము వంటి కార్యములు నాశనము చేయబడతాయి. కానీ, మీరు దేవుని చిత్తమును నెరవేరుస్తారు. దేవుడు తన పునరుత్థానపు శక్తి ద్వారా ప్రజలందరి యెదుట మిమ్మును ఘనపరుస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీ జీవితమును యేసు హస్తములకు అప్పగించి, మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునట్లుగా చేసినట్లయితే, ఆయన మీ శత్రువులను సహా మీకు మిత్రులనుగా చేసి, నిశ్చయముగా మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా యొక్క శత్రువు మీద మాకు విజయం ఇస్తానన్న నీ వాగ్దానమునకై నీకు వందనములు. దేవా, నీకు ప్రీతికరమైన జీవితమును గడపడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము పరిశుద్ధతలో నడుచుకోవడానికి మరియు మమ్మును బాధపెట్టిన వారిని క్షమించడానికి మమ్మును నీ కృపతో బలపరచుము. దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మా అడుగులను నడిపించి, ప్రతి దుష్ట ప్రణాళిక నుండి మమ్మును కాపాడుము. ప్రభువా, సిలువ శక్తి ద్వారా మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, అనేకమంది శత్రువులకన్న నీవు గొప్పవాడవు కనుకనే, వీటన్నిటి మధ్యలో నిరంతరాయముగా మేము నీ చిత్తమును జరిగించుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు మాకు విరోధముగా లేచు శత్రువులను, పరిస్థితుల నుండి మమ్మును విడిపించుము. దేవా, మమ్మును అప్పగించువారి యెదుటనే, మేము నీ చిత్తమును జరిగించుటకును మరియు నీ పనిని నిర్వర్తించడానికి మాకు కావలసిన బలమును అనుగ్రహించుము. యేసయ్యా, నీ యొక్క సిలువ నుంచి వచ్చు ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించుము. దేవా, మేము ఇస్సాకు వలె ప్రతిఫలించునట్లుగా మమ్మును నీవు మార్చి, ప్రతి ఒక్కరు మేము నీ బిడ్డలము అని గుర్తెరుగునట్లుగా మాకు అటువంటి గొప్ప ధన్యతను మరియు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.