నా ప్రియ స్నేహితులారా,ఈ రోజు నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 44:5 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఈ అద్భుతమైన వచనములో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, " నీ వలన మా విరోధులను అణచి వేయుదుము నీ నామము వలననే, మా మీదికి లేచు వారిని మేము త్రొక్కి వేయుదుము'' ప్రకారం నిజమైన విజయం మానవ బలం, ఆయుధాలు లేదా జ్ఞానం నుండి రాదు, కానీ దేవుని శక్తి ద్వారా మాత్రమే అని కీర్తనాకారుడు మనకు గుర్తు చేయుచున్నాడు. అందుకే కీర్తనలు 44:6-8వ వచనములలో చూచినట్లయితే, "నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడు చున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము'' అని వ్రాయబడిన ప్రకారం శత్రువులు మీకు విరోధముగా ఎదురైనప్పుడు, మీ స్వంత బలముతో వారితో పోరాడవలెనని ఎప్పుడు మీరు ప్రయత్నించకూడదు. అంతమాత్రమేకాదు, మీ స్వంత శక్తి యందు మీరు నమ్మకముంచకూడదు. దేవుని శక్తి యందు మాత్రమే మీరు నమ్మకముంచాలి. శత్రువులు మిమ్మును అణగద్రొక్కి, అణిచివేయాలని ప్రయత్నించవచ్చును. అయితే, గర్వమునకు చోటివ్వకండి, 'వారు వచ్చి నన్ను ఎలా అణగద్రొక్కుతారు' అని పోరాడకండి. అయితే, మనము చేయవలసిన పని ఒక్కటే, కేవలం దేవుని స్తుతించడము మాత్రమే. అందుకే,"దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము'' అని కీర్తనాకారుడైన దావీదు ఇక్కడ అంటున్నాడు. దావీదు దేవుని నామము వలననే, గొల్యాతును ఎదిరించి, జయించియున్నాడు. గొల్యాతును చూచి, ' దేవుని నామములో నీకు విరోధముగా నీ మీదికి వచ్చుచున్నాను ' అని మాత్రమే దావీదు చెప్పాడు. అవును, నా ప్రియులారా, దావీదు వలె మనం కూడా దేవుని శక్తిని ప్రకటించడం ద్వారా మరియు ఆయన పరిశుద్ధ నామమును స్తుతించడం ద్వారా ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనగలము. అప్పుడు, నిశ్చయముగా, విజయము మన స్వంతం అవుతుంది.

నా ప్రియులారా, లేఖనముల యందంతటా, ఆపత్కాలంలో దేవుని యందు భయభక్తులు ఉంచిన స్త్రీ, పురుషులు ప్రభువు వైపు తిరిగి మొఱ్ఱపెట్టడం మనం చూడగలము. ఆలాగుననే, దావీదు తరచుగా దేవునికి ఇలాగున మొరపెట్టాడు అని బైబిల్ నుండి కీర్తనలు 57:2వ వచనమును చూచినట్లయితే, "మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱపెట్టుచున్నాను'' అని దావీదు తరచుగా దేవునికి ప్రార్థించాడు. ఆలాగుననే, కీర్తనలు 138:8 వ వచనములో కూడా, "యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము'' అని దావీదు చెబుతున్నాడు. అతడు రధములపై నమ్మిక యుంచలేదు. కానీ, ప్రభువు యందు మాత్రమే నమ్మిక యుంచియున్నాడు. తన శత్రువులపైన తాను స్వంతగా ఎటువంటి పగతీర్చుకొనలేదు. అయితే, ప్రభువే అతని యొక్క శత్రువులందరిని నశింపజేశాడు. దావీదు ప్రభువు యెదుట ఎంతో దీనుడిగా జీవించాడు. దావీదు యొద్దకు ఎప్పుడు శత్రువులు ఎదురొచ్చిన కూడా అతడు ప్రభువు యొద్దకు వెళ్లి మొఱ్ఱపెట్టుకునేవాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 12:19వ వచనములో చూచినట్లయితే, "ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది'' అని పౌలు భక్తుడు తెలియజేసియున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మీ శత్రువుల పట్ల మీరు పగతీర్చుకొనకండి. దానికి బదులుగా, దేవుని ఉగ్రతకు మీరు చోటివ్వండి. మరియు యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము నశింపజేస్తాము అని హిజ్కియా రాజును అష్షూరీయుల రాజు బెదిరించినప్పుడు, మానవ సహాయం కోసం అతడు పరుగెత్తలేదు, కానీ కేవలము రాజు దేవుని వైపు మరలి ప్రార్థించాడు. ప్రార్థనలో మాత్రమే అతని సమస్యలన్నిటిని ప్రభువు యొద్దకు తీసుకొని వెళ్లాడు. కనుకనే, ప్రభువే అతని పక్షమున ఉండి, యుద్ధము చేసి, వారి యొక్క శత్రువులను సిగ్గుపరచాడు. నేడు మనము కూడా ఆలాగుననే చేసినట్లయితే, ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తాడు. అప్పుడు మన యొక్క శత్రువులను ప్రభువే సిగ్గుపరుస్తాడు. బైబిల్ నుండి 2 రాజులు 19:34వ వచనములో రాజైన హిజ్కియాతో ప్రభువు ఈ విధంగా సెలవిచ్చియున్నాడు. అతడు ప్రార్థించిన తర్వాత, 'నేను ఈ పట్టణమును కాపాడుతాను' అని వాగ్దానము చేశాడు. ఆలాగుననే, "నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును'' అని ప్రభువు వాగ్దానము చేసినట్లుగానే, ఆయన తన సేవకుడైన దావీదు నిమిత్తము ఆ పట్టణమును కాపాడెను. అవును, మీరు కూడా ప్రభువుకు మొఱ్ఱపెట్టి, ఆయన యొద్ద మీరు ప్రార్థించినప్పుడు, దావీదు వలె ఆయన మిమ్మును కూడా కాపాడుతాడు.

నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే కీర్తనాకారుడైన దావీదు, కీర్తనలు 16:8వ వచనములో ఈలాగున చెబుతున్నాడు, "సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' ప్రకారం సదాకాలము యెహోవా యందు మీ గురి నిలుపండి. అప్పుడు ప్రభువు మీ కుడిపార్శ్వమున నిలిచి, మిమ్మును కాపాడుతాడు నా ప్రియ స్నేహితులారా. ఎప్పుడు కూడా మీ శత్రువులపై మీరే పగతీర్చుకోవాలి అని ప్రయత్నించకండి. దేవుని ఉగ్రతకు మీరు చోటివ్వండి. ఆలాగుననే, మీ శత్రువులను గురించి మీరు ప్రార్థన మాత్రము చేయండి. అప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితము దేవునికి ప్రీతికరముగా ఉన్నట్లయితే, ప్రభువు ఆ వ్యక్తి యొక్క శత్రువులను కూడా మిత్రులనుగా మార్చగలదని వాక్యము సెలవిచ్చుచున్నది. అదేవిధంగా, నేడు దుష్టులు మీపైన తీసుకొని వస్తున్న అణిచివేతలను మీరు చూచి ఎంతగానో విలపిస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి, నిరాశ చెందకండి, నా ప్రియ స్నేహితులారా, మీ ప్రతి సమస్యను ఆయన యొద్ద తీసుకొని వచ్చి, ఆయన వైపు తిరగండి, అప్పుడు మీ నిమిత్తము ప్రభువు మిమ్మును కాపాడుతాడు. తన నామముననే ఆయనే మిమ్మును రక్షిస్తాడు. ప్రభువు మీ పక్షమున యుద్ధము చేసి, మీకు విజయము నిచ్చి, నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా శత్రువులను మా వెనుకకు నెట్టివేయు దేవుడవు నీవే మరియు మా శత్రువులకు అవమానము తీసుకొని వచ్చి, సిగ్గుపరచు దేవుడవు నీవే. ఇంకను మా పక్షమున యుద్ధము చేయు దేవుడవు నీవేనయ్యా. కనుకనే ప్రభువా, మాకు రక్షణకేడెముగా ఉంటూ, మా పక్షమున పోరాడి, మేము బలహీనంగా ఉన్న చోట మాకు విజయం అనుగ్రహించుము. దేవా, మమ్మును కలవరపెట్టుచున్న ప్రతి కెరటమును నిమ్మళింపజేసి, మా కుటుంబానికి సమాధానమును కలుగజేయుము. ప్రభువా, అణిచివేతకు గురియగుచున్న మమ్మును నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. దేవా, మా సమస్యలను చెప్పుకోవడానికి మా కుటుంబములో ఎవ్వరు లేరయ్యా, మేము ఒంటరిగా ఉన్నాము. కనుకనే దేవా, నీవే మా కుడిపార్శ్వమున నిలిచి, మా పక్షమున యుద్ధము చేసి, మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మా కోర్టు కేసులో నీవే మా పక్షమున యుద్ధము చేసి, మాకు న్యాయమును తీర్చును. యేసయ్యా, మా శత్రువుల పక్షమున మేము పగ తీర్చుకొనకుండా, మా పట్ల న్యాయము తీర్చుటకు మేము నీకు చోటిచ్చుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, మా పక్షమున పోరాడి, మా శత్రువులను సహా మాకు మిత్రులనుగా చేయుమని యేసు క్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.