నాకు అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 3:20 వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "మనలో కార్యసాధక మైన తన శక్తిచొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్ని టికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి సోత్త్రము'' అని వ్రాయబడిన ప్రకారము అవును, నా స్నేహితులారా, దేవుని అడగండి. ఈ లోకములో మీరు అనేకమైన అవసరతలను కలిగియుండవచ్చును? ఏదైనా ఒక అవసరతను గురించి మీరు ఎంతగానో చింతించుచుండవచ్చునేమో? అయితే, దేవుని వాక్యమును చదవండి. దేవుని వాగ్దానములను హత్తుకొనండి. అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 16:9వ వచనములో చూచినట్లయితే, "తన యెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యా విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును'' అని దేవుని వాక్యములో చెప్పబడినట్లుగానే, ప్రియ స్నేహితులారా, మీ హృదయము ఏవిధంగా ఉన్నది? యథార్థ హృదయమును మీరు కలిగియున్నారా? దేవుడు మీ అవసరతలన్నిటిని తీర్చగలడు అని మీరు నమ్ముచున్నారా? ఆలాగైతే, మీరు దేవుని శక్తితో నింపబడినప్పుడు, నిశ్చయముగా, దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు.

నా ప్రియులారా, అయితే, ఇప్పుడే, మీరు దేవుని శక్తితో నింపబడాలని కోరుకొనండి. అప్పుడు, ప్రభువు తన శక్తి ద్వారా మీ అవసరతలన్నిటిని తీర్చగలుగుతాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 62:11వ వచనములో చూచినట్లయితే, "బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను'' అని చెప్పబడినట్లుగానే, బలము యెహోవాకు చెందినది. అందుకే ప్రభువు పాదముల చెంత వేచియుండి, దేవుని యొక్క గొప్ప శక్తివంతుడైన పరిశుద్ధాత్మతో నింపమని అడగండి. అప్పుడు మీరు ప్రభువునందు బలమునొందెదరు. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 1:11వ వచనములో చూచినట్లయితే, "ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు'' చెప్పబడినట్లుగానే, పూర్ణ బలముతో మిమ్మును బలపరుస్తాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఇటువంటి శక్తితో మీరు నింపబడవలెనని ప్రభువును వేడుకొనండి. దేవుని శక్తితో మీరు నింపబడినప్పుడు, ఆయన యొక్క ఆశీర్వాదములన్నిటితో మిమ్మును నింపుతాడు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 6:14వ వచనములో చూచినట్లయితే, "దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తి వలన లేపును'' అని చెప్పబడిన ప్రకారము మీరు దేవుని శక్తితో నింపబడినప్పుడు, మీరు ఆయనతో కూడా లేపబడతారు.

నా ప్రియులారా, మీరు దేవుని శక్తితో నింపబడినప్పుడు ప్రభువు యెదుట మీరు ఏయే కార్యములైతే చేయాలనుకున్నారో? అవన్నియు మీరు చేయగలుగుతారు. మీరు ఇక ఎల్లప్పుడు కన్నీరు చిందించుచూ ఉండనక్కరలేదు. అందుకు బదులుగా పరిశుద్ధాత్మ యొక్క ఆనందముతో మీరు నింపబడతారు. స్నేహితులారా, ప్రభువు మీ హృదయమును బలపరుస్తాడు. అంతమాత్రమే కాదు, మీ యొక్క ప్రతి భారమును తొలగిస్తాడు మరియు తన దివ్యశక్తి ద్వారా మిమ్మును విజయవంతులనుగా చేస్తాడు. కాబట్టి, ఆయన సన్నిధిలో నిరీక్షించండి, ఆయన వాగ్దానములను విశ్వసించండి మరియు అటువంటి ఆనందభరితమైన అనుభవంతో మిమ్మును నింపమని ప్రభువును వేడుకొనండి. నిశ్చయంగా, మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయగల దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా అందరి యెడల నీవు కలిగియున్న ప్రేమ కొరకై నీకు వందనములు. దేవా, అడుగుడి మీకియ్యబడును అని పరిశుద్ధాత్మ కొరకై చేసిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. ప్రభువా, నిన్ను అడగడానికి మాకు దప్పికను కలుగజేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపి, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి, మమ్మును సరైన మార్గములో నడిపించి, ఎల్లవేళల నీ యొక్క ఆనందమును మాకు దయచేసి, మా కుటుంబమును ఆశీర్వదించుము. ప్రభువా, నీ సన్నిధి ద్వారా మాలో విశ్వాసముగల హృదయమును సృష్టించుము. దేవా, బలహీన త మరియు అవసరత సమయములలో కూడా నీ వాగ్దానములను నమ్మడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం నుండి ప్రతి సందేహమును, భయమును మరియు బాధలను తొలగించుము. దేవా, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, నీ అద్భుతమైన శక్తితో మమ్మును బలపరచుము. ప్రభువా, నీ పాదముల చెంత సంతోషముతో, విశ్వాసముతో ఓర్పుతో వేచియుండుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మేము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా, సమృద్ధిగా చేయుము. దేవా, నీ అద్భుతమైన శక్తితో మమ్మును హెచ్చించి, విజయములోనికి నడిపించుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.