నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 28:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు'' అని తెలియజేయబడియున్నది. దేవుడు మీకు స్వాస్థ్యమును అనుగ్రహించవలెనని నేడు మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ మీరు ఆశ్చర్యపోవుచున్నారేమో? ఈ లోకములో నాకు స్వాస్థ్యము ఏ రీతిగా అనుగ్రహించబడుతుంది, నాకు స్వాస్థ్యము ఇచ్చేవారు ఎవరు కూడా లేరు కదా అని అన్నట్టుగా మీరు అనుకుంటున్నారేమో, నా యొక్క తల్లిదండ్రులకు చాలినంత ధనము లేదు, నాకు స్వాస్థ్యము ఇవ్వడానికి కదా, ఏ బంధువు నా గురించి ఆలోచన చేయరు కదా! అటువంటి నాకు స్వాస్థ్య సంపద ఎలాగున వస్తుంది అని అనుకుంటున్నారేమో? భయపడకండి. దేవుని యొక్క వాక్యము ఇలాగున చెబుతుంది, యెషయా 58:14వ వచనములో చూచినట్లయితే, "నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే'' అని చెప్పబడిన ప్రకారము అవును, యేసు క్రీస్తు సిలువలో త్యాగము చేసియున్నాడు గనుకనే, నేడు మనము స్వాస్థ్యమును కలిగియున్నాము. అవును, నేడు యేసు యొక్క స్వాస్థ్యము మీ మీదికి వచ్చును. తాను మనకు అనుగ్రహించిన స్వాస్థ్యమును ఆయన మరల తీసుకొనడు. యేసు యొక్క స్వాస్థ్యము ఆయన దాచిపెట్టినది కాదు; అది ఆయన తన పిల్లలకు సంపూర్ణంగా ఇచ్చే ఒక బహుమానము.

నా ప్రియులారా, ఈ స్వాస్థ్యము ఎవరు పొందుకుంటారు? ఆయనను తండ్రిగా మరియు ప్రభువుగా స్వీకరించువారికి ఆయన స్వాస్థ్యమును అనుగ్రహించువాడై యున్నాడు. తమ జీవితాలను ఆయనకు సమర్పించుకొన్న వారికి, ఆయన రక్తముతో తమను కడగమని చెప్పి ప్రార్థించువారికి, దేవుని యొక్క ఆత్మను స్వీకరించువారికి, అటువంటి వారికి తన స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించును. మీరు యేసు యొద్ద నుంచి, యేసు యొక్క స్వాస్థ్యమును పొంది మీరు స్వాస్థ్యమును కలిగియుండవచ్చును. కనుకనే, మీ జీవితములను యేసు హస్తములకు అప్పగించండి. ఆయన మీకు సమస్తమును అనుగ్రహించువాడై యున్నాడు. ఆయన తన స్వాస్థ్యమును మీకు అనుగ్రహించును. మహా అద్భుతమైన రీతిలో మీరు వర్థిల్లతను పొందెదరు.

లోనావాలా నుండి సహోదరుడు సతీష్ రావు దీనిని ధృవీకరిస్తూ తన అద్భుత సాక్ష్యాన్ని ఈలాగున పంచుకున్నారు. అతడు పట్టభత్రుడైన తర్వాత కంప్యూటర్ శిక్షణా వ్యాపారమును ప్రారంభించాడు. తాను వ్యాపారము చేయుటకు బ్యాంకు నుండి అప్పుగా లోన్ తీసుకున్నాడు. వ్యాపారము చాలా వేగవంతముగా పెరిగినది. అతడు లాభాలు పొందుకున్నాడు. కానీ, కోవిడ్ ప్రారంభమైనప్పుడు వ్యాపారమంతయు మూతవేయబడినది. చాలా పెద్ద నష్టాలు వచ్చాయి. కోవిడ్ -90 వచ్చిన తర్వాత, అతడు తన వ్యాపారమును మరల ప్రారంభించాడు. అది ఎంతగానో ఇబ్బందుల ద్వారా ప్రయాణించవలసి వచ్చినది. ఆ తర్వాత సహోదరి లక్ష్మితో అతనికి వివాహము జరిగినది. ఆమె కూడా వ్యాపారములో అతనితో కూడా ఎంతగానో సహకరించారు. కానీ, ఋణములన్నియు కూడా పెరిగిపోయాయి. బ్యాంకువారు తిరిగి చెల్లించవలసినదిగా వారి వెంట పడుతున్నట్టుగా ఉండిరి. అప్పుడు తన భార్యకు ఒక కల రావడము జరిగినది. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నట్లుగాను, ఆమె తన కలలో నన్ను చూచెను. వారు విశ్వాసముంచి, బేతెస్ద కేంద్రమునకు టికెట్ట్ బుక్ చేసుకొని అక్కడకు రావడము జరిగినది. జనవరి 12వ తేదీన వారి యొక్క మొట్టమొదటి వివాహ వార్షికోత్సవం. యేసుతో మరియు మాతోను వారు వేడుక జరుపుకోవాలని వారు అక్కడకు వచ్చారు. జనవరి 15వ తేదీన నన్ను వ్యక్తిగతంగా కలుసుకోవడం జరిగినది. నేను మరియు నా భార్య ఇవాంజెలిన్, ఇద్దరము కలిసి వారి మీద చేతులుంచి, దేవుడు వారి యొక్క ఆర్థిక సమస్యల నుండి వారిని విడిపించాలని ప్రార్థించడము జరిగినది. వారు తిరిగి వెళ్లి ఒక నూతనమైన పాఠశాలను ప్రారంభించడము జరిగినది. వారు సూపర్ కిడ్స్ ప్రీ-ప్రైమరీ స్కూల్ అనే కొత్త పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడము జరిగినది. అంతమాత్రమే కాదు, రెండు సంవత్సరాలలో వారి యొక్క ఋణములన్నియు తీర్చబడినవి. ఈ రోజున వారి యొక్క రెండు వ్యాపారములు కూడా వర్థిల్లత పొంది యున్నాయి. వారి యొక్క ఆర్థిక సమస్యలన్నియు వారి నుండి తొలగిపోయినవి. వందనాలు యేసయ్యా.

నా ప్రియులారా, నిశ్చయముగా, నేడు మీరు నిలుపుకొనగలిగి ఉండే స్వాస్థ్య సంపదను ఆయన మీకు అనుగ్రహించి, మిమ్మును ఆశీర్వాదిస్తాడు. కనుకనే, మీకు ఆలాగున జరగాలంటే, మీరు దేవుని పట్ల యథార్థంగా జీవించినట్లయితే, నిశ్చయముగా నేటి వాగ్దానము ద్వారా మీరు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, నేడు నీ యొక్క స్వాస్థ్యమును మాకు అనుగ్రహించుము, ఈ రోజు నుండి మేము వర్థిల్లతను చూచునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, ఈ రోజు నుండి మేము అన్నిటి యందును మరియు మా వ్యాపారము యందును వర్థిల్లునట్లుగా చేయుము. యేసయ్యా, నీ నామమున మా ఋణములన్నిటి నుండి మమ్మును విడిపించుము. ఇంకను, మా అవసరతలన్నియు సంధించబడునట్లుగా మా ఆర్థికమంతయు పరిపూర్ణముగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, ఎటువంటి అనవసరమైన ఖర్చులు మాకు మరియు మా కుటుంబమునకు రాకుండా, మమ్మును వర్థిల్లజేయుము. దేవా, మా కుటుంబ జీవితాలలోను, వ్యాపారములలోను గొప్ప సమాధానమును కలుగజేయుము. ప్రభువా, ఈ లోకము మాకు ఏమియు ఇవ్వకపోయినా, నీలో మాకు స్వాస్థ్యము కలదనియు, అది, నిత్యము క్షీణించని లేదా విఫలం కాని స్వాస్థ్యము ఉందని నీ వాక్యం ప్రకటించుచున్నది. కనుకనే, అటువంటి స్వాస్థ్యమును నేడు మాకు దయచేయుము. యేసయ్య, మమ్మును నీ బిడ్డలనుగా మరియు నీ వాగ్దానాలన్నింటికి వారసులముగా ఉండడానికి సిలువపై నిన్ను నీవు త్యాగం చేసుకున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, ఇప్పుడు మమ్మును నీ విలువైన రక్తంతో కడుగుము, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము మరియు మమ్మును నీ పరిపూర్ణమైన మార్గాల్లో నడిపించుము. మా దేవా, నీకు మా జీవితాలను నీ హస్తాలకు మేము సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నీవు మమ్మును ఉన్నత స్థానాలకు వర్థిల్లింపజేస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మా జీవితం నీ మంచితనం మరియు విశ్వాసానికి సాక్ష్యంగా ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా మేము మా స్వాస్థ్యపు జన్మ హక్కు లేదా కుటుంబ పేరు ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తు కృప ద్వారా పొందుకొనునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచూ యేసు క్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.