నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహా కృపను బట్టి నేడు ఒక అద్భుతమైన వాగ్దానమును మనము బైబిల్ నుండి లేవీయకాండము 26:13వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మిమ్మును విడిపించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ప్రభువు తన ప్రజలకు ఒక విషయాన్ని గుర్తు చేయుచున్నాడు: మనము మోయుచున్న ప్రతి భారము మరియు బంధకముల నుండి మనలను దేవుడు నేడు విడిపించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 2:20వ వచనమును చూచినట్లయితే, " పూర్వ కాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మన బంధకములను తెంపివేసి మనలను విడిపించాలని మన పట్ల కోరుచున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి లేవీయకాండము 26:13వ వచనమును చూచినట్లయితే, " మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని'' అని ఇశ్రాయేలీయులతో ప్రభువు సెలవిచ్చినట్లుగానే, మనలను దాసులనుగా కాకుండా మనలను స్వతంత్రులనుగా చేయాలని మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, దేవుడు తన పిల్లలైన మిమ్మును విడిపించి, మీ ఘనతను పునరుద్ధరించడము మీ పట్ల దేవుని హృదయ వాంఛయై యున్నది.

కనుకనే, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు అనేక శ్రమలను ఎదుర్కొంటూ, కాడిలాంటి బరువులను మోయుచున్నారేమో? చింతలను మరియు వేదనలను మీరు భరించుచున్నారేమో? మీరు బంధకములను భరించుచున్నారేమో? మీ హృదయములో ఆందోళనలు, భయములు, నిరాశలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు లేదా మానసిక వేదనతో కూడిన కాడిని మీరు భారముతో మోయుచుండవచ్చును. అయితే, ప్రభువు ఈలాగున అంటున్నాడు, " నా బిడ్డా, మీ యొక్క ప్రతి కాడి నుండి నేను మిమ్మును విడుదల చేయుదును.'' ఆయనకు ఏ సమస్య కూడా గొప్పది కాదు కానీ. ఆయన మహా శక్తికి ఎటువంటి కాడి కూడా అతి శక్తివంతమైనది కాదు.

అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 15:9-10వ వచనములలో చూచినట్లయితే, "వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు?'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని బిడ్డగా మారిపోవాలి. మీ విశ్వాసమంతయు యేసుక్రీస్తు మీద ఉంచవలెను. అప్పుడు మీ జీవితములో ఈ వాగ్దానములన్నియు నెరవేర్చబడతాయి. దేవుడు ప్రజల మధ్య ఎలాంటి భేదమును చూపడు, కానీ విశ్వాసం ద్వారా హృదయాలను పరిశుద్ధపరుస్తాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి రక్షణ, విడుదల లభించును. కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తుపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం ద్వారా మీరు దేవుని బిడ్డగా మారవలెను. మీరు ఆయనను విశ్వసించినప్పు డు, ఆయన వాగ్దానములు మీరు మీ సొంతము చేసుకుంటారు.

అవును, నా ప్రియ స్నేహితులారా, యేసయ్యా, మన భారములన్నిటిని మరియు మన బరువులన్నిటిని కూడా ఆయన సిలువపైన మోసియున్నాడు అని నమ్మాలి. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు భక్తులు చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు సిలువ వేయబడినట్లుగానే, మీరు కూడా ఆయనవలె సిలువవేయబడవలెను. అప్పుడు మీరు మీ హృదయ వేదన నుండి భారములన్నిటి నుండి మీరు విడుదల నొందుతారు. కనుకనే, మీరు దేనిని గురించి చింతించకండి. క్రీస్తు మరణం మరియు పునరుత్థానంతో మిమ్మును మీరు ఐక్యపరచుకున్నప్పుడు, మీ జీవితం మీద పాపం, భయము, బంధకము మరియు ప్రతివిధమైన కాడి యొక్క పలుపులు తెగిపోవుచున్నవి. ఇకపై మీరు మీ గతము లేదా ప్రస్తుత పోరాటముల భారము క్రింద జీవించవలసిన అవసరం లేదు.

నా ప్రియులారా, ఇప్పుడు మనము ప్రార్థించబోవుచున్నాము. మీ యొక్క సమస్యలన్నిటిని మరియు జీవితములోని బాధలన్నిటిని కూడా విడిచిపెట్టబడబోవుచున్నాము. ఇప్పుడే మీరు అద్భుత రీతిగా విడుదల పొందబోవుచున్నారు. మనము కలిసి ప్రార్థించుకొని, అటువంటి విడుదలను పొందుకొని అనుభవించెదము. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, దేనిని గూర్చియు చింతించకండి. మీ యొక్క ప్రతి భారమును ప్రార్థనలో ప్రభువు సన్నిధికి తీసుకురండి. మీ ప్రతి వేదనను, ప్రతి చింతను మరియు అసాధ్యమైన ప్రతి పరిస్థితిని ఆయన ప్రేమగల హస్తములకు అప్పగించినప్పుడు, ఇశ్రాయేలీయుల మీద ఉన్న కాడి పలుపులను తెంపిన దేవుడు, నేడు మీ జీవితంలోని ప్రతి కాడి పలుపులను తెంపుచున్నాడు. నా ప్రియులారా, మీ కాడి పలుపులను తెంపి, మీ బంధకముల నుండి మిమ్మును విడిపించి, బలపరచి, మిమ్మును నిలువుగా నడవజేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా కొరకు నీవు సమస్తమును చేయబోవుచున్నందుకు నీవు ఇచ్చిన వాగ్దానములను బట్టి నీకు వందనములు. యేసయ్యా, మా జీవితములో ఉన్న సమస్యలన్నిటిని నీవు సిలువ మీద వేసికొనియున్నావు, అందును బట్టి, నీకు వందనములు. దేవా, మా యొక్క మొఱ్ఱలను మరియు సమస్యలను ఆలకించుము. ప్రభువా, నీ యొక్క శక్తి ద్వారా మేము విడుదల పొందుకొనునట్లుగా చేయుము. దేవా, ఈ రోజు మా యొక్క ప్రతి చింతను, భయమును, హృదయ వేదనను, అనారోగ్యమును, ఆర్థిక భారమును మరియు మమ్మును బంధించిన ప్రతి సంకెళ్ళను నీకు అప్పగించుచున్నాము. యేసయ్యా, నీ యొక్క అద్భుతమైన శక్తితో మా కాడిని విరిచి, నీవు వాగ్దానము ప్రకారము నిలువుగా నడుచుటకు మాకు శక్తినిమ్ము. దేవా, విశ్వాసం ద్వారా మా హృదయమును పరిశుద్ధపరచి, నిన్ను పూర్తిగా నమ్మునట్లుగా మాకు కృపనిమ్ము. ప్రభువా, మా యొక్క భయమునకు బదులుగా ధైర్యంతోను, ఆందోళనకు బదులుగా సమాధానముతోను మరియు నిరాశకు బదులుగా నిరీక్షణతో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క బలమైన హస్తం మామీదను, మా కుటుంబము మీదను ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, మా యొక్క ప్రతి ఒత్తిడిచేత నుండి మమ్మును విడిపించి, ఈ లోకమును జయించు విశ్వాసమును మాకు దయచేయుము. దేవా, నీకు మొఱ్ఱపెట్టుచున్న మా మీద నీ యొక్క బలమైన హస్తమును ఉంచుము. ప్రభువా, నీ మీద మా కనికరమును చూపించి, మమ్మును విడుదల చేసి, సమృద్ధిగా మేము దీవించబడునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.